వంటింట్లో చిటపట | Sakshi
Sakshi News home page

వంటింట్లో చిటపట

Published Thu, Jul 24 2014 2:10 AM

వంటింట్లో చిటపట - Sakshi

తగ్గిన కూరగాయల దిగుబడి.. పెరుగుతున్న రేట్లు

సాక్షి, హైదరాబాద్:
నగరంలో డిమాండ్- సరఫరాల మధ్య సగానికిపైగా అంతరం ఏర్పడటంతో కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. హోల్‌సేల్ మార్కెట్లో, రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు. టోకు మార్కెట్లో కేజీ రూ.52 ఉన్న టమాటా బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి రూ.60-80లు ధర పలుకుతోంది. పచ్చిమిర్చి, బెండ, బీర, చిక్కుడు, కాకర, ఉల్లి వంటివాటి ధరలు కూడా టమాటానే అనుసరిస్తుండటం వ్యాపారుల దోపిడీకి అద్దం పడుతోంది. ఈ తరుణంలో ధరలకు కళ్లెం వేయాల్సిన సర్కార్  మౌనం వహిస్తుండటంతో ధరల ధాటికి సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు.

పడిపోయిన సరఫరా :

గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి, మీరాలంమండీ, మాదన్నపేట్, ఎల్బీనగర్‌లలోని హోల్‌సేల్ మార్కెట్లకు రోజుకు మొత్తం 28 వేల క్వింటాళ్ల లోపే కూరగాయలు వస్తున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. అలాగే నగరంలోని 9 రైతుబజార్లకు 5 వేల క్వింటాళ్లు, మిగతా ప్రైవేటు మార్కెట్లు, మాల్స్‌కు సుమారు 22 వేల క్వింటాళ్ల కూరగాయలు మాత్రమే ప్రస్తుతం నగరానికి సరఫరా అవుతున్నాయి. సాధారణ రోజుల్లో నిత్యం 25వేల క్వింటాళ్ల నగరానికి దిగుమతి అయ్యే ఉల్లి ఇప్పుడు సగానికి పడిపోయింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలను పెంచేశారు.

అక్కడే మంచి రేటు

పస్తుతం మదనపల్లి నుంచి టమోట, అనంతపూర్, కర్నూల్ జిల్లాల నుంచి పచ్చిమిర్చి, మహారాష్ట్ర నుంచి ఉల్లి, ఆగ్రా నుంచి ఆలుగడ్డలు సరఫరా అవుతున్నాయి. వంగ, బెండ, క్యాబేజీ, చిక్కుడు వంటివి రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి కొద్దిపాటి పరిమాణంలో మార్కెట్‌కు వస్తున్నాయి.  అయితే.. మదనపల్లిలోనే టమోటకు మంచి రేటు ఉండటంతో నగరానికి దిగుమతి కావట్లేదని అధికారులు చెబుతున్నారు. మిర్చిది కూడా అదే పరిస్థితి. మహారాష్ట్రలో వర్షాల వల్ల ఉల్లి పంట తీయలేని పరిస్థితి ఎదురైంది. క్లిష్ట పరిస్థితుల్లో రంగంలోకి దిగి ధరల నియంత్రించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధరే నగరంలో చెల్లుబాటవుతోంది. కాస్తో కూస్తో తక్కువ ధరకు కూరగాయలు లభించే రైతుబజార్లలో సైతం ఇదే పరిస్థితి. నిజానికి హోల్‌సేల్ మార్కెట్ ధరకు రూ.3 అదనంగా వేసి ఇక్కడ విక్రయించాల్సి ఉండగా, ఒక్కో రైతుబజార్‌లో ఒక్కో విధంగా ధరలు నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నారు. ఏటా ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదురవుతున్నా మార్కెటింగ్, హార్టికల్చర్ విభాగాలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం.


 

Advertisement
Advertisement