అభ్యర్థులు సహకరించాలి | Sakshi
Sakshi News home page

అభ్యర్థులు సహకరించాలి

Published Thu, May 23 2024 5:20 AM

అభ్యర్థులు సహకరించాలి

నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు అధికారులకు సహకరించాలని, జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్‌ బి.లత్కర్‌ విజ్ఞప్తి చేశారు. సంయమనం పాటించాలని అభ్యర్థులు తమ కార్యకర్తలకు సూచించాలని కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గుర్తింపు పొందిన ప్రధాన పార్టీలు ఏజెంట్ల నియామకానికి ఫామ్‌–18 రెండు సెట్లను అందించాలని సూచించారు. ఒక సెట్‌ను పోలీస్‌ విభాగానికి పంపించి పూర్వాపరాలను తనిఖీ చేయిస్తామని వెల్లడించారు. ఎటువంటి కేసులూ లేని వారిని మాత్రమే ఏజెంట్లుగా అనుమతిస్తామని స్పష్టం చేశారు. జేఎన్టీయూ కౌంటింగ్‌ కేంద్రం చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని, 100 మీటర్లలోపు ఎవరి వాహనాలకూ అనుమతి లేదని వివరించారు. గుర్తింపు కార్డులు ఉంటేనే లోపలకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. జేఎన్టీయూ మెయిన్‌ గేటు వద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి, అన్ని స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి సీసీ కెమెరాల ద్వారా అనుసంధానించామని వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్లన్నింటినీ జూన్‌ 3న కట్టుదిట్ట భద్రత నడుమ కౌంటింగ్‌ సెంటర్‌కు తరలిస్తామని వివరించారు. రెండురోజుల్లో కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతుల గురించి వివరించారు. ముందు పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కిస్తారని వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, పార్లమెంట్‌ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌కు అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున, మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాలకు మూడు చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌కు 18 టేబుళ్లను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకం, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు

ఆస్కారమివ్వద్దు

ఏ కేసులూ లేనివారికే కౌంటింగ్‌

ఏజెంట్లుగా అనుమతి

పోస్టల్‌ బ్యాలెట్ల తర్వాతనే

ఈవీఎంల ఓట్లు లెక్కింపు

రాజకీయ పార్టీల ప్రతినిధులతో

కలెక్టర్‌ శ్రీకేశ్‌ బి.లత్కర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement