మహిళా శాస్త్రవేత్తలకు నాయుడమ్మ అవార్డు | Sakshi
Sakshi News home page

మహిళా శాస్త్రవేత్తలకు నాయుడమ్మ అవార్డు

Published Mon, Mar 2 2015 5:44 AM

మహిళా శాస్త్రవేత్తలకు నాయుడమ్మ అవార్డు

- పురస్కారం అందుకున్న టెస్సీ థామస్, గీతా వరదన్
 
తెనాలి: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పేరిట అందించే ప్రతిష్టాత్మక అవార్డు 2014 సంవత్సరానికి ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు ప్రదానం చేశారు. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డెరైక్టర్ డాక్టర్ టెస్సీ థామస్, ఇస్రో అడ్వాన్స్‌డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ డాక్టర్ గీతా వరదన్ నాయుడమ్మ అవార్డు అందుకున్నారు. ఆదివారం రాత్రి గుంటూరుజిల్లా తెనాలిలోని నూకల రామకోటేశ్వరరావు కల్యాణ కళాసదనంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి నాయుడమ్మ ట్రస్ట్ చైర్మన్ ఆర్.సంపత్ అధ్యక్షత వహించారు.
 
ప్రముఖ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ఉద్యమకారిణి, రామన్‌మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా ముఖ్య అతిథిగా హాజరై అవార్డును ఇరువురు శాస్త్రవేత్తలకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ టెస్సీ థామస్ ‘భారత్‌లో తయారీ-రక్షణ అవసరాలు-చొరవ’ అంశంపైనా, డాక్టర్ గీతా వరదన్ ‘దేశ అవసరాలు-రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ’ అంశంపైనా నాయుడమ్మ స్మారకోపన్యాసం చేశారు.

సాంకేతిక విజ్ఞాన రంగంలో 2020కి ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించేంతగా అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయుడమ్మ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ పి.విష్ణుమూర్తి, నాయుడమ్మ మనవరాలు, సినీ హీరో నాని సతీమణి అంజనా నాని, ట్రస్టు చైర్మన్ మాదల సుధాకర్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, ట్రస్ట్ కోశాధికారి సూరెడ్డి సూర్యమోహన్, ట్రస్టీలు కె. బలహరనాథ్ మూర్తి, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement