గుబులు పుట్టిస్తోన్న ఎండ వేడి.. గిర్రున మీటర్లు | Sakshi
Sakshi News home page

గుబులు పుట్టిస్తోన్న ఎండ వేడి.. గిర్రున మీటర్లు

Published Thu, May 18 2023 4:48 AM

Kakinada district is first in electricity consumption - Sakshi

సాక్షిప్రతినిధి,కాకినాడ: వేసవి ప్రభావం విద్యుత్‌ వినియోగంపై పడుతోంది. ప్రతి ఇంటా విద్యుత్‌ మీటర్‌ గిర్రున తిరుగుతోంది. నెల బిల్లులు రెట్టింపు అవుతున్నాయి. అయినా జనం ఎడాపెడా కరెంటు వాడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈనెలలో వాడకం బాగా పెరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గృహ విద్యుత్‌ వినియోగం 50శాతం పైనే ఉందని ఏపీఈపీడీసీఎల్‌ వర్గాలు లెక్కలేస్తున్నాయి.

గడచిన రెండు వారాలుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫలితంగా ఏసీల వినియోగం పెరిగింది.ప్రస్తుతం రోజూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో విద్యుత్‌ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ, రాత్రి 8 నుంచి తెల్లవారేవరకు ఏసీలు వాడుతున్నారు.

గడచిన ఏప్రిల్‌లో మధ్యాహ్నం ఒక గంట, రాత్రి రెండు, మూడు గంటలు మాత్రమే ఏసీలు, ఫ్యాన్‌లు వినియోగించే వారు. ఇప్పుడు ఏసీలతో పాటు ఫ్యాన్‌ల వినియోగం కూడా మూడొంతులు పెరిగిపోయింది. మార్చి, ఏప్రిల్‌తో పోలిస్తే మే వచ్చేసరికి ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. వారం రోజులుగా మరింత తీవ్రంగా ఉంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే విద్యుత్‌ వినియోగం అమాంతం పెరిగిపోతోంది.
 
ఈనెల గుండె గు‘భిల్లు’
ఉదాహరణకు రెండు ఫ్యాన్‌లు, ఒక ఏసీ, మూడు ట్యూబులైట్‌లు ఉన్న ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబ విద్యుత్‌ వినియోగం ఏప్రిల్‌లో సగటున 185 యూనిట్లు నమోదైంది. అంటే రూ.800 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ నెలలో అదే తరహా కుటుంబ బిల్లు చూస్తే 300 యూనిట్లు దాటిపోయింది. అంటే రూ.1500 చెల్లించాలి. ఇలా ప్రతి కుటుంబంలో స్థాయిని బట్టి వినియోగం పెరిగింది.

గతేడాది మేతో పోలిస్తే ఈ ఏడాది వినియోగంలో భారీగా పెరిగింది. గతేడాది మే 10న 11.575 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ను వాడారు. తాజాగా ఈ నెల 10న  సుమారు ఐదారు మిలియన్‌ యూనిట్లు అదనంగా వాడారని తేలింది. ఇలా ఈ నెలలో 10 నుంచి 16 వరకు పరిశీలిస్తే గతేడాడి కంటే ఐదారు మిలియన్‌ యూనిట్లు అదనంగా వాడినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గృహవినియోగం 50శాతం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా విద్యుత్‌ వాడకంలో (జగ్గంపేట విద్యుత్‌ డివిజన్‌తో కలిపి) 45శాతంతో మొదటి స్థానంలో ఉంది. కాకినాడ నగరంతో పాటు మెట్ట ప్రాంత మండలాల్లో అత్యధికంగా కరెంటు వాడుతున్నారు. రామచంద్రాపురం డివిజన్‌తో కలిపి ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 30 శాతంతో రెండో స్థానం, 20శాతంతో రాజమహేంద్రవరం(నిడదవోలు సబ్‌ డివిజన్‌ మినహా) మూడో స్థానంలో ఉన్నాయి.

రంపచోడవరం విద్యుత్‌ సబ్‌డివిజన్‌లో మిగిలిన ఐదు శాతం వినియోగం నమోదైంది. గృహవిద్యుత్‌ వినియోగం 50శాతం పైనే ఉంది. వేసవికి ముందు రోజుకు 16 మిలియన్‌ యూనిట్లు ఉంటే ప్రస్తుతం 17 నుంచి 20 మిలియన్‌ యూనిట్లు వాడుతున్నారు. ఈ నెల 13న 20.08 మినియన్‌ యూనిట్లు క్రాస్‌ చేసింది.

నిరంతరాయంగా సరఫరా
విద్యుత్‌ వినియోగం పెరిగినా ఎక్కడా విద్యుత్‌ కోతలు లేకుండా ఈపీడీసీఎల్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం విద్యుత్‌ సరఫరాకు కృషి చేస్తున్నారు. గతంలో ప్రతి వేసవిలోనూ విద్యుత్‌కోతలతో ప్రజలు నరకం చూసే వారు. ప్రస్తుతం పెరుగుతోన్న వినియోగానికి తగ్గట్టు ఉత్పత్తికి ఢోకా లేకపోవడంతో కోతల ఊసే లేదు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు.  విద్యుత్‌ సరఫరాలో లోపాలు తలెత్తుతుంటే డివిజన్‌ స్థాయిలో అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందిస్తున్నారు. విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు

డిమాండ్‌కు దగ్గట్టుగా ఉత్పత్తి
వేసవి దృష్ట్యా వినియోగం పెరిగినప్పటికీ సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉంది. గతంలో మాదిరిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోతలు ఎక్కడా విధించడంలేదు. అత్యవసర మరమ్మతులు, లైన్‌లలో నిర్వహణాలోపాలు తలెత్తినప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. 24 గంటలు విద్యుత్‌ సరఫరాకుఎక్కడా ఇబ్బంది లేదు. భవిష్యత్‌ అవసరాలకు పూర్తిగా విద్యుత్‌ అందుబాటులో ఉంది.  – పి.వి.ఎస్‌.మూర్తి, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్‌

Advertisement
 
Advertisement