Breaking News

సాగు చేస్తేనే ‘భరోసా’!

Published on Sat, 03/23/2024 - 01:19

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భావిస్తోంది. అది కూడా పంటల సాగుకు ముందుగాకుండా.. సీజన్‌ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం.

సీజన్‌కు ముందే ఎందరు రైతులు ఎంతమేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందుకే సీజన్‌ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో నిర్ధారించి, సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ‘రైతు భరోసా’మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. 

రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా? 
రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్‌ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం.

ఈ క్రమంలో సీజన్‌కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్‌లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. దీనితో మార్గదర్శకాల రూపకల్పన కత్తిమీద సాములా మారినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

యాసంగిలో సగానికిపైగా తగ్గనున్న సాయం! 
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ‘రైతు భరోసా’ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సందర్భంగా ‘రైతుబంధు’ను పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పంటలు సాగుచేసే భూములకే రైతుభరోసా ఇస్తే పెట్టుబడి సాయం వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా. ఉదాహరణకు గత వానాకాలం సీజన్‌లో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. అప్పుడు సాగైన భూమి 1.26 కోట్ల ఎకరాలే.

ఇకపై ఇలా పంటలు వేయని 26 లక్షల ఎకరాలకు రైతుభరోసా సొమ్ము అందదు. ఇక ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కొత్త సర్కారు నిర్ణయం మేరకు.. వీటికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. మిగతా 85.70 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకు సొమ్ము అందే పరిస్థితి ఉండదు. రెండు సీజన్లకు కలిపి గతంలో సుమారు 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. ఇప్పుడు దాదాపుగా 2.09 కోట్ల ఎకరాలకే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అంటే 98లక్షల ఎకరాలకు రైతుభరోసా అందదని పేర్కొంటున్నారు. 

పరిమితం చేసేందుకే మొగ్గు 
బీఆర్‌ఎస్‌ సర్కారు రైతుబంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి గత వానాకాలం సీజన్‌ వరకు మొత్తంగా రైతులకు రూ.72,815 కోట్లు అందజేసింది. ఇందులో గత వానాకాలంలో 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేసింది. యాసంగి సీజన్‌ కొనసాగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కారు.. ఈ సీజన్‌కు సంబంధించి గతంలో మాదిరే రైతులకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. అంటే 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలి.

అయితే ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర భూమి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే యాసంగికి సంబంధించి కూడా ఐదెకరాల వరకు ఉన్న భూములకే ఆర్థిక సాయం పరిమితం కానుంది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మందికాగా.. వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉన్నారని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి.  

పక్కాగా సాగు లెక్కలు తీసి.. 
శాటిలైట్‌ రిమోట్‌ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చా లని అధికారులు నిర్ణయించారు. ఇందులోనూ ఐదెకరాల్లోపు భూములున్న రైతు లకే ఆర్థిక సాయం అందనుంది. ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు, ఇతర వర్గాలవారికి రైతుభరోసా నిలిపివేయనున్నారు. ఐదెకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచనా అమలు చేస్తే.. నిధుల వ్యయం మరింతగా తగ్గుతుంది. ఇప్పటివరకు 1.52 కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా.. కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి రూ.22,800 కోట్లు కావాలి. అయితే సాగుచేయని భూమిని తొలగించడం, ఐదెకరాలకు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే.. దాదాపు రూ.10వేల కోట్ల వరకు మిగులుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు