Breaking News

ఆపరేషన్‌ కగార్‌ ఫినిషింగ్‌ టచ్‌ ‘లక్ష్మణుడే’?

Published on Sat, 02/28/2026 - 07:32

అణగారిన వర్గాల బతుకుల బాగు కోసం ఆరాటపడ్డాడు.. బానిస బతుకులను చూసి కలతచెందాడు.. ఐదు దశాబ్దాల క్రితమే బందూకు పట్టి బరిగీసి నిల్చున్నాడు. భూస్వాముల పాలిట తిరుగుబాటుదారుడయ్యాడు.. బహుజనుల జీవితాల్లో ఆరాధ్యుడయ్యాడు. అజ్ఞాత దళాలకు అగ్రనేతయ్యాడు. బలహీన వర్గాలకు పెద్దన్నగా నిలిచాడు.. ఆయనే ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఉరఫ్‌ గణపతి.

గణపతికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు. తల్లిదండ్రులు, ఓ సోదరుడు, సోదరి గతంలో మృతిచెందారు. భార్య విజయ, కుమారుడు శ్రీనివాస్‌ హైదరాబాద్, అమెరికాలో జీవిస్తున్నారు. స్వగ్రామం బీర్పూర్‌లో ఆయన రక్త సంబంధికులు ఎవరూ లేరు. ఇల్లు మొత్తం కూలిపోయింది. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా అడుగుజాగే మిగిలింది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన గణపతి మొదటి నుంచి తిరుగుబాటు స్వభావం గల వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్‌ కగార్‌ ఈ ఏడాది మార్చితో ముగుస్తుండడంతో లక్షణ్‌రావు పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఎన్‌కౌంటర్‌ అయ్యారు. పలువురు లొంగిపోయారు కూడా.. కగార్‌ గడువు దగ్గరపడుతుండడంతో పెద్దన్నపైనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

సాక్షి,కరీంనగర్‌ డెస్క్‌: మావేయిస్టు నేత.. లక్ష్మణ్‌రావు 1949 జూన్‌ 16న బీర్పూర్‌లో జన్మించారు. 5వ తరగతి వరకు బీర్‌పూర్, 7వ తరగతి వరకు అదే జిల్లాలోని తుంగూర్‌లో చదువుకున్నారు. పీయూసీ జగిత్యాలలో, కరీంనగర్‌లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు రావడంతో మొదట ప్రస్తుత పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో పనిచేశారు. సైన్స్, లెక్కలు, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు బోధించారు. ఎలగందుల, మేడిపల్లి మండలం గోవిందారంలో విధులు నిర్వహించారు. ఇదే సమయంలో పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన సరస్వతిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు జన్మించాడు. 1972–73లో బీఈడీ ట్రైనింగ్‌ కోసం వరంగల్‌ వెళ్లి అక్కడి నుంచి అటే అజ్ఞాతబాట పటారు. ఉపాధ్యాయుడిగా పిల్ల లకు చదువు నేర్పిన గణపతి..      ఉద్యమంలో విప్లవపాఠాలు నేర్పారు.

జగిత్యాల జైత్రయాత్రతో..
జగిత్యాల పట్టణంలో 1978 సెప్టెంబర్‌ 9వ తేదీన జగిత్యాల జైత్రయాత్ర  చేపట్టారు. జైత్రయాత్ర తర్వాతే రైతుకూలి సంఘం కొండపెల్లి సీతారామయ్య నేతృత్వంలో పీపుల్స్‌వార్‌గా ఆవిర్భవించింది. ఇదే ప్రయోగశాలగా మారి దేశంలో 17 రా ష్ట్రాల్లో ఉద్యమ వ్యాప్తికి దోహదపడింది. అప్పుడు ఈ యాత్రలో దాదాపు 3.50 లక్షల మంది పాల్గొన్నారు. ‘దున్నేవాడికే భూమి’ అంటూ జగిత్యాల పుర వీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించి స్థానిక ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్‌లో బహిరంగసభ నిర్వహించారు. మావోయిస్టు అధినేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఉరఫ్‌ గణపతి, మల్లో్లజుల కోటేశ్వర్‌రావు, మాదాసు వేణుగోపాల్‌రావు, నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, ముంజీం రత్నయ్య, భైరి గంగారాం, అంగె ఓదెలు తదితర నేతలు పాల్గొన్నారు. బహిరంగసభలో ప్రజాయుద్ద నౌక గద్దర్‌ గజ్జెకట్టి ఆడిపాడారు. అలా.. మొదలైన తిరుగుబావుట దండకారణ్యంలోని జనతన సర్కార్‌ నిర్మాణం వరకు కొనసాగింది. 1992 వరకు కొండపల్లి సీతారామయ్య నడిపించిన పీపుల్స్‌వార్‌ పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికై 2004లో బిహార్‌ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ వరకు సాగింది. సీపీఐ మావోయిస్టుగా ఏర్పడ్డ తర్వాత కూడా గణపతి దళపతిగా కొనసాగారు.

1977లోనే తొలి పోలీసు కేసు..
పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో 1975–76లో ఇప్పటి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్‌లోని భూస్వామి పితంబర్‌రావుతోపాటు కుటుంబ సభ్యులను నక్సల్స్‌ హతమార్చారు. ఈ ఘటనలో అదే జిల్లా కలమడుగు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ హత్యతో ప్రమేయం ఉందని అప్పట్లో పోలీసులు 16 మందిపై కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ–1గా కొండపల్లి సీతారామయ్యను, ఏ–8గా ముప్పాల లక్ష్మణ్‌రావును పేర్కొన్నారు. 1977లో గణపతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్‌ జైలులో శిక్ష అనుభవించిన గణపతి మూడు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదు.

టీవీలో చూసి..
2004లో దేశంలో అనేక రాష్ట్రాలలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు విస్తరింపజేశారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయనపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటించాయి. జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్న లక్ష్మణ్‌రావు ఉరఫ్‌ గణపతి పీపుల్స్‌వార్‌లో కొండపల్లి, కేజీ సత్యమూర్తి, కిషన్‌జీ తర్వాతి స్థానంలో ఉండేవారు. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు రచించడంలో ముందుండే ఆయనను అగ్రనేతగా కొనసాగాలని కోరడంతో పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. అందరికంటే ఎక్కువ కాలం 25 ఏళ్లపాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి పనిచేయడం విశేషం. మావోయిస్టు గణపతి 2010లో నక్సల్స్‌ దళాలను ఉద్దేశించి ప్రసగించిన వీడియో అప్పట్లో కొన్ని టీవీ చానళ్లలో ప్రసారమైంది. గణపతి ఇలా ఉంటారా? అంటూ బీర్పూర్‌ పరిసర గ్రామాల ప్రజలు ఆసక్తిగా చూశారు. అప్పటి వీడియో, ఫొటోలే ఇప్పడు మీడియాలో వస్తున్నాయి.

ఆపరేషన్‌ కగార్‌తో ఫినిషింగ్‌ టచ్‌
ఐదు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటున్న బడి పంతులు ఇప్పుడు అనారోగ్యంతో అలిసిపోయారు. పాతికేళ్లుగా మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గణపతి.. వయోభారంతో నడవలేని స్థితిలో సతమతమవతున్నట్లు తెలిసింది. చూపు మందగించి.. జ్ఞాపకశక్తి సరిగాలేదని తెలుస్తోంది. అయితే ఆపరేషన్‌ కగార్‌ ఫినిషింగ్‌ టచ్‌ గణపతితో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ గణపతి లొంగిపోయినా.. అరెస్టు అయినా ఓ సంచలనమే.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమే.! 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)