వీడని తీరుగా.. ఈ మాటల్లో గురు-శిష్యుల బంధం.. | Sakshi
Sakshi News home page

వీడని తీరుగా.. ఈ మాటల్లో గురు-శిష్యుల బంధం..

Published Tue, Apr 30 2024 2:48 PM

Ksr Comments On Revanth Reddy's Behavior To Support For Chandrababu

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూని గమనించారా? అందులో ఆయన ఒక అంశానికి ఇచ్చిన సమాధానం చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విధేయుడుగానే కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, రేవంత్ మనసు మాత్రం చంద్రబాబుపైనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని కనిపెట్టారు. ఓకే. ఏదో కాంగ్రెస్ పార్టీ నేత కనుక, ఆ పార్టీతో  వైఎస్సార్‌సీపీకి సంబంధం లేదు కనుక అలా మాట్లాడారులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆశ్చర్యంగా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చేలా చంద్రబాబుకు అనుకూలంగా అభిప్రాయాలు చెప్పడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది.

తెలుగుదేశం పార్టీని ఏపీలో భుజాన వేసుకుని మోస్తున్న ఒక పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే?, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గెలుస్తున్నట్లు తమకు సమాచారం అందిందని కేసీఆర్‌, కేటీఆర్‌ అంటున్నారు.. ఇదేమైనా రాజకీయ వ్యూహమా? ఆ వ్యాఖ్య ప్రభావం తెలంగాణలో పడే అవకాశం ఉందా అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగారు. దానికి రేవంత్ ఏమి సమాధానం ఇచ్చారంటే.. చంద్రబాబునాయుడుపై ఉండే అసూయ, ద్వేషం.. అంతకంటే ఏమి ఉంటుంది? కేసీఆర్‌కు ఏదో ఓ బాధ, దుఃఖం. కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిల మధ్య అవగాహన ముందు నుంచి ఉన్నదే. చంద్రబాబు అరెస్టును కూడా సమర్దించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌ ఒక జట్టుగా వ్యవహరిస్తున్నారు.. అని రేవంత్ బదులు ఇచ్చారు. ఈ జవాబు ద్వారా తాను, బీజేపీ కూటమిలో ఉన్న చంద్రబాబు ఒక జట్టు అని రేవంత్ చెప్పకనే చెప్పేశారు.

మరో ప్రశ్న ఏమిటంటే ఏపీ ఎన్నికల ఫలితాలపై మీ అంచనా అని అడిగారు..!?
'ఎక్కడైనా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. వాళ్లు చెప్పిన మాట నిలబెట్టుకోనందువల్ల ప్రతికూల వాతావారణం ఉంది. మేం షర్మిల నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ ఇన్నింగ్స్ ప్రారంభించాం. ఎన్ని సీట్లు గెలిపించుకోగలం? షర్మిల ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఎలా కొట్లాడుతున్నారు? ఆమెను ఎలా మద్దతుగా నిలబడాలి? అనేదే నా ప్రణాళిక. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనేదే మా రాజకీయ ప్రణాళిక. ఈసారి అక్కడ అన్ని సీట్లలో పోటీ దిగాం. మా దృష్టంతా కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికే'...

"రేవంత్ సమాధానాలు చూస్తే ఏమనిపిస్తుంది! చంద్రబాబుపైన కేసీఆర్‌ కోపం ద్వేషం ఉన్నాయట. అదే నిజమైతే ఓటుకు నోటు కేసులో ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు నాయుడు పేరు కూడా కేసీఆర్‌ ప్రభుత్వం చేర్పించి ఉండేది కదా! ఆ కేసులో రేవంత్ నేరుగా దొరికిపోతే, చంద్రబాబు మొత్తం కథకు సూత్రధారి. ఏ కేసులో అయినా కుట్రదారులను పట్టుకోకుండా ఉంటారా? కేసు పెట్టకుండా ఉంటారా? ఇక కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక జట్టు అని రేవంత్ తేల్చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నడైనా తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టారా? నిజంగానే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కనుక తెలంగాణ రాజకీయాలలో కూడా తన పాత్ర పోషించడం ఆరంభిస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుందో రేవంత్ ఊహించుకోలేని అమాయకుడు కాదు.

చంద్రబాబు అరెస్టును కేసీఆర్‌ సమర్ధించారట. అప్పట్లో కేసీఆర్‌ ఆ ఉదంతంపై ఎక్కడా స్పందించలేదు. పైగా కేటీఆర్‌ కూడా చంద్రబాబు అరెస్టుపై సానుభూతి వ్యాఖ్యలే చేశారు. మరో మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఏకంగా ఖండించారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే చంద్రబాబు అవినీతి కేసులో ఉన్నా అరెస్టు చేయకూడదని రేవంత్ చెబుతున్నారా? అలాంటప్పుడు కేసీఆర్‌ పై నిత్యం అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయనతో పాటు, కేటీఆర్‌, హరీష్ రావులను కూడా జైలుకు పంపుతామని ఎలా అంటున్నారు. అంటే చంద్రబాబు తప్ప ఇంకెవరిపైన అయినా కేసులు పెట్టవచ్చని రేవంత్ చెబుతున్నారా. చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని రేవంత్ వదులుకోలేకపోతున్నారని అనుకోవాలి.

చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆయన నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయినా ఆయన కోసం సానుభూతి వచనాలు పలకడం ద్వారా రేవంత్ తన గురు, శిష్య సంబంధాన్ని వదలుకోలేకపోతున్నారని చెప్పాలి. తెలంగాణలో బీజేపీపై ఘాటైన విమర్శలు చేస్తున్న రేవంత్ ఏపీలో ఎందుకు మాట్లాడలేదు. బీజేపీ ఊసే ఎత్తలేదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశంకు ఓటు వేయవద్దని అనలేదు. కాంగ్రెస్ గురించి ఏదో మొహమాటానికి మాట్లాడినట్లు అనిపించింది. పైగా ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉందని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత గురించి నేరుగా అనకపోయినా, ఆయన ఉద్దేశం అర్థం అవుతూనే ఉంది.

విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ తోను ఏకకాలంలో జట్టుకట్టి రాజకీయం చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడంలోను, ఆ తర్వాత ఆమె చేస్తున్న ప్రకటనలలోను చంద్రబాబు పాత్ర ఉందన్న సంగతి బహిరంగ రహస్యం. ఇందులో ఎవరిది తప్పు అంటే ఏమి చెబుతాం. కాంగ్రెస్ నేతలుగా ఉన్న రేవంత్, షర్మిలలు తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని భావిస్తున్నారు. అంతే తప్ప బీజేపీతో మద్దతు కట్టిన టీడీపీ అనుకోవడం లేదు. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు తరచుగా రేవంత్ పై ఒక ఆరోపణ చేస్తుంటారు. బీజేపీ అగ్రనేతలతో కూడా రేవంత్ సంబంధాలు పెట్టుకున్నారని, భవిష్యత్తులో ఈయన బీజేపీలోకి జంప్ చేయవచ్చని ప్రచారం చేస్తుంటారు. ఇందులో నిజం ఉండకపోవచ్చు. కానీ ఏపీ రాజకీయాలలో ఈయన అనుసరించిన ధోరణి గమనిస్తే మాత్రం ఈయనకు నిజంగా బీజేపీ సిద్దాంతం పైన, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీపైన వ్యతిరేకత లేదన్న భావన కలుగుతుంది.

ఒకప్పుడు చంద్రబాబుతో తనకు సంబంధం లేదని పైకి అన్నప్పటికీ, అధికారం వచ్చాక రేవంత్ తన మనసులో మాట బయటపెట్టారని అనుకోవచ్చు. ఒక వైపు ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉందని చెబుతున్న ఆయన తన ప్రభుత్వం గురించి ప్రజలలో మంచి అభిప్రాయం ఉందని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు తన పాలనకు రిఫరెండమ్ అని అంటున్నారు. రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే, అచ్చం తన గురువు చంద్రబాబు మాదిరే చేస్తున్నట్లుగా ఉంది. ఆరు గ్యారంటీలలో ఐదు అమలు చేశామని అంటున్నారు. నిజంగా అలా చేసి ఉంటే గొప్ప విషయమే అవుతుంది. కానీ ఒక్కో గ్యారంటీలోని కొన్ని అంశాలను అమలు చేసి, మిగిలినవాటిని పక్కనబెట్టిన సంగతి ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారు.

ఉదాహరణకు ఆర్టీసీ బస్‌లలో మహిళల ఉచిత ప్రయాణం కల్పించిన మాట నిజమే. కానీ ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్న వాగ్దానం గురించి ఎందుకు చెప్పరు? గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలు ఎక్కడ అమలు అవుతున్నాయో ఎవరికి తెలియదు. పాతికవేల కోట్ల అప్పులు తీర్చామని చెప్పారు. బాగానే ఉంది. మరి 17వేల కోట్ల అప్పు ఎందుకు చేశారో వివరించాలి కదా? రైతు రుణమాఫీపై వాయిదాలు వేస్తూ ఆగస్టు పదిహేను అని అంటున్నారు. నిజంగా అప్పుడు చేస్తే గొప్ప విషయమే.

కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుంటామని అంటున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలాంటి ప్రయత్నం చేయకపోలేదు. అప్పట్లో కేంద్రంలో ఉన్నది తన అనుకూల ప్రభుత్వమే అయినా, ఆయన ప్రతిపాదనకు రిజర్వు బ్యాంక్ ఒప్పుకోలేదు. ఇప్పుడు రేవంత్ ఎలా చేయగలుగుతారో చూడాలి. పలు ప్రాంతాలలో కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. పద్నాలుగు సీట్లు సాధిస్తామని అంటున్నారు. తన ప్రభుత్వంలో తప్పు చేయలేదని అంటున్నారు. మంచిదే. ప్రజలను నిరాశపరచలేదని, కనుక రిఫరెండంగా భావిస్తున్నామని రేవంత్ అన్నారు.

ఇది పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ క్యాడర్‌లో ఒక విశ్వాసం నెలకొల్పడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఒకవేళ రేవంత్ చెప్పినట్లు 14 సీట్లు సాధిస్తే కాంగ్రెస్‌లో తిరుగులేని నేత అవుతారు. అలాకాకపోతే ఆయన రిఫరెండమే ఆయనకు తలనొప్పిగా మారుతుంది. ఏది ఏమైనా ఏపీలో చంద్రబాబుకు మేలు చేకూర్చే పనిలో ఉన్న కాంగ్రెస్ నేతగా వ్యవహరిస్తారా? లేక బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీని వ్యతిరేకించి సిద్ధాంతానికి కట్టుబడి ఉండే నేతగా ఉంటారా! అన్నది ఆయనే తేల్చుకోవాలి.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement

తప్పక చదవండి

Advertisement