సైరన్‌ ఎవరు వాడొద్దో చెప్పండి | Sakshi
Sakshi News home page

సైరన్‌ ఎవరు వాడొద్దో చెప్పండి

Published Wed, Jun 28 2017 1:18 AM

The High Court requested the state government

రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు
 
సాక్షి, హైదరాబాద్‌: కార్లపై ఎర్రబుగ్గ, సైరన్‌ను ఏయే హోదాల్లోని వ్యక్తులు ఉపయోగించరాదో చెప్పాలని పిటిషనర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ తెల్లప్రోలు రజనీల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్లపై ఎరుపు, నీలం రంగుల బుగ్గలు, సైరన్‌ల విని యోగంపై ఆంక్షలు ఉన్నా దర్పం ప్రదర్శించేందుకు కొందరు సైరన్‌ను వినియోగిస్తున్నారని, ఈ విషయంలో కేంద్ర నిబంధనలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మహబూబ్‌నగర్‌ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన న్యాయవాది భావనప్ప హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వ్యాజ్యంపై విచారణ జరపగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎర్రబుగ్గలు, సైరన్‌ల వినియోగంపై నిషేధం, ఆంక్షలు ఉన్నా, బహిరంగ ప్రదేశాల్లో, టోల్‌ గేట్ల వద్ద కొందరు సైరన్లను వాడుతున్నారని చెప్పారు.  

Advertisement
Advertisement