ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు.. | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు..

Published Wed, Jan 6 2021 10:25 AM

Popular Author Vennelakanti Rajeshwar Prasad  Passed Away  - Sakshi

ప్రముఖ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్‌ మంగళవారం కన్నుమూశారు. ఆయనతో తమ అనుబంధాన్ని రచయితలు భువనచంద్ర, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పంచుకున్నారు. 

బుల్లబ్బాయ్‌ నా తోడబుట్టని తమ్ముడు 
34 ఏళ్ల పరిచయంలో ఏనాడూ మేం రైటర్స్‌లా మాట్లాడుకోలేదు. నన్ను ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు. నన్ను ‘అన్నయ్యా’ అంటే నేను ‘బుల్లబ్బాయ్‌’ అనేవాణ్ణి. నిన్న (సోమవారం)నే మాట్లాడుకున్నాం. ‘ఈ ఏడాది ఇంకా కలుసుకోలేదు, కలుద్దాం అన్నయ్యా’ అన్నాడు. సరే అన్నాను. ఇలా కలుసుకున్నాను తమ్ముణ్ణి. మనిషి లేడని ఊహకు కూడా అందటం లేదు. ఏ పేరుతో పిలిస్తే పలుకుతాడో తెలిస్తే బావుండు.. ఆ పేరుతో పిలుస్తాను. మనిషి చక్కగా నిద్రపోతున్నాడు. వెన్నెలకంటి అంటే వస్తాడా, బుల్లబ్బాయ్‌ అంటే వస్తాడా... ఎలా పిలిచినా రాకుండా అందనంత దూరం వెళ్లిపోయాడు. ‘ఈ రోజు వెళ్లిపోతున్నాను’ అన్నట్లుగా చూస్తున్నాడు.

ఎవరైనా కొంతకాలానికి వెళ్లవలసిన వాళ్లమే అని తెలుసు కానీ, ఎందుకో అంతా శూన్యంలా ఉంది. కన్నతల్లి కడుపునుండి నేలతల్లి వొళ్లోకొచ్చి ఆట, పాటలాడి ఎన్నో బంధాలను పేర్చుకుని చేసే ప్రయాణమే కదా జీవితం. మళ్లీ నేలతల్లిని ముద్దాడాడు తమ్ముడు. ఈ ఇద్దరమ్మల ప్రయాణంలో తన శరీరానికి పెట్టుకున్న పేరు ‘వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌’. ఇక లేడు అనే వార్త కలా? నిజమా? అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఏ సభకెళ్లినా, సన్మానాలకెళ్లినా, ఆంధ్రా క్లబ్‌లో పురస్కారాలకెళ్లినా అందరూ మమ్మల్ని అన్నతమ్ములొచ్చారు అనేవాళ్లు. ‘అన్నయ్యా.. మనిద్దరం నెల్లూరు వెళుతున్నాం. అక్కడ సభ ఉంది. మనిద్దరి పేరు ఇచ్చేశాను’ అనేవాడు. తిరిగొచ్చేటప్పుడు మా కబుర్లు ప్రపంచమంతా తిరిగేవి.

మా రెండు గొంతుల్లో ఒక గొంతు మూగబోయింది, మరో గొంతు పక్కన నిలబడి మౌనంగా రోదిస్తోంది. ఆయన పేరు, కీర్తి ప్రతిష్టలు.. అన్నింటినీ ఇక్కడే వదిలి ఈ రోజు నింగిలో కలిసిపోయాడు. పదివేల కోట్లున్నా ఏం చేసుకుంటాం? అనుభవించటానికి పక్కన సరైన మనిషి కావాలి కానీ.. ఆయన కోప్పడటం నేను చూడలేదు, ఏ సభలోనైనా అందరినీ గలగలా నవ్విస్తాడు. ప్రతిరోజూ నవ్వించే ఆ మనిషి ఈ రోజు ఏడిపిస్తున్నాడు (ఏడుస్తూ). మనసులో ఏదో తెలియని వెలితి. ‘ఐ మిస్‌ యు ఫర్‌ ఎవర్‌..  బుల్లబ్బాయ్‌’.
– రచయిత భువనచంద్ర

నలుగురం ఒక్కసారే వచ్చాం
‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు 1985లో, నేను 1986 సెప్టెంబర్‌లో, 1987 జనవరి 1న భువనచంద్ర వచ్చాం. వెన్నెలకంటి కూడా అప్పుడే పరిశ్రమలోకొచ్చారు. దాదాపు నలుగురం ఒకేసారి ఏడాది వ్యవధిలోనే  చిత్రపరిశ్రమకు వచ్చాం. వెన్నెలకంటి నాకు అత్యంత ఆత్మీయుడు. మాతో పాటు మా కుటుంబాలు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. వెన్నెలకంటి చనిపోయిన విషయం తెలియగానే ఆయన శ్రీమతితో మాట్లాడాను. మాట్లాడుతూనే గుండెపోటుతో పోయారట, ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేదని చెప్పారామె.

డబ్బింగ్‌ చిత్రాల్లో వండర్స్‌ క్రియేట్‌ చేసింది వెన్నెలకంటిగారే. పద్యకవిగా, పాటల కవిగా ప్రసిద్ధి చెందారు. ఆయనతో నాకు ఎన్నో మరపురాని సంఘటనలు ఉన్నాయి. ‘మైనే ప్యార్‌ కియా’ డబ్బింగ్‌ చిత్రానికి ఈయన రాసిన మాటలకు ముగ్ధుడైన ఆ హిందీ చిత్ర నిర్మాత తారాచంద్‌ బర్‌జాత్యా ఈయనకు పాదాభివందనం చేయటం నాకింకా గుర్తుంది. ఏదేమైనా ఈ రోజు అత్యంత ఆత్మీయుడిని కోల్పోవటం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.  
 – రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement