విమానంలో వచ్చి కారులో తిరుగుతూ చోరీలు.. | Sakshi
Sakshi News home page

విమానంలో వచ్చి కారులో తిరుగుతూ చోరీలు..

Published Wed, Sep 14 2016 6:41 PM

విమానంలో వచ్చి కారులో తిరుగుతూ చోరీలు.. - Sakshi

హైదరాబాద్: హాలీవుడ్, బాలీవుడ్ క్రైమ్ సినిమాల్లో చూపించినట్లు.. దర్జాగా విమానంలో వచ్చి, కారులో ప్రయాణిస్తూ వీలున్న చోటల్లా చోరీలు చేసి మళ్లీ ఎంచక్కా విమానమెక్కి చెక్కేస్తాడు. స్థానికంగా ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటోన్న మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యులు.. వివిధప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించి దొంగతనాలకు సంబంధించిన ప్లాన్లు రూపొందిస్తుంటారు. హైదరాబాద్ నగరంలో అలజడిరేపుతోన్న ఈ ముఠాను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ బుధవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలాఉన్నాయి..

గడిచిన మూడేళ్లుగా హైదరాబాద్ లో ముగ్గురు ఒడిశా యువకులు దాదాపు 100 దొంగతనాలకు పాల్పడ్డారు. వీళ్ల క్రైమ్ ఆపరేషన్లు ఆద్యాంతం హైటెక్ పద్ధతిలో సాగుతాయి. సుశాంత్ కుమార్ పాణిగ్రాహి, ప్రేమానంద్ ప్రధాన్ అనే ఇద్దరు సబ్యులు ఎస్.ఆర్. నగర్ లోని భారతి ఎస్టేట్ అనే ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్నారు. వీళ్ల నాయకుడిపేరు ప్రశాంత్ కుమార్ అలియాస్ తుళ్లు. సిటీలో వివిధప్రాంతాల్లో సంచరించే సుశాంత్, ప్రేమానంద్ లు ఎక్కడెక్కడ దొంగతనాలు చేసే వీలుంటుందో రెక్కీ నిర్వహిస్తారు. వివరాల్ని తమ బాస్ కు చేరవేస్తారు. ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆపరేషన్ మొదలుపెడతారిలా..

దొంగతనం చేయాల్సిన రోజున గ్యాంగ్ లీడర్ తుళ్లు భువనేశ్వర్ లో విమానం ఎక్కి హైదరాబాద్ కు వస్తాడు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఎస్.ఆర్.నగర్ లోని హాస్టల్‌కు వెళ్లి సహచరులను కలుస్తాడు. ముగ్గురూ ప్లాన్ గురించి సమగ్రంగా చర్చించుకుంటారు. కారులో బయలుదేరి స్పాట్ కు చేరుకుని గుట్టుచప్పుడుకాకుండా చోరీకి పాల్పడతారు. ఆపరేషన్ పూర్తయినవెంటనే ఎవరి వాటాలు వాళ్లు పంచుకుంటారు. సుశాంత్, ప్రేమానంద్ లు తిరిగి హాస్టల్ కు వచ్చేస్తారు. ప్రశాంత్ అలియాస్ తుళ్లు.. మళ్లీ విమానంలో భువనేశ్వర్ వెళ్లిపోతాడు.

కూకట్ పల్లి, ఎల్బీ నగర్, వనస్థలిపురం, పంజాగుట్ట, బోయిన్ పల్లి, హుమాయన్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డవీరి నుంచి రూ.8 లక్షల నగదుతోపాటు విలువైన ఆభరణాలు, ఒక ఆల్టో కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కార్తికేయ చెప్పారు. జల్సాలకు అలవాటు పడిన ఈ ముగ్గురూ చోరీలనే వృత్తిగా ఎంచుకున్నారని, ఏపీలోని విశాఖపట్టణంలోనూ పలు దొంగతనాలు చేశారని పేర్కొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement