అనుకున్నది సాధించాడు! | Sakshi
Sakshi News home page

అనుకున్నది సాధించాడు!

Published Fri, Jun 13 2014 11:55 PM

అనుకున్నది సాధించాడు! - Sakshi

 గండేడ్: మారుమూల పల్లెలో జన్మించాడు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నాడు.. ఇంటర్, ఇంజినీరింగ్ నగరంలోని ఎస్‌వీఎంఆర్ కళాశాలలో చదువుకున్న అతను సివిల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు.. ఈ క్రమంలో వచ్చిన అనేక ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్నాడు.. చివరకు లక్ష్యం చేరుకున్నాడు.. రెండు రోజుల క్రితం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 885వ ర్యాంకు సాధించాడు. ఆయనే గండేడ్ మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్.

గ్రామానికి చెందిన సుతారి చెన్నకేశవులు, లింగమ్మల కుమారుడు అనిల్. తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. వీరికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అక్కాచెల్లెల్లిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. సివిల్స్‌నే టార్గెట్ చేసుకున్న అనిల్ ఏడు సార్లు ఐఏఎస్ పరీక్ష రాసి చివరిసారిగా ర్యాంకు సాధించాడు. నగరంలో ఏడాదిపాటు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూనే ప్రిపేర్ అయ్యానని చెప్పాడు అనిల్.

 స్నేహితులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఇప్పుడు సాధించిన ర్యాంకుకు రైల్వే శాఖలో ఉద్యోగం రావొచ్చని, ఏ కేటగిరీలోనైనా ఐఏఎస్‌గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరోమారు అవకాశం ఉంటే మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.
 
మా కల నెరవేరింది
మాకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోయారు. ఇన్నాళ్లు కుమారుడి గురించి బెంగ ఉండేది. ఇప్పుడది తీరింది. ఐఏఎస్ సాధించడం చాలా ఆనందంగా ఉంది.
 -చెన్నకేశవులు, అనిల్ తండ్రి

Advertisement
Advertisement