చంద్రబాబు పాత్ర సుస్పష్టం | AP CID Additional DG Sanjay Revealed - Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాత్ర సుస్పష్టం

Published Fri, Sep 15 2023 5:07 AM

AP CID Additional DG Sanjay revealed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచుకున్నారని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిలు తెలిపారు. ఈ అడ్డగోలు అవినీతికి పూర్తి ఆధారాలు­న్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఈ స్కామ్‌ తాలూకు ఫైళ్లపై 13 డిజిటల్‌ సంతకాలు చేశారని  వెల్లడించారు.

ఆ సంతకాల కాపీలను మీడియా ఎదుట ప్రదర్శించారు. అగ్రిమెంట్లలో కనీసం తేదీ వేయకపోవడం, లెటర్‌ నంబర్‌ ప్రాంతాల్లో ఖాళీలను వదిలిన విషయాన్ని బయటపెట్టారు. థర్డ్‌ పార్టీకి డబ్బులు ఇవ్వకూడ­దన్న నిబంధనలు పాటించలేదన్నారు. అన్ని వివరా­లను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌తో వివరించారు. ఈ కుంభకోణానికి తెరతీసేందుకు రూపొందించిన అగ్రిమెంట్‌లో లోపాలు మొదలు.. నిధుల మళ్లింపు, షెల్‌ కంపెనీల్లోకి వాటిని తరలించిన విధానం.. తద్వారా ఎలా లబ్ధిపొందారన్న పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.

సీమెన్స్‌ కంపెనీకి ప్రాజెక్టు గురించే తెలీదు

  • జీఓ నంబర్‌ 4 ఆధారంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, డిజైన్‌టెక్‌ కంపెనీ, సీమెన్స్‌ ఇండియా సాఫ్ట్‌వేర్‌ల మధ్య త్రైపాక్షిక అగ్రిమెంట్‌ జరిగినట్టు చూపారు. వాస్తవంగా జీవోలో ఉన్న అంశాలు, అగ్రిమెంట్‌లోని అంశాలు వేరుగా ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్‌ గురించి సీమెన్స్‌ కంపెనీకి తెలియదు. ఆ కంపెనీ పేరుతో కుట్రపూరితంగా ప్రాజెక్ట్‌ను రూపొంందించారు. 
  • ఈ అగ్రిమెంట్‌ పరిశీలిస్తే..అందులో జీఓ నంబర్, లెటర్‌ నంబర్, తేదీలు సైతం సరిగా లేవు. కేవలం డ్రాఫ్ట్‌గా తయారు చేసి, భవిష్యత్తులో నంబర్‌ వేసుకోవడానికి అనుకూలంగా ఉంచినట్టు నిర్ధారణ అవుతోంది. ఒరిజినల్‌ పత్రాలు పరిశీ­లిం­చాం. అవి నకిలీ అని నిర్ధారణ అయ్యింది. థర్డ్‌ పార్టీకి డబ్బులు ఇవ్వకూడదని అగ్రిమెంట్‌లో రా­సు­కున్నట్టు స్పష్టంగా ఉంది. అయినా థర్డ్‌ పార్టీకి రూ.330 కోట్లు వెళ్లినట్టు ఆధారాలు ఉన్నాయి.
  • డిజైన్‌టెక్‌ నుంచి ఈ మొత్తాన్ని పీవీఎస్‌పీ అనే షెల్‌ కంపెనీకి మళ్లించారు. అక్కడి నుంచి వివిధ షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు దక్కించుకున్నారు. 2014లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశాక ఆడిటర్‌గా జి వెంకటేశ్వర్లు అనే ప్రైవేటు వ్యక్తిని నియమించారు. గంటా సుబ్బారావును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యదర్శిగా, ఎక్స్‌ అఫీషియో సెక్రెటరీ టు సీఎంగా నియమించారు. 
  • ఇలా ఉన్నత విద్యా శాఖ పర్యవేక్షణ లేకుండా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి సీఎం కార్యాలయం నుంచే నేరుగా పనిచేసేలా ‘కావాల్సిన’ విధంగా పని పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. డిప్యూటీ సీఈఓగా యూపీ కేడర్‌కు చెందిన అపర్ణ అనే ఐఏఎస్‌ అధికారిని నియమించారు. ఆమె భర్త సీమెన్స్‌ తరఫున అగ్రిమెంట్ల తయారీలో పనిచేశా­రు.

