Breaking News

అపురూపాలు పదిలం

Published on Fri, 05/30/2025 - 01:52

గత స్మృతులను నెమరు వేసుకోవాలి. వర్తమానంలో మనుగడ సాధిస్తూ.. భవిష్యత్‌పై కలలు కనాలి. వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయాలి.. అంటారు పెద్దలు. గతం తిరిగిరానిదని కూడా ఉద్బోధిస్తుంటారు. ఏ శాస్త్ర 
సాంకేతిక విజయాన్ని పరిశీలించినా.. దానికి మూలం పూర్వీకుల నుంచి సంక్రమించిన పరిజ్ఞానమే. ఇలాంటి పరిజ్ఞానాన్ని మరిచిపోకుండా.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. వాటిని భద్రపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామస్తులు. 

అయిదారు దశాబ్దాల క్రితం వినియోగించిన వస్తువులు, వ్యవసాయ పరికరాలను భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో సేకరించిన వస్తువులను తెలంగాణ ఆద్యకళా మ్యూజియం పేరిట భద్రపరిచే ప్రయత్నాలు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు.   – సాక్షి, మహబూబాబాద్‌

యాభై ఏళ్లుగా ప్రయత్నాలు 
పూర్వీకులు వినియోగించిన వస్తువులు, ఆనాటి కళలు, వారి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు పూనుకున్నారు శ్రీరామగిరి వాసులు. యాభై ఏళ్ల క్రితం వివేకానంద సాంస్కృతిక సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి ద్వారా ఆనాటి వీధిభాగోతాలు మొదలుకొని.. చిడతల రామాయణం, జడకుప్పి, కోలాటం తదితర కళలను పరిరక్షిస్తూ నేటికీ ప్రదర్శిస్తున్నారు. పాతకాలం నాటి వస్తువులను కూడా సేకరిస్తున్నారు.  

భావితరాల కోసం.. 
మారిన కాలం, వైజ్ఞానిక రంగాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా అనేక నూతన ఆవిష్కరణలు వచ్చాయి. కానీ గతంలో పూర్వీకులు వినియోగించిన వస్తువులను భావితరాలకు చూపించాలనే ఆలోచనతో శ్రీరామగిరి వాసులు తమ ఇళ్లల్లోని వస్తువులను భద్రపరిచారు. 

వీటిలో మోటబొక్కెన, బకెట్‌ పంపు డబ్బాలు, కుందెన, పాన్‌ధాన్‌ (ఆకులు, సున్నం, వక్కల కత్తెర, వక్కలు భద్రపరిచే పెట్టె), చుట్టకుదురు, రోకళ్లు, ఇసుర్రాయి, ఉట్టి, చల్లకవ్వం, ఉట్టి, అటికలు (మట్టితో తయారు చేసిన పాత్రలు), పిల్లలు ఆడుకునే రింగున్, బొంగరాలు మొదలైనవి ఉన్నాయి. చేపల వేట కోసం వినియోగించే ఊత, మావుతోపాటు విడిచిన బట్టలు వేసుకునే మైల్‌దాన్, మంగలి పెట్టె, సానరాయి మొదలైవాటితోపాటు, శ్రీరామగిరి గ్రామానికి చెందిన పాతకాలం పండితులు రాసిన తాళపత్ర గ్రంథాలను కూడా సేకరించారు. 

ఆద్యకళా మ్యూజియం ఏర్పాటు..  
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగానే తెలుగు విశ్వవిద్యాల యం ప్రొఫెసర్లు, పురావస్తు శాఖ వారి ఆధ్వ ర్యంలో వస్తువులు, జానపద కళల ప్రదర్శనల ద్వారా ఆనాటి కళలకు గుర్తింపు తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. 

ఇందులో భాగంగానే ప్రొఫెసర్‌ సుజాత, జయదీర్‌ తిరుమలరావు శ్రీరామగిరి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని యువకులు, పెద్దలు సేకరించిన పురాతన వస్తువులు, వ్యవసాయ పరికరాలను చూసి ఆశ్చర్యపోయారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వివేకానంద సాంస్కృతిక మండలి సభ్యులను అభినందించారు. గ్రామంలో సేకరించిన వస్తువులను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఆద్య కళా మ్యూజియానికి తరలించారు.

పురాతన కళ, సంస్కృతి పరిరక్షణ 
మా గ్రామంలో ఐదు దశాబ్దాల క్రితం సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం వివేకానంద సాంస్కృతిక కళామండలిని ఏర్పాటు చేశాం. నాతోపాటు, మా గ్రామానికి చెందిన బొమ్మిడి వినోద్‌రెడ్డి, ఇతర మిత్రులం.. ఇప్పటికీ ప్రాచీన కళల పరిరక్షణకు పాటుపడుతున్నాం. 

వస్తువులు, వ్యవసాయ పరికరాలను సేకరించాం. చిడతల రామాయణం, జడకుప్పి వంటి కళల ప్రదర్శనకు.. రాష్ట్ర స్థాయిలో మా గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఊరిలో సేకరించిన వస్తువులను మ్యూజియంలో భద్రపరుస్తున్నారంటే మా గ్రామానికే గర్వకారణంగా భావిస్తున్నాం.   – కళాధర్‌ రాజు,   ప్రధాన కార్యదర్శి,  వివేకానంద సాంస్కృతిక మండలి 

కావలసినవి తయారు చేసుకునేవాళ్లు 
పూర్వ కాలం పద్ధతులే వేరు. చేతి వృత్తులు, కుల వృత్తుల వాళ్లు ఎక్కువ. ఎవరికి కావలసిన వస్తువులను వారు తయారు చేసుకునే వాళ్లు. అప్పుడు వస్తు మార్పిడి ఉండేది. ఏ వస్తువు కూడా పర్యావరణానికి భంగం కలిగించేది కాదు. అందువల్లే పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఉన్నారు.   – మురళీధర్‌ స్వామి, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు 

జ్ఞాపకాలు పదిలం 
చిన్నతనంలో పల్లెటూరులో పెరిగాను. అందరం వరుసలతో పిలుచుకునే వాళ్లు. కానీ గోళం, ఊత, గాజె, బొట్టుపెట్టలు ఇప్పుడు కనిపించడం లేదు. వండిన అన్నం ఉట్టిమీద పెడితే.. స్టూలు వేసుకొని ఎక్కి అన్నం పెట్టుకున్న గుర్తులు ఇప్పటికి మరుపు రావు.   – బండారు వెంకటరమణ, మహబూబాబాద్‌ 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)