ధరలపై వైఎస్సార్‌సీపీ పోరు బాట | Sakshi
Sakshi News home page

ధరలపై వైఎస్సార్‌సీపీ పోరు బాట

Published Fri, Nov 27 2015 11:26 PM

ధరలపై వైఎస్సార్‌సీపీ పోరు బాట - Sakshi

3న కలెక్టరేట్ వద్ద ధర్నా
బాక్సైట్‌కు వ్యతిరేకంగా  10న ఏజెన్సీలో జగన్ సభ
కార్యక్రమాలు విజయవంతం  చేయాలని నేతల వినతి

 
డాబాగార్డెన్స్ (విశాఖ):  నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై వైఎస్సార్ సీపీ పోరాటానికి సిద్ధమవుతోంది. అధికారంలోకి వచ్చాక ధరలను అదుపుచేస్తామని నరేంద్రమోదీ,  చంద్రబాబునాయుడు మోసపూరిత వ్యాఖ్యలు చేసి గద్దెనెక్కిన తర్వాత ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని పార్టీ శ్రేణులు ధ్వజమెత్తారు. నానాటికీ పెరుగుతున్న ధరలు అదుపు చేయడంలో విఫలమైన తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 3న కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని పార్టీ సమన్వయకర్తలు, రాష్ట్ర పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం జగదాంబ జంక్షన్ సమీపాన ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమమై నిర్ణయించారు. కూరగాయలు, పప్పులు.. ఇలా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటినా  ప్రభుత్వాల్లో చలనం లేకపోవడం శోచనీయమన్నారు.  విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు జీవో విడుదల చేసి గిరిజనులతో పాటు విశాఖ ప్రజల్ని అయోమయానికి గురిచేశారని ధ్వజమెత్తారు. బాక్సైట్ తవ్వకాల వల్ల  గిరిజనులు నష్టపోతారని తెలిసినప్పటికీ చంద్రబాబు    నాటకమాడుతున్నారని దుయ్యబట్టారు.

బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 10న విశాఖ ఏజెన్సీలో నిర్వహించనున్న సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. అలాగే డిసెంబర్ 3న పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, సమన్వయకర్తలు తైనాల విజయ్‌కుమార్, కోలా గురువులు, వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, పార్టీ నాయకులు కంపా హోనోక్, రవిరెడ్డి, అబ్దుల్ ఫారూఖీ,  సత్తి రామకృష్ణారెడ్డి, బోని శివరామకృష్ణ, ఫక్కి దివాకర్, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్,   పలువురు యువజన విభాగం సభ్యులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement