Breaking News

కొలిక్కి చేరని ‘క్లింటన్‌’ కేసు!

Published on Wed, 04/02/2025 - 04:13

సాక్షి, హైదరాబాద్‌: రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జర్మన్‌ యువతిపై జరిగిన అఘాయిత్యం రాజధానిలో తీవ్ర కలకలం సృష్టించింది. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని బంజారాహిల్స్‌లో ఓ విదేశీ యువతిపై అత్యాచారం జరిగింది. 

అమెరికా నుంచి వచ్చి, బేగంపేటలోని క్లింటన్‌ ఫౌండేషన్‌లో న్యూట్రీషన్‌గా పనిచేసిన బాధితురాలిపై 2010 జూలై 7న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనంగా మారడంతో ఏకంగా రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా నిందితుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. 

తుపాకీ చూపించి అత్యాచారం...
అమెరికాకు చెందిన సదరు యువతి (అప్పట్లో 25 ఏళ్లు) ఉద్యోగ నిమిత్తం 2009లో నగరానికి వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్డు నెం. 11లోని ఓ ఇంటి పెంట్‌హౌజ్‌లో ఏడాదిన్నర పాటు నివసించింది. ఎప్పటిలాగే తన విధులు ముగించుకుని 2010 జూలై 6 రాత్రి 8 గంటలకు తన ఇంటికి చేరుకుంది. 

తలుపులు లోపల నుంచి తాళం వేసుకుని నిద్రించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ల వయసున్న యువకుడు కిటికీ గ్రిల్‌ తొలగించి లోపలకు ప్రవేశించాడు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి రివాల్వర్‌ చూపిస్తూ అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఉదయం బాధితురాలు నేరుగా ఆస్పత్రికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

తెలిసిన వారిగా ఆధారాలు లభించినా...
ఈ కేసు దర్యాప్తు కోసం నాటి పోలీసు కమిషనర్‌ ఏకే ఖాన్‌ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఘాతుకం జరి­గిన రోజు యువతి అల్మారాలో రూ.5 లక్షలు ఉన్నాయి. ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు తొలుత ఆ డబ్బు గురించే అడిగాడు. దీంతో ఆమెకు తెలిసిన వ్యక్తే ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఆ అమెరికన్‌ అప్ప­ట్లో బేగంపేటలోని ఓ జిమ్‌కు వెళ్లేవారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా మెలిగే కొందరిని అనుమానించారు. క్లూస్‌ టీమ్‌ నిపుణులు ఘటనా స్థలి నుంచి 14 ఆధారాలు సేకరించారు. 

ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా... కేసు మాత్రం కొలిక్కిరాలేదు. ఆ యువతి తన స్వదేశానికి వెళ్లిపోతూ ‘ఫ్రమ్‌ పాస్ట్‌ ఫ్యూ ఇయర్స్‌ ఐ హావ్‌ స్వీట్‌ మెమరీస్‌ ఇన్‌ హైదరాబాద్‌. బట్‌.. దిస్‌ ఇన్సిడెంట్‌ ఈజ్‌ ఎ బ్యాడ్‌ మెమరీ ఫర్‌ మీ’ (హైదరాబాద్‌లో కొంతకాలంగా ఎన్నో తీపి జ్ఞాపకాలు భద్రపర్చుకున్నా. ఈ దురదృష్టకర ఘటన చేదు గుర్తుగా మిగిలిపోయింది) అని పోలీసులతో అన్న మాటలు ఇప్పటికీ అధికారులను వెక్కిరిస్తూనే ఉన్నాయి.

‘విదేశీ’ కేసులపై ప్రత్యేక చట్టం తేవాలి..
విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులు దేశంలో తక్కువగానే నమోదవుతున్నాయి. అత్యాచారం వంటి ఉదంతాలు అరుదు. అనేక కేసుల్లో నిందితులు చిక్కుతున్నా.. ఈ కేసుల్లో శిక్షలు పడే శాతం మాత్రం దా­రు­ణంగా ఉంటోంది. బాధితులు తమ దేశాలకు వెళ్లి­పోయిన తర్వాత కేసు విచారణను పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. 

ప్రతి కేసుకూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు పెట్టడం సాధ్యం కాకపోవడంతో విచారణకు చాలా సమ­యం పడుతోంది. ఇవన్నీ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించి ప్రత్యేక చట్టం, కోర్టులు అమలులోకి తీసుకువస్తే ఈ పరిస్థితులు మారే అవకాశం ఉంది.    – పి.రామకృష్ణ, మాజీ డీఎస్పీ 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)