Breaking News

Paris Olympics: రెజ్లింగ్​లో భారత్​కు పతకం ఖాయం

Published on Tue, 08/06/2024 - 23:47

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ 50 కేజీల విభాగంలో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌ ఖాతాలో చేరేది స్వర్ణమా, రజతమా అనేది నేడు రాత్రి తేలనుంది. ఈరోజు రాత్రి 11 తర్వాత అమెరికా రెజ్లర్‌ సారా హిల్డెబ్రాంట్‌తో జరిగే ఫైనల్లో వినేశ్‌ విజయం సాధిస్తే ