ధోనీకి మరో చేదు అనుభవం! | Sakshi
Sakshi News home page

ధోనీకి మరో చేదు అనుభవం!

Published Mon, May 22 2017 9:03 AM

ధోనీకి మరో చేదు అనుభవం!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మహేంద్రసింగ్‌ ధోనీకి మరోసారి ముంబై చేతిలో చేదు అనుభవమే ఎదురైంది. ఐపీఎల్‌ ఫైనల్‌లో మొత్తం నాలుగుసార్లు ​ముంబై ఇండియన్స్‌ను ధోనీ ఎదుర్కోగా.. వరుసగా మూడుసార్లు ముంబైదే పైచేయి అయింది. 2010, 2013, 2015లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ఐపీఎల్‌ ఫైనల్‌లో ధోనీ ముంబై జట్టును ఎదుర్కొన్నాడు. 2010లో ముంబైపై విజయం సాధించినప్పటికీ.. 2013, 2015లలో పరాభవాలే ఎదురయ్యాయి. తాజాగా రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ జట్టు ఆటగాడిగా ధోనీ మరోసారి ఐపీఎల్‌ ఫైనల్‌లో ముంబైతో తలపడ్డాడు. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో పుణె ఓడించిన ముంబై మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

ధోనీ రికార్డు..
అత్యధిక ఐపీఎల్‌  ఫైనల్‌ మ్యాచులు ఆడిన తొలి ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. మొత్తం ఏడు ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచుల్లో (ఆరుసార్లు చెన్నై తరఫున, ఒకసారి పుణె తరఫున) ధోనీ ఆడాడు. అంతేకాకుండా అత్యధిక ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచులను కోల్పోయిన ప్లేయర్‌గా కూడా అతనే నిలిచాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో ప్రమేయముండటంతో చెన్నై, రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ జట్లను సుప్రీంకోర్టు సస్పెండ్‌ చేయడంతో ధోనీ పుణె జట్టుకు మారాడు.

ఈ సీజన్‌లో ధోనీ బ్యాటుతో అంత గొప్పగా రాణించలేకపోయాడు. కానీ వికెట్‌ కీపింగ్‌ స్కిల్స్‌తో అదరగొట్టాడు. క్వాలిఫైయర్‌-1 మ్యాచ్‌లో ముంబైపై 26 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు ధోనీ మధురమైన విజయాన్ని అందించాడు. అలాగే, హైదరాబాద్‌ జట్టు 34 బంతుల్లో 61 పరుగులు చేసి లీగ్‌ దశలో జట్టును గెలిపించాడు. మొత్తానికి ఈ సిరీస్‌లో పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ధోనీ అడపాదడపా తనదైన సత్తాను చాటాడు.

Advertisement
Advertisement