సర్పంచ్ అదృశ్యంపై వీడని మిస్టరీ | Sakshi
Sakshi News home page

సర్పంచ్ అదృశ్యంపై వీడని మిస్టరీ

Published Thu, Oct 23 2014 4:42 AM

సర్పంచ్ అదృశ్యంపై వీడని మిస్టరీ - Sakshi

కేశవాపురం(దుగ్గొండి) : మండలంలోని కేశవాపురం సర్పంచ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సుంకరి శ్రీధర్‌రెడ్డి మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. పది రోజులు దాటినా అతడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యు లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. శ్రీధర్‌రెడ్డి ఈ నెల 13న ఉదయం హన్మకొండకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి దూరపు బంధువు బైక్‌పై ఆత్మకూరు వెళ్లాడు. అక్కడి నుంచి హన్మకొండకు వెళ్లే బస్సు ఎక్కాడు.

ఉదయం 11 గంటల ప్రాంతంలో సుబేదారిలోని పోస్టాఫీస్‌లో గ్రామసమస్యలపై పాలకవర్గ సభ్యులు చేసిన తీర్మాన ప్రతులను ఎంపీడీఓ కార్యాలయూనికి స్పీడ్ పోస్టులో పంపి కనిపించకుండాపోయూడు. ఆయనకున్న మూడు సెల్ నంబర్లలో ఏ ఒక్కటీ పని చేయడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు నాలుగు రోజులు బంధువుల ఊళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ సీతారాం నాయక్, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసును కలిసి గోడు వెల్లబోసుకున్నారు.
 
హోం మంత్రిని కలిసిన శ్రీధర్‌రెడ్డి కుటుంబ సభ్యులు

కేసు విచారణలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శి స్తుండడంతో శ్రీధర్‌రెడ్డి కుటుంబ సభ్యులు టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సెక్రటేరియట్‌లో కలిశా రు. గ్రామపంచాయతీకి రావాల్సిన పన్నులను వసూలు చేసేందుకు శ్రీధర్‌రెడ్డి తీసుకున్న చర్యలతో తనను నిత్యం వేధిస్తున్న కొందరు ప్రముఖులు, పోలీస్ అధికారుల పేర్లను రాసుకున్న డైరీని అతడి తల్లి తిరుపతమ్మ హోంమంత్రికి చూపించింది. కేసు విషయంలో పోలీసు ల నిర్లక్ష్య ధోరణిని కూడా వివరించారు.

15వ తేదీన తాము ఫిర్యాదు చేస్తే వారం రోజులైనా పట్టించుకోకుండా అనుమానితులకు వంతపాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన హోంమంత్రి నర్సింహా రెడ్డి డీఐజీ కాంతారావు, ఎస్పీ కాళిదాసుకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విచారణ తీరును తప్పుదోవ పట్టించిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. హోంమంత్రిని కలిసిన వారిలో శ్రీధర్‌రెడ్డి భార్య రమాదేవి, చెల్లెలు శ్రీదేవి, జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు యాకూబ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు తోకల నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు ఉన్నారు.
 

Advertisement
Advertisement