స్విట్జర్లాండ్‌కు పోటీగా కశ్మీర్‌  | Sakshi
Sakshi News home page

స్విట్జర్లాండ్‌కు పోటీగా కశ్మీర్‌ 

Published Wed, Feb 21 2024 5:18 AM

Article 370 was biggest hurdle in development of Jammu and Kashmir says PM Modi - Sakshi

జమ్మూ: ఆర్టీకల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సామాజిక న్యాయం, సమీకృత అభివృద్ధి అనే కొత్త శకంలోకి కశ్మీర్‌ అడుగుపెట్టిందన్నారు. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కశ్మీర్‌ లోయను పర్యాటకానికి గమ్యస్థానంగా, స్విట్జర్లాండ్‌కు పోటీగా అన్ని విషయాల్లోనూ అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. జమ్మూకశ్మీర్లో కొత్త శకం ఆరంభమైందని, ఇక్కడి ప్రజలు వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి పొందారని పేర్కొన్నారు.

గతంలో అధికారం చెలాయించిన వారసత్వ పాలకులు సొంత ప్రయోజనాలు తప్ప ప్రజల బాగోగులు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. మోదీ మంగళవారం జమ్మూకశ్మీర్లో పర్యటించారు. రూ.32,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వోద్యోగాలు పొందిన వారితో, పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. ఉధంపూర్‌–శ్రీనగర్‌–బారాముల్లా రైల్‌ లింక్‌లో దేశంలోనే అతిపెద్దదైన 12.77 కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం జమ్మూలో బహిరంగ సభలో ప్రసంగించారు. గల్ఫ్‌ దేశాల నుంచి జమ్మూకశ్మీర్కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కశ్మీర్‌ను రైలు మార్గం ద్వారా కన్యాకుమారితో అనుసంధానించే రోజు దగ్గర్లో ఉందన్నారు.

ఆ అడ్డుగోడ కూల్చేశాం..   
జమ్మూకశ్మీర్లో నిత్యం బాంబులు, తుపాకులు, కిడ్నాప్‌లు, వేర్పాటువాదం వార్తలొచ్చే రోజులు పోయాయని, సమతులాభివృద్ధితో కూడిన నూతన కశ్మీర్‌ కనిపిస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక రంగ ప్రగతితోపాటు అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే భక్తుల సంఖ్య పెరుగుతుండడం పట్ల స్రంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీకల్‌ 370 రద్దు నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

ఐఐఎం క్యాంపస్‌లు ప్రారంభం  
ఐఐఎం–జమ్మూ, ఐఐఎం–బోద్‌గయ, ఐఐఎం–విశాఖపట్నం క్యాంపస్‌లను మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఐఐటీ–భిలాయ్, ఐఐటీ–తిరుపతి, ఐఐటీ–జమ్మూ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల క్యాంపస్‌లను జాతికి అంకితం చేశారు. 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 నవోదయ పాఠశాలల శాశ్వత క్యాంపస్‌లకు శంకుస్థాపన చేశారు. విద్యా రంగంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యమిస్తున్నామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement