నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
మరో మూడు రోజులు సూర్య ప్రతాపం.. బయటకెళ్తే డేంజరే!
Published on Fri, 04/26/2024 - 07:19
హైదరాబాద్/ గుంటూరు, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. పగలు రాత్రి తేడా లేకుండా ఉక్కపోత వాతావరణం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే..
రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. వడగాడ్పులు అంతకంతకూ పెరుగుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి.
ఒకపక్క.. ఏపీలో గురువారం 16 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మరో 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. రానున్న మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. శుక్రవారం ఏపీలో 174 మండలాల్లో వడగాల్పులు, 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరోపక్క.. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రామగుండం, భద్రచాలం పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, వృద్ధులు గర్భీణీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక రేపు తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
Tags : 1