కళామతల్లి ముద్దుబిడ్డ కన్నుమూత | Sakshi
Sakshi News home page

కళామతల్లి ముద్దుబిడ్డ కన్నుమూత

Published Tue, May 29 2018 2:10 PM

Drama Artist Died - Sakshi

బరంపురం : కళామతల్లి ముద్దుబిడ్డ కరుణశ్రీ కళా కోవెలకొండ వేంకటరావు పరమపదించడం కళాకారులకు తీరని లోటు అని ఉత్కళ కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన స్వర్గస్తులయ్యారు.

దీంతో ఒడిస్సాలోని ఉత్కళ కళాకారులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాటక రంగ కళాకారులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒడిశాలోని బరంపురం తెలుగు నాటకరంగంలో ఆయన నటన మరిచిపోరానిదని కీర్తించారు.

సుమారు 40 ఏళ్లకు ముందు సీహెచ్‌. నరసింహరావు, వైకుంఠాచారి, కె.వరదరాజులు, బండి రాజు వంటి స్నేహితులతో కలిసి 1968వ సంవత్సరంలో బరంపురంలో ‘కరుణశ్రీ’కళాసమితి పేరుతో సాంస్కృతిక సంస్థను స్థాపించి కళామతల్లికి సేవలందించారు.

రెవెన్యూ ఉద్యోగి నుంచి నటుడిగా ప్రస్థానం

వృత్తి రీత్యా వెంకటరావు ఒడిశా రాష్ట్రంలో ప్రభుత్వ రెవెన్యూ విభాగంలో పనిచేశారని, పదవీ విరమణానంతరం పూర్తిగా నాటక రంగానికి అంకితమయ్యారని తెలిపారు. తనతో పాటు సహధర్మచారణి కె.వనజా కూడా నాటకాల్లో నటించి ఒడిస్సాలోను, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన నారీభేరి, నిశ్శబ్ధ వంటి సుమారు 100 నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారని  ప్రశంసించారు.

1945లో బరంపురం నగరంలోని స్థానిక చిన్నకాళికా అమ్మవారి కోవెల వీధిలో ఆయన జన్మించారు. కోవెలకొండ వెంకటరావు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలు పూర్తిచేసి ఉద్యోగిగా స్థిరపడి నాటక రంగానికి ఎనలేని సేవలు చేశారని కీర్తించారు.1960లో మొట్టమొదటి సారిగా తన ముఖానికి రంగు వేసుకుని కళామతల్లికి సేవలు చేసేందుకు ఆరంగేట్రం చేశారు. నాటకరంగంలో వందకి పైగా నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

నటుడుగా తన కీర్తి హిమవత్‌ శిఖరమైతే, దర్శకుడిగా ఆయన కీర్తి ఒడిస్సా, ఆంధ్రా, పశ్చిమబెంగాల్, మహరాష్ట్ర వరకు వ్యాపించింది. ‘బక్క బ్రహ్మచారులు’నాటిక 35 సార్లు ప్రదర్శించి, మహిళల హక్కుల ఉద్యమంపై ‘నారిభేరి’, భ్రూణహత్యలపై ‘నిశ్శబ్ద’నాటికలను 100కి పైగా ప్రదర్శనలు ఇవ్వడంలో ఆయనకే చెల్లిందన్నారు.  హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ రంగస్థల నటుడు వంటి బిరుదులు ఎన్నో సొంతం చేసుకున్నాడని తెలిపారు

మరెన్నో గౌరవ సన్మానాలు, పురస్కారాలు అందుకుని కరుణశ్రీగా, ఉత్కళ తెలుగు వెలుగుగా కొవలెకొండ వెంకటరావు పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు. స్థానిక ఫ్రెండ్స్‌ హెల్పింగ్‌ క్లబ్‌కు సలహాదారుగా వ్యవహరించి ఎన్నో సేవలు అందించారు.

కళాకారుల్లో విషాదం 

కరుణశ్రీ, ప్రముఖ కళామతల్లి ముద్దుబిడ్డ కోవెలకొండ వెంకటరావు అదివారం రాత్రి మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం ఉదయం వెంకటరావు భౌతికాయానికి కళాకారులు, స్నేహితులు, బంధువులు కన్నీరు మున్నీరుగా వీడ్కోలు పలికారు.

Advertisement
 
Advertisement