తీరంలో తనివితీరా! | Sakshi
Sakshi News home page

తీరంలో తనివితీరా!

Published Sun, Jul 9 2023 4:56 AM

Tourists rush to the beaches - Sakshi

సాక్షి ప్రతినిధి, బాపట్ల: సముద్రతీర ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాల రామాపురం, ఓడరేవు, పాండురంగాపురం బీచ్‌లను చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గతంతో పోలిస్తే సముద్ర తీరం చూసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిత్యం సందర్శకులు బీచ్‌లకు తరలివస్తున్నారు. వారాంతంలో సందర్శకుల సంఖ్య రెట్టింపునకు మించి ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడి బీచ్‌లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

విశాఖ, గోవా, చెన్నైలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి బాపట్ల, చీరాల బీచ్‌లు మరింత దగ్గరగా ఉన్నాయి. రైల్వేతో పాటు ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. సొంత వాహనాలే కాకుండా రైల్లో రావాలనుకునేవారికి మరింత అనుకూలంగా ఉంది. ఖర్చుకూడా తక్కువవుతుండటంతో ఇక్కడ సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్‌లో చీరాల, బాపట్ల తీరప్రాంతంలోని బీచ్‌లకు రోజుకు 50 వేలకు మించి సందర్శకులు వస్తున్నారు.

మిగిలిన రోజుల్లోనూ 20 వేల మందికి తగ్గకుండా వస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, నరసరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి, బాపట్లలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావన్నారాయణస్వామి, పొన్నూరులోని శ్రీ ఆంజనేయస్వామి లాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉండటంతో సందర్శకులు అటు దేవాలయాలను, ఇటు బీచ్‌లను చూసుకుని వెళుతున్నారు. 

పర్యాటకాభివృద్ధికి పెద్దపీట.. 
తీరంలో సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇక్కడ పర్యాటకాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తీరప్రాంతానికి రోడ్లు వేసి రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చింది. తీరప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో సొంతంగా రిసార్టుల నిర్మాణానికి సిద్ధమైంది.

పెరిగిన రిసార్ట్‌లు
బీచ్‌లకు సందర్శకులు పెరగడంతో అంతే స్థాయిలో ఇక్కడ రిసార్టులూ పెరుగుతున్నాయి. బాపట్ల సూర్యలంకలో 32 రూమ్‌లతో హరిత రిసార్ట్స్‌ హోటల్‌ ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో రిసార్ట్స్‌ ఏర్పాటు చేసింది. రోజూ 90 శాతం రూమ్‌లు ఫుల్‌ అవుతుండగా.. వీకెండ్స్‌లో వందశాతం నిండిపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రద్దీ 50 శాతానికి పైగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

గతంలో నెలకు రూ.20 లక్షల వ్యాపారం జరగ్గా..  ఇప్పడది రూ.40 లక్షలకు పెరిగిందని హరిత రిసార్ట్స్‌ మేనేజర్‌ చెప్పారు. హరిత రిసార్ట్స్‌లో రోజుకు రూమ్‌రెంట్‌ రూ.2,500 నుంచి 4,500 వరకూ ఉంది. ఇక ఈ ప్రాంతంలో గోల్డెన్‌శాండ్, వీ.హోటల్‌ , సీబ్రీజ్, రివేరా తదితర పేర్లతో వందలాది రూమ్‌లతో కార్పొరేట్‌ స్థాయి ప్రైవేటు రిసార్ట్స్‌లు పెద్ద ఎత్తున వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌రెంట్‌ రూ.10 వేల నుంచి 20 వేల వరకూ ఉంది.

ఆన్‌లైన్‌ బుకింగ్స్‌తో ఇవి నిత్యం నిండిపోతున్నాయి. ఇక సాధారణ స్థాయిలో వందలాదిగా రిసార్ట్‌లు వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌కు రూ.3 వేలకు పైనే రెంట్‌ ఉంది. చీరాల, బాపట్ల పట్టణాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా హోటళ్లు వెలిశాయి. బీచ్‌ల ఎఫెక్ట్‌తో అన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. నాణ్యంగా ఫుడ్‌ ఉంటుందని పేరున్న హోటళ్లకు మరింత డిమాండ్‌ ఉంది.

గోవా బీచ్‌ కన్నా బాగుంది   
సూర్యలంక బీచ్‌ గోవా బీచ్‌ కన్నా బాగుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. మొదటిసారి సూర్యలంక బీచ్‌కు వచ్చాం. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. బీచ్‌ పరిశుభ్రంగా ఉంది. సెక్యూరిటీ కూడా బాగుంది.    – సాద్, అతీఫ్, అమాన్‌అలీ,  నాసిద్‌.. హైదరాబాద్‌  

ఖర్చు చాలా తక్కువ 
రైలు సౌకర్యం అందుబాటులో ఉండటంతో చీరాల, బాపట్ల బీచ్‌లకు రాగలుగుతున్నాం. ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతోంది.  బీచ్‌ చాలా బాగుంది. ప్రైవేటు రిసార్ట్‌లలో అద్దె చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారు.    – నవీన్, ప్రభాకర్, అజయ్‌.. మిర్యాలగూడ  

మూడేళ్లుగా మరింత రద్దీ 
సూర్యలంక, చీరాల ప్రాంతంలోని బీచ్‌లకు సందర్శకులు పెరిగారు. మూడేళ్లుగా పర్యాటకుల రద్దీ మరింతగా పెరిగింది. సోమవారం నుంచి గురువారం వరకు 90 శాతం రూమ్‌లు బుక్‌ అవుతుండగా.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 100 శాతం బుక్‌ అవుతున్నాయి. హోటల్‌ వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. రద్దీ పెరగడం వల్లే ఈ ప్రాంతంలో రిసార్టులు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి.      – నాగభూషణం, మేనేజర్, హరిత రిసార్ట్స్‌

Advertisement
 
Advertisement