వనం చేరిన సమ్మక్క.. | Sakshi
Sakshi News home page

వనం చేరిన సమ్మక్క..

Published Sun, Feb 25 2024 5:08 AM

Ended Medaram Mahajatara - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:  తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర ముగిసింది. నాలుగు రోజులుగా కోటిన్నర మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను శనివారం సాయంత్రం వడ్డెలు (గిరిజన పూజారులు) ప్రత్యేక పూజల మధ్య వనప్రవేశం చేయించారు. ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరిరోజు కూడా భక్తులు పోటెత్తారు. వనదేవతలు అడవికి చేరే వేడుక సమయంలో వాన జల్లులు కురవడం గమనార్హం. 

చివరిరోజు కార్యక్రమం ఇలా.. 
సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వన ప్రవేశం ప్రక్రియ శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలై సుమారు రాత్రి ఏడున్నర వరకు సాగింది. తల్లులను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి అడవిలోకి చేర్చారు.

ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర గిరిజన ఆచారాలతో ప్రత్యేక పూజలు జరిగాయి. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని వడ్డెల బృందం గద్దెలపైకి చేరుకుంది. పూజల తర్వాత సమ్మక్క తల్లిని గద్దెల ప్రాంగణం నుంచి భక్తులను దాటుకుంటూ బయటికి తీసుకెళ్లి రాత్రి 7.27 గంటల సమయంలో చిలకలగుట్టకు చేర్చారు.

ఇలా ఓవైపు వనప్రవేశ పూజలు జరుగుతుండగానే గిరిజన సంప్రదాయం ప్రకారం.. సమ్మక్క గద్దెలపై భక్తులు సమర్పించిన చీరసారెలు, బంగారం, పసుపు కుంకుమలను స్థానికులు తీసుకునే కార్యక్రమం జరిగింది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు పోటీపడ్డారు. దీనితో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. 



కన్నెపల్లికి సారలమ్మ.. 
సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు సారలమ్మ గద్దె వద్ద గిరిజన సంప్రదాయం ప్రకారం రహస్య పూజలు నిర్వహించారు. గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కాక సారయ్య నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మొంటె (వెదురుబుట్ట)ను తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. ఈ సమయంలో భక్తులు పూజారులను తాకడానికి ప్రయత్నించారు.

మరోవైపు గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద కూడా చివరిరోజు పూజలు జరిగాయి. ఊరేగింపుగా పగిడిద్దరాజును మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు.. గోవిందరాజులును ఏటూరునాగారం మండలం కొండాయికి తీసుకెళ్లారు. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి దేవతల వనప్రవేశ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు సమర్పించుకున్నారు.

దేవతల వనప్రవేశంతో మేడారం మహా జాతర ముగిసిందని ములుగు జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి ప్రకటించారు. ప్రస్తుత మేడారం జాతరకు మొత్తంగా 1.45 కోట్ల మంది భక్తులు వచ్చారని.. వారు ఇక్కడికి చేరుకునేందుకు లక్షన్నర వాహనాలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
 
బుధవారం తిరుగువారం పండుగ.. 
సమ్మక్క–సారలమ్మలకు ఈనెల 28న పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన తర్వాత ఇలా తిరుగువారం పండుగ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని.. జాతరకు వచ్చిన భక్తులు చల్లంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటామని పూజారులు తెలిపారు. తిరుగువారం పండుగ సందర్భంగా బుధవారం మేడారం గ్రామస్తులు, ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు ఇళ్లను అలికి శుద్ధి చేస్తారు.

సమ్మక్కకు ప్రత్యేక పూజలు చేస్తారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. పూజారులు జాతర సమయంలో తమకు ఇళ్లకు ఆహా్వనించిన బంధువులకు కొత్త వస్త్రాలు పెట్టి సాగనంపుతారు. మేడారం మహాజాతర తిరిగి 2026 మాఘమాసంలో జరగనుంది.

గద్దెను వీడి వనప్రవేశం చేసినదిలా.. 
5.10 గంటలకు గోవిందరాజులు 
5.30 గంటలకు పగిడిద్దరాజు 
7.27 గంటలకు సమ్మక్క వనప్రవేశం 
7.40 గంటలకు సారలమ్మ వనప్రవేశం 
ఆనవాయితీ ప్రకారం తొలుతగా గోవిందరాజులు, పగిడిద్దరాజులను గద్దెల మీది నుంచి సాగనంపుతారు. వారు వెళ్లగానే సమ్మక్క వన ప్రవేశ కార్యక్రమం ఉంటుంది. చివరిగా సారలమ్మను తీసుకెళతారు.

Advertisement
 
Advertisement