తమ ప్రమేయమే లేదని ‘సీమెన్స్‌’ చెప్పింది 

  • గుజరాత్‌ తరహాలో యువతకు నైపుణ్యాభివృద్ధి అంటూ రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి తెరతీశారు. కనీసం పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేసి ఫలితాలను చూసి నిర్ణయం తీసుకుందామన్న అధికారుల ప్రతిపాదనను పట్టించుకోలేదు. రూ.371 కోట్లు కొల్లగొట్టడానికే ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. 
  • ఏపీఎస్‌ఎస్‌డీసీ చెబుతున్న రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌తో తమకు సంబంధం లేదని, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని సీమెన్స్‌ సంస్థ స్పష్టం చేసింది. తాము 90 శాతం నిధులను గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఇస్తామని ఎవ­రికీ చెప్పలేదని.. అసలు ఆ వ్యవహారంతో సీమె­న్స్‌ కంపెనీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు సీమెన్స్‌ కంపెనీ ఈ మెయిల్‌ ద్వారా వివరించడంతోపాటు న్యాయస్థానంలో 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. 
  • జర్మనీలోని సీమెన్స్‌ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు ఆ జీవో గురించి, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని వెల్లడించింది. భారత్‌లో సీమెన్స్‌ కంపెనీ ప్రతినిధిగా ఉన్న సుమన్‌ బోస్‌ మరికొందరు నిందితులతో కలసి జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి తెలియకుండా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నిర్ధారణ అయ్యింది.
  •  గుజరాత్‌లో కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందంలో సౌమ్యాద్రి బోస్‌గా సంతకాలు చేయగా, ఏపీలో ఉన్న ఒప్పందంలో మాత్రం సుమన్‌ బోస్‌ పేరిట సంతకాలు చేసినట్టు సదరు కంపెనీ వెల్లడించింది. సదరు కంపెనీ లీగల్‌ కౌన్సిల్‌ సైతం ఈ విషయాలను సీఐడీకి నిర్ధారించింది. 

సాఫ్ట్‌వేర్‌ కోసం డిజైన్‌టెక్‌ నుంచి రూ.58.80 కోట్లు 

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలోని రూ.371 కోట్లలో రూ.58.80 కోట్లు జర్మనీలోని తమ సీమెన్స్‌ కంపెనీకి వచ్చాయని, అయితే ఆ సొమ్ము తమ కంపెనీకి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి కానీ, ఏపీ ఆర్థిక శాఖ నుంచి కానీ రాలేదని ఆ కంపెనీ స్పష్టం చేసింది. డిజైన్‌ టెక్‌ సంస్థ కోరితే తాము రూ.58.80 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే ఆ కంపెనీకి విక్రయించామని తెలిపింది.
  • ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే రూ.58.80 కోట్లు ప్రభుత్వం నుంచి డిజైన్‌ టెక్‌ అనే సంస్థకు తొలుత చేరినట్టు రూడీ అవుతోంది. వాస్తవానికి అగ్రిమెంట్‌ ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ నగదు బదిలీ జరిగినట్టు స్పష్టం అవు­తోంది. సీఐటీడీ (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌) ప్రభుత్వానికి ఏ ప్రతిపా­ద­నలు ఇవ్వాలో కూడా సుమన్‌ బోస్‌ తయారు చేశా­రు. ఇంకా లోతుగా పరిశీలిస్తే.. సీఐటీడీ రిపో­ర్ట్‌ ఇవ్వకముందే రూ.200 కోట్లకు పైగా నగదు మళ్లించారు. ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

‘దశా’ంశాల ఆధారంగా దర్యాప్తు 

  • నకిలీ, కల్పిత ట్రై ప్యాట్రియేట్‌ అగ్రిమెంట్‌
  • ఎలాంటి నిబంధనలు పాటించకుండానే రూ.371 కోట్లు విడుదల 
  • నోట్‌ఫైల్‌లో రిమార్క్‌లు పూర్తిగా విస్మరించడమే కాక అధికారులపై తీవ్ర ఒత్తిడి   
  • ఈ కుంభకోణంలో తమ కంపెనీ పేరును వాడారని, అసలు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని సీమెన్స్‌ కంపెనీ ఈ మెయిల్‌ ద్వారా స్పష్టం చేసింది
  • గుజరాత్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు, అమలు తీరుతెన్నులతో పోలిస్తే ఏపీ­లో జరిగింది వేరు. ఇక్కడ ప్రాజెక్టు అంతా అక్రమాలే.
  • రూ.371 కోట్ల స్కామ్‌లో షెల్‌ కంపెనీల పాత్ర
  • ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల దర్యాప్తు, అరెస్టుల వివరాలు, ఈ కేసులో అటాచ్‌మెంట్లు
  •  ప్రాథమిక ఆధారాలు, కోర్టులో సమర్పించిన వివరాలు 
  • ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు 
  •  సీఐటీడీ (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌) థర్డ్‌ పార్టీ అభిప్రాయం

