గరికపాటి మస్ట్ శారదమ్మ షుడ్

గరికపాటి మస్ట్ శారదమ్మ షుడ్


 చక్కటి పద్యంలా...

 దాంపత్యం నాలుగు పాదాలా సాగడానికి

 చాలా ఉండాలి.

 ఆ ‘చాలా’లతో పాటు...

 కాస్త మరుపు, కాస్త విడుపూ ఉండాలి.

 ఎవరికి?

 ఇంకెవరికి? భర్తగారికే.

 కానీ గరికపాటి వారు జ్ఞాపకశక్తి స్పెషలిస్టు.

 పైగా... పర్ఫెక్షనిస్టు!

 మరి ఇన్నాళ్లు... కాదు కాదు, ఇన్నేళ్లు...

 ఈ శతావధాన గీష్పతితో...

 ఈ ధారణ బ్రహ్మరాక్షసుడితో...

 శారదమ్మ ఎలా వేగి ఉంటారు?

 ఈవారం ‘మనసే జతగా...’ చదవండి.

 ఆయన మహాసహస్రావధాని అయితే

 ఆమె మహాఇల్లాలు అని తెలుస్తుంది.

 ‘మస్ట్ అండ్ షుడ్’ పనులలో

 ఆయన మస్ట్ అయితే...

 ఆమె షుడ్ అని స్పష్టమౌతుంది!

 

 తెలుగు అధ్యాపకుడిగా మొదలుపెట్టిన ప్రయాణంలో ఇరవై ఏళ్లుగా అవధానాలు, సాహిత్య ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో సహవాసం చేస్తూనే ఉన్నారు గరికపాటి నరసింహారావు. ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగతం కాదు దేశభక్తి, దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి.. ఇలా అన్నీ అందులో ఇమిడి ఉంటాయి అని చెప్పే ఈ అభ్యుదయవాది కాకినాడ వాస్తవ్యురాలైన శారదను 30 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పద్యానికి, భావానికి ఉన్నంత అనుబంధం దంపతుల మధ్య ఉండాలంటూ తమ జీవితానుభవాలను విశదపరిచారు నరసింహారావు, శారదలు.   

 

 సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో మూడేళ్లక్రితం స్థిరపడ్డారు గరికపాటి దంపతులు. తమ జీవితానుభవాలు చెబుతూ -‘మా అన్నగారు, శారద నాన్నగారు మా పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. జ్ఞానాన్ని ఇచ్చే చదువే తప్ప ఉద్యోగానికి ఉపయోగపడే చదువు అవసరం లేదని నా భావన. ఆడవాళ్లు ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకెప్పు డూ లేదు. కుటుంబాన్ని చక్కదిద్దుకునే ఇల్లాలు అయితే చాలనుకున్నాను. అందుకే శారద ఏం చదువుకుందని అడగలేదు. శారద అలాగే ఇన్నాళ్లూ నా బాగోగులు చూసుకుంది’ అన్నారు. శారద మాట్లాడుతూ -‘మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ‘ఏదీ లేదని బాధపడకు. దేనికోసమో ఆశపడకు. కలిగిన రోజున అనుభవించు’... ఆ మాట ఇప్పటికీ నాకు మంత్రమే! అన్నయ్య, తమ్ముడు,  కలిగినదాంట్లో సంతృప్తిపడటమే మా నాన్నగారు మా ముగ్గురికీ నేర్పారు. అది నా జీవితాన్ని ఆనందమయం చేసిందనుకుంటాను’ అన్నారామె.

 

 దాంపత్యం అంటే ఒకరికొకరు చెప్పుకునే ధైర్యం..

 ఆలోచనలు పంచుకోగలిగే స్వేచ్ఛ, స్వాతంత్య్రం, అభిమానం భార్యభర్తలిద్దరిమధ్య ఉండాలంటారు ఈ దంపతులు. ‘నేను చాలా పిరికిదాన్ని. ఏ చిన్న సమస్య వచ్చినా ఆందోళన పడిపోతుంటాను. ఈయనకు చెప్పేస్తే నాకు ఎంతో ధైర్యం. అప్పటికి ఏదో భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది’ అన్నారు శారద. ‘ఏదైనా కావాలనో, మరోటో చెబుతున్నప్పుడు ‘నే చూసుకుంటాలే, నువ్విక ఆ విషయం మర్చిపో’ అని చెబుతాను. స్త్రీకి ఆ ధైర్యం పురుషుడు ఇవ్వగలగాలి’ అంటారు గరికపాటి.

 

 దాంపత్యం అంటే ప్లానింగ్!

 రోజును భాగాలుగా విభజించుకుని సమయాన్ని ప్లాన్ చేసుకోవడంలో ఘనాపాఠి గరికపాటి. ఆ ప్లానింగ్‌లో భాగంగా తాను అలవర్చుకున్న విషయాలను శారద చెబుతూ -‘ఈయనకు దేశభక్తి ఎక్కువ. అందుకని వందేమాతర గీతాన్ని ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి అలారానికి సెట్ చేశాను. అలా వందేమాతర గీతంతో నిద్రలేస్తారు. పూజ, పుస్తకపఠనం తర్వాత ఇద్దరం కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటాం. అవి వార్తల్లో విషయాలు కావచ్చు. కావ్యాలలోని కమ్మదనం కావచ్చు. వంటల వివరాలు కావచ్చు. ఆ తర్వాత మళ్లీ ఈయన పఠనానికి, నేను వంటల తయారీకి వెళతాం. ఛలోక్తులతో ఏ సంభాషణైనా కొనసాగించ డం ఈయనకు ఇష్టం. వినడం నాకు ఇష్టం’ అంటూ తమ దినచర్యను తెలిపారు. పుస్తకాలు చదివే అలవాటు భర్త నుంచే లభించిందనే విషయాన్నీ వివరించారు ఆమె. టైమ్ విషయంలోనే కాదు, డబ్బు ఖర్చుపెట్టడంలోనూ ప్లాన్ ఉంది వీరికి. ‘ఈవిడైతే ఏ రోజు లెక్క ఆ రోజు రాసేయాల్సిందే! నేను కూడా అంతే! అలా ప్లానింగ్‌గా జీవితాన్ని నడుపుకుంటేనే విజయాలు సాధ్యం అవుతాయని అనుభవంలో తెలుసుకున్నాను’ అంటారు.

 

 సలహాలు... కలహాలు... సరదాలు

 సభాకార్యక్రమాలకు వెళుతూ, అధ్యాపకుడిగా ఇబ్బంది పడుతున్నప్పుడు ‘ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోండి’ అంది తను. వెంటనే ఆ సలహాను పాటించి ఉద్యోగం మానేశాను’ అంటూ ప్లానింగ్ తమ జీవితాలను ఎలా స్థిరపరిచిందో తెలిపారు ఈ అవధాని. తమ పిల్లలిద్దరికీ ఇద్దరు మహాకవులు శ్రీశ్రీ, గురజాడ పేర్లు పెట్టుకున్నారు ఈ  దంపతులు. పెద్దబ్బాయి హోటల్‌మేనేజ్‌మెంట్ చేసి, ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నబ్బాయి సెంట్రల్ యూనివర్శిటీలో ఎం.ఎ తెలుగు చదువుతున్నాడు.

 

 చిన్నచిన్న గొడవలు, కోపతాపాలు లేకపోతే జీవితం మరీ యాంత్రికమైపోతుందంటూ... ‘కోపం తాలూకు పరిమళం ఇంట్లో అలా అలా ఉండాలి. అయితే అది తీవ్రం కాకూడదు. మా ఇద్దరిలో నాకు కోపం వస్తే ఈవిడ మౌనం దాల్చుతుంది. ఈవిడకు కోపం అస్సలు రాదు. వస్తే నేను గప్‌చిప్. కోపం తర్వాత కలిగే అభిమానం దాంపత్యంలోని మధురిమను మరింతగా ఆస్వాదించగలిగేలా చేస్తుంది’ అని చమత్కారంగా చెబుతూ ‘తనకు నామీద కోపం వచ్చినప్పుడు మౌనంగా బయటకు వెళ్లిపోయి.. ఐలవ్‌యు అని  మెసేజ్ ఇస్తాను. తను కూడా అంతే! ఏముంది... వెంటనే కోపం ఫట్!’ అంటూ నవ్వేశారు ఈ అవధాని.

 ‘బాధ్యత, ధర్మం, పరస్పర అనురాగం, అవగాహన.. ఇవన్నీ దాంపత్యాన్ని నిలబెట్టే ప్రధాన స్తంభాలుగా పనిచేస్తాయి’ అని చెప్పటమే కాదు, ఆచరిస్తున్న ఈ జంట నేటి నవజంటలకు ఎంతో ఆదర్శం.

 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 

 

 నేనెంత ప్లాన్లు వేసుకున్నా నా విజయంలో శారద సహకారం ఉండబట్టే నా సాధన నిర్విఘ్నంగా సాగుతోంది.

 - గరికపాటి

 

 ఈయన నా పుట్టిన రోజు నాడు ఎదురుగా కూర్చోబెట్టుకొని నా మీద ముప్పై పద్యాలు ఆశువుగా చెప్పి ఆశ్చర్యపరిచారు. అదృష్టం అంటే నాదే అనిపించింది.  

 - శారద

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top