40 ఏళ్ల వరకు ఆడతా! | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల వరకు ఆడతా!

Published Tue, Jul 18 2017 12:28 AM

40 ఏళ్ల వరకు ఆడతా!

ఫెడరర్‌ ఆత్మవిశ్వాసం  
లండన్‌: వింబుల్డన్‌ విజయానందంలో ఉన్న స్టార్‌ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ తన ప్రత్యర్థులకు మరో సవాల్‌ విసిరాడు. వచ్చే నెల 8న 36 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ దిగ్గజం తనలో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని స్పష్టం చేశాడు. అంతా అనుకూలిస్తే తాను 40 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా టెన్నిస్‌లో కొనసాగుతానని ఉత్సాహంగా చెప్పాడు. ‘నాకూ అదే ఆలోచన ఉంది. ఆరోగ్యం సహకరించడంతో పాటు అన్నీ బాగుండాలి. నేను ఆరు నెలల విరామం తీసుకున్నప్పుడు మళ్లీ గ్రాండ్‌స్లామ్‌ గెలవగలనా అని నా సన్నిహితులు, కోచింగ్‌ సిబ్బందిని అడిగాను. నేను 100 శాతం ఫిట్‌గా ఉంటే అది సాధ్యమేనని వాళ్లు చెప్పారు. గత ఏడాది విశ్రాంతి నేను మళ్లీ చురుగ్గా ఆడేందుకు ఉపయోగపడింది. ప్రస్తుతం నన్ను నేను చూసుకుంటే 40 ఏళ్ల వయసులో కూడా నేను ఆడుతూనే ఉంటానేమో’ అని ఫెడరర్‌ వ్యాఖ్యానించాడు.

రాక్‌స్టార్‌లా వేడుకలు...
మరోవైపు వింబుల్డన్‌ గెలుపు తర్వాత ఆ రాత్రంతా తాను ‘రాక్‌స్టార్‌’లా వేడుకలు జరుపుకున్నానని ఫెడరర్‌ చెప్పాడు. ‘అధికారిక విందు తర్వాత నేను బార్‌కు వెళ్లాను. 30–40 మంది మిత్రులతో సమయం అద్భుతంగా గడిచింది. అసలు ఏమేం చేశానో కూడా సరిగ్గా గుర్తు లేదు. వేర్వేరు రకాల మద్యం చాలా ఎక్కువగా తాగానని మాత్రం చెప్పగలను. ఉదయం ఐదు గంటలకు గానీ బెడ్‌ పైకి వెళ్లలేదు’ అని అతను చెప్పాడు. 20వ గ్రాండ్‌స్లామ్‌ గురించి తాను ఇప్పుడే ఆలోచించడం లేదని, ప్రస్తుతానికి వింబుల్డన్‌ విజయానందాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు ఫెడెక్స్‌ స్పష్టం చేశాడు.  

మూడో ర్యాంక్‌కు..
వింబుల్డన్‌ విజయంతో సోమవారం ప్రకటించిన ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో రోజర్‌ ఫెడరర్‌ (6,545 పాయింట్లు)  మూడో స్థానానికి చేరుకున్నాడు. 15 ఆగస్టు, 2016 తర్వాత మొదటి సారి రోజర్‌ టాప్‌–3లోకి ప్రవేశించాడు. తాజా ప్రదర్శనతో ఫెడరర్‌ నవంబర్‌లో లండన్‌లో జరిగే ఏటీపీ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. అతను ఈ టోర్నీకి 15వ సారి  క్వాలిఫై కావడం విశేషం.

Advertisement
Advertisement