వరదలతో బ్యారేజీలకు ముప్పు! | Sakshi
Sakshi News home page

వరదలతో బ్యారేజీలకు ముప్పు!

Published Wed, Feb 21 2024 4:20 AM

Dam Safety Review Panel visited the barrages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/కాళేశ్వరం: వచ్చే వానాకాలంలో గోదావరికి వచ్చే వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ చట్టం కింద ఏర్పాటైన ‘డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానెల్‌’మంగళవారం రెండు బ్యారేజీలను సందర్శించింది.

నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(అడ్మిన్‌) అనిల్‌ కుమార్‌ నేతృత్వంలో డిజైన్‌ ఎక్స్‌పర్ట్‌ టి.రాజశేఖర్, సీఈ సీడీఓ, స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (ఎస్డీఎస్‌ఓ) ఇంజనీర్ల బృందం రెండు బ్యారేజీలను పరిశీలించిన అనంతరం సత్వరంగా తీసుకోవాల్సి న నష్టనివారణ చర్యలపై చర్చించింది. గోదావరిలో మళ్లీ 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు ఉండటంతో ఈ బృందం అక్కడ పర్యటించింది.

నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. అన్నారం బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు నిర్వహించిన తర్వాతే నీళ్లు నింపాలని గతంలోనే ఎన్డీఎస్‌ఏ సూచించింది. మరమ్మతులు జరిగే వరకు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు.  

మళ్లీ అన్నారం బ్యారేజీకి ఎన్డీఎస్‌ఏ 
ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోగా, మళ్లీ భారీ వరదలొస్తే ఇతర బ్లాకులు సైతం ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో అన్నారం బ్యారేజీకి రెండు పర్యాయాలు బుంగలు ఏర్పడి పెద్ద మొత్తంలో నీళ్లు లీకయ్యాయి. అన్నారంబ్యారేజీ పునాదుల (రాఫ్ట్‌) కింద నిర్మించిన కటాఫ్‌ వాల్స్‌కి పగుళ్లు వచ్చి ఉంటాయనడంలో అనుమానాలు లేవని.. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ గత అక్టోబర్‌లో బ్యారేజీని పరిశీలించిన అనంతరం తన నివేదికలో చెప్పింది.

బ్యారేజీకి నిర్దిష్టంగా లీకేజీలు పునరావృతం కావడాన్ని చూస్తే ఎగువ, దిగువ కటాఫ్‌ వాల్స్‌లో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ పగుళ్లు వచ్చి ఉంటాయని స్పష్టం చేసింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ దక్షిణాది ప్రాంతీయ డైరెక్టర్‌ ఆర్‌.తంగమణి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హైదరాబాద్‌ డైరెక్టర్లు ఎం.రమేశ్‌కుమార్, పి.దేవేందర్‌ రావు కమిటీ అప్పట్లో ఈ నివేదిక ఇచ్చింది. గత శుక్రవారం అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు పడటంతో ఎన్‌డీఎస్‌ఏ సూచన మేరకు బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేశారు.

ఈ వారం చివరిలోగా నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ బృందం రెండోసారి అన్నారం పరిశీలనకు రానుంది. కటాఫ్‌వాల్స్‌కి లేదా కటాఫ్‌వాల్స్‌–ర్యాఫ్ట్‌ మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించడానికి గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్స్‌(జీపీఆర్‌) వంటి సాంకేతిక పద్ధతులను వినియోగించాలని గతంలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ సిఫారసు చేయగా, ఇప్పటివరకు అలాంటి చర్యలేమీ తీసుకోలేదు.  

Advertisement
Advertisement