Breaking News

ప్రాణహిత–చేవెళ్లకు కొత్తరూపు

Published on Mon, 06/08/2026 - 05:18

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు కొలిక్కి వస్తున్నాయి. మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ప్రతిపాదించిన బరాజ్‌ ఎత్తు మినహాయిస్తే మిగిలిన అన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది. ప్రాజెక్టు పాత అలైన్‌మెంట్‌కు కొన్ని మార్పులతో ప్రీఫీజబిలిటీ నివేదిక (పీఎఫ్‌ఆర్‌)కు తుదిరూపు కల్పిస్తున్నారు. పాత అలైన్‌మెంట్‌ ప్రకారం ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మించాల్సి ఉండగా, దానికి 3 కి.మీ. ఎగువన వార్ధా, వెయిన్‌ గంగా నదులు సంగమించే ప్రాంతానికి లొకేషన్‌ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మిస్తే ఛాప్రాలా వన్యప్రాణుల అభయారణ్యం ప్రభావితం కానుండడం, వరదలు ఉధృతంగా పోటెత్తినప్పుడు సమస్యలు ఏర్పడే అవకాశం ఉండడం కూడా లొకేషన్‌ మార్పునకు మరో కారణమని అధికార వర్గాలు తెలిపాయి. 

వార్ధా– వెయిన్‌గంగాపై సమాంతర బరాజ్‌... 
కొత్త అలైన్‌మెంట్‌ ప్రకారం..వార్ధా, వెయిన్‌ గంగా నదులు సంగమించే ప్రాంతానికి కొంత ఎగువన రెండు నదులపై లంబకోణంలో సమాంతర బరాజ్‌ నిర్మించి మధ్యలో కాంక్రీట్‌ బండ్‌ (నాన్‌ ఓవర్‌ ఫ్లో డ్యామ్‌)తో కలిపివేయనున్నారు. రెండు వైపులా ఉండే బరాజ్‌లకు గేట్లు ఉండనుండగా, మధ్యలో ఉండే కాంక్రీట్‌ బండ్‌ చెక్‌ డ్యామ్‌ తరహాలో పనిచేయనుంది. బరాజ్‌లు నిండినప్పుడు గేట్లు ఎత్తకపోయినా మధ్యలోని కాంక్రీట్‌ బండ్‌పై నుంచి వరద పొంగిపొర్లనుంది. బరాజ్‌ ప్రతిపాదిత ప్రదేశంలో తాజాగా జియోఫిజికల్‌ పరీక్షలను ప్రారంభించారు. నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) విభాగ ఇంజనీర్లు శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటించి బరాజ్‌ ప్రతిపాదిత ప్రదేశాన్ని పరిశీలించారు. 

మారిన అలైన్‌మెంట్‌ ప్రకారం వార్ధా–వెయిన్‌ గంగా బరాజ్‌ నుంచి నీటిని కాల్వ, సొరంగ మార్గంలో తరలించి సుందిళ్ల బరాజ్‌కు పూర్తిగా గ్రావిటీతో తరలించనున్నారు. అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎత్తిపోయనున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి దాదాపు 71.5 కి.మీ.ల పొడవున కాల్వ నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయింది. రూ.1,700 కోట్లు విలువైన పనులు జరిగిన తర్వాత ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కనపెట్టింది. అర్ధంతరంగా వదిలేసిన కాల్వను సుందిళ్ల బరాజ్‌తో అనుసంధానం చేయడానికి మంచిర్యాల జిల్లాలో నన్నెల నుంచి జైపూర్‌ వరకు భూగర్భంలో 110 మీటర్ల లోతుల్లో 26 కి.మీ.ల పొడవున సొరంగంతోపాటు మరో 6 కి.మీ.ల కాల్వను నిర్మించాల్సి ఉంటుంది. సొరంగం అటవీ ప్రాంతం గుండా వెళ్లనుండడంతో భూసేకరణ అవసరం లేదు. కాల్వలకు 160 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది.  

రూ.10 వేల కోట్లతో ప్రాథమిక అంచనాలు  
ప్రాథమిక అంచనాల ప్రకారం వార్ధా–వెయిన్‌ గంగా బరాజ్‌ల నిర్మాణానికి రూ.5వేల కోట్లు, సొరంగం నిర్మాణానికి రూ.3,700 కోట్లు, మిగిలిన కాల్వ నిర్మాణానికి రూ.1,000 కోట్లు కలిపి మొత్తం రూ.10,000 కోట్ల వ్యయం కానుంది. బరాజ్, కాల్వల భూసేకరణ వ్యయం దీనికి అదనం. పాత అలైన్‌మెంట్‌ ప్రకారం ప్యాకేజీ–5 కింద 50 కి.మీ.ల కాల్వతో పాటు పంప్‌హౌస్‌ నిర్మించాల్సి ఉండగా, నాటి ధరల ప్రకారమే రూ.16 వేల కోట్ల వ్యయం కానుందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త అలైన్‌మెంట్‌తో కాల్వ పొడవు తగ్గడం, పంప్‌హౌస్‌ నిర్మాణం అవసరం లేకపోవడంతో వ్యయం తగ్గనుందని పేర్కొన్నాయి. పాత అలైన్‌మెంట్‌ ప్రకారం 50 కి.మీ.ల కాల్వను తవ్వాల్సి ఉండగా, మధ్యలో బొగ్గు గనులు ఉండడంతో అలైన్‌మెంట్‌ మార్చి సొరంగాన్ని నిర్మించనున్నారు.  

బరాజ్‌ ఎత్తుపై చిక్కులు.. 
తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మిస్తే తమ రాష్ట్రంలో ముంపు ఏర్పడుతుందని గతంలో మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 148 మీటర్లకు ఎత్తు తగ్గించి తుమ్మిడిహెట్టి నిర్మించడానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంది. తాజాగా వార్ధా–వెయిన్‌గంగా బరాజ్‌ను సైతం 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే కనీసం 120 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, అప్పుడు ఆశించిన మేర ఆయకట్టుకు సరఫరా చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో మళ్లీ సంప్రదింపులు జరిపి ఒప్పించడానికి ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతూ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొలుత లేఖ రాయగా, అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాసినా, మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. 

మహారాష్ట్ర అంగీకరించే అంశంపై స్పష్టత లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్లు, 149 మీటర్లు, 150 మీటర్ల, 151 మీటర్లు, 152 మీటర్ల వేర్వేరు ఎత్తులతో బరాజ్‌ నిర్మాణానికి వేర్వేరు ప్రత్యామ్నాయాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అనుకుంటున్నట్టు 150 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మిస్తే మహారాష్ట్రలో 1,200 ఎకరాల పట్టాభూములు, ఇతర భూములు కలిపి మొత్తం 3,000 ఎకరాల్లో ముంపు ఏర్పడనుందని అంచనా వేశారు. ఒక వేళ 148–149 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మించాల్సి వస్తే అక్కడి నుంచి నీటిని తరలించే కాల్వను 69 నుంచి 75 మీటర్లకు వెడల్పు పెంచితేనే ఆశించిన ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం భావిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బరాజ్‌ ఎత్తును ఖరారు చేసిన తర్వాతే ప్రాజెక్టు స్వరూపం విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)