నోట్‌ ఫైళ్లు మాయం చేశారు 

 ఈ కుంభకోణం బయట పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్‌ ఫైళ్లను ఉద్దేశ పూర్వకంగా గల్లంతు చేశారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటు గురించి జీవో 4, సీమెన్స్‌తో ఒప్పందం గురించి జీవో 5 జారీ చేశారు. కానీ ఆ రెండు జీవోలకు సంబంధించిన నోట్‌ ఫైళ్లను మాయం చేశారు. కానీ జీవో 8 ద్వారా అంతకు ముందు ఇచ్చిన జీవోలు 4, 5 లోని అంశాలను సీఐడీ గుర్తించి వెలికి తీయడంతో ఈ కుంభకోణం బయటపడింది.

వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ఈ కుంభకోణం బయట పడకూడదని నోట్‌ ఫైల్స్‌ను సెక్రెటేరియట్‌లో తగలబెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఎంతో స్కిల్‌ఫుల్‌గా టీడీపీ ప్రభుత్వ హయాంలో దోచేశారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ ఏజీ అనే కంపెనీ ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం రూ.3300 కోట్ల ప్రాజెక్టులో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా అంటే ఉచితంగా ఇస్తామంటూ ముందుకు వచ్చినట్టు ఒప్పందంలో పేర్కొన్నారు.

కేవలం 10 శాతం ఏపీ ప్రభుత్వం కంట్రిబ్యూషన్‌ కింద ఇస్తే చాలన్నట్టుగా ఒప్పందాల్లో ఉంది. చివరకు ఈ పది శాతం సొమ్ము రూ.371 కోట్లను నాలుగు లేయర్లుగా సృష్టించి పప్పు బెల్లాలుగా ఏపీ ఖజానా నుంచి కొల్లగొట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధం అని అధికారులు అభ్యంతరం పెట్టినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు స్పష్టమవుతోంది.

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు సరిగా లేనందున ముందుగా పైలెట్‌ ప్రాజెక్టుగా.. తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులు సూచించినా పట్టించుకోలేదు. ఈ విషయాలన్నీ నోట్‌ఫైల్‌లో ఉన్నాయి. జీఎస్టీ మినహాయింపుల కోసం డిజైన్‌టెక్‌ చేసిన ప్రయత్నంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. పుణేలో జీఎస్టీ అధికారులు వెలుగులోకి తెచ్చారు. ఈ కుంభకోణంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం రూ.కోటి అయ్యే సాఫ్ట్‌వేర్‌ను రూ.250 కోట్లుగా చూపారు. ఇది ఎంతో అన్యాయం.   
– పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఏఏజీ 

యోగేష్‌ గుప్తాతో చంద్రబాబు పీఎస్‌కు సంబంధాలు 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో కొట్టే­సిన సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా దారి మళ్లించి చివరకు నగదు రూపంలో మార్చడంలో షెల్‌ కంపెనీల సృష్టికర్త యోగేశ్‌ గుప్తా కీలక పాత్ర పోషించినట్టు అడిషనల్‌ డీజీ సంజయ్‌ తెలిపారు. చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీని­వాస్, యోగేశ్‌ గుప్తాలకు ఆర్థిక అంశాల్లో సంబంధాలున్నట్టు గతంలో ఐటీ దాడుల్లో వెల్లడైందన్నారు.

పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని, యోగేశ్‌గుప్తాలు కలిసి ఈ మొత్తం వ్యవహారం నడిపారన్నారు.  డబ్బులు ఎలా చేర్చారన్న పూర్తి వివరాలు మరింత స్పష్టంగా వెలుగులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ సొమ్మును మళ్లించడం, తిరిగి షెల్‌ కంపెనీల ద్వారా వాటిని ఒకే వ్యక్తి పొందారనడానికి పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు.

ఇందులో హవాలా జరిగినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, ఇన్‌కమ్‌ ట్యాక్స్, జీఎస్టీ, సీఐడీ దర్యాప్తుతోపాటు సీమెన్స్‌ గ్లోబల్‌ కంపెనీ ఇచ్చిన వివరణలు సైతం వెల్లడించాయని తెలిపారు. ఈ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు. సీఐడి దర్యాప్తు కూడా కొనసాగుతోందని, అవసరం మేరకు ఇంకా అరెస్టులు ఉంటాయన్నారు. ఇందులో అనేక కోణాలు దాగి ఉన్నాయని, చార్జిషీట్‌కు ఇంకా సమయం పడుతుందని వివరించారు. 

Advertisement
Advertisement