Breaking News

Telangana: ఇక ప్రతి నెలా సర్దుబాదుడు!

Published on Thu, 01/19/2023 - 01:34

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారుల నుంచి ప్రతి నెలా ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్‌ఎస్‌ఏ) వసూలు చేసేందుకు లేదా వారికి తిరిగి చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ మూడో సవరణ నిబంధనలు–2023ను బుధవారం ప్రకటించింది. ఇంధన/ విద్యుత్‌ కొనుగోలు వ్యయం సర్దుబాటు చార్జీల భారాన్ని ఆటోమేటిక్‌గా విద్యుత్‌ బిల్లులకు బదిలీ చేసేందుకు ..కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్‌ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్‌ కాస్ట్‌ డ్యూ టు చేంజ్‌ ఇన్‌లా) రూల్స్‌ 2021ను అమల్లోకి తెచ్చింది.

బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో పెరిగిపోతున్న విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో సైతం ఇంధన సర్దుబాటు చార్జీలు వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు విజ్ఞప్తి చేయగా, తాజాగా ఈఆర్సీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంధన సర్దుబాటు చార్జీలను లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములాను సైతం ప్రకటించింది. 2023 ఏప్రిల్‌ 1 నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల వసూళ్లు అమల్లోకి రానున్నాయి. 

రుణాత్మకంగా తేలితే రిఫండ్‌
► తెలంగాణ ఈఆర్సీ నిబంధనల ప్రకారం.. ఎన్‌ (ఒక నెల) నెలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీలను ఎన్‌+2 (మూడవ నెల)కు సంబంధించిన బిల్లుతో కలిపి ఎన్‌+3 (4వ నెల) నెలలో డిస్కంలు జారీ చేస్తాయి. ఉదాహరణకు జనవరి నెల ఇంధన సర్దుబాటు చార్జీలను డిస్కంలు మార్చి నెల బిల్లుతో కలిపి ఏప్రిల్‌ నెలలో వినియోగదారులపై విధించాల్సి ఉంటుంది. ఒక వేళ ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను లెక్కించిన తర్వాత రుణాత్మకంగా తేలితే ఆ మేరకు వినియోగదారులకు రిఫండ్‌ (తిరిగి చెల్లించాలి) చేయాల్సి ఉంటుంది.

30 పైసలకు మించితే ముందస్తు అనుమతి తప్పనిసరి 
► యూనిట్‌ విద్యుత్‌పై గరిష్టంగా 30 పైసల వరకు ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు. ఒక వేళ ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు యూనిట్‌కు 30 పైసలకు మించితే ఆపై ఉండే అదనపు మొత్తాన్ని ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా విధించడానికి వీలులేదు. 
వ్యవసాయం మినహా అందరిపై వడ్డన..

► ఎల్టీ–5 కేటగిరీలోని వ్యవసాయ వినియోగదారులు మినహా అన్ని కేటగిరీల వినియోగదారులపై ఇంధన సర్దుబాటు చార్జీలు విధించడానికి ఈఆర్సీ అనుమతినిచ్చింది. వ్యవసాయ వినియోగదారుల ఇంధన సర్దుబాటు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని కోరింది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని పక్షంలో ఆ మొత్తాలను తర్వాతి కాలంలో ఇతర వినియోగదారుల నుంచి ట్రూఅప్‌ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు అనుమతించబోమని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను లెక్కించే సమయంలో ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ నష్టాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

గడువులోగా వసూలు చేసుకోవాల్సిందే..
► నిర్ణీత కాల వ్యవధిలోపు ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను విధించడంలో డిస్కంలు విఫలమైతే తర్వాత వసూలు చేసేందుకు అనుమతి ఉండదు. నెలవారీ ఇంధన సర్దుబాటు చార్జీలను నిబంధనల ప్రకారం డిస్కంలు లెక్కించి సంబంధిత నెల ముగిసిన 45 రోజుల్లోగా పత్రికల్లో ప్రచురించాల్సి ఉంటుంది. 45 రోజులు దాటితే ఆ నెలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను అనుమతించరు.

విద్యుత్‌ బిల్లుల్లో ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతో పాటు వసూలైన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేయాలి. ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి అందజేయాలి. డిస్కంలు విధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించనుంది. 

ట్రూఅప్‌ ప్రతిపాదనలు కీలకం..
► ప్రతి ఏటా నవంబర్‌ ముగిసేలోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)తో పాటు వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వివరాలు, ట్రూఅప్‌ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. ముందే వసూలు చేసిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను పరిగణనలోకి తీసుకుని ట్రూఅప్‌ చార్జీల రూపంలో వినియోగదారులకు పంచాల్సిన లాభ, నష్టాలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది.

ట్రూఅప్‌ ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమైన పక్షంలో వీటిని సమర్పించే వరకు ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు ఈఆర్సీ అనుమతించదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఆర్సీ అనుమతించిన చార్జీలకు, విద్యుత్‌ సరఫరాకు జరిగిన వాస్తవ వ్యయానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ట్రూఅప్‌ చార్జీల పేరిట వసూలు చేసుకునేందుకు ఈఆర్సీ అనుమతిస్తుంది.  

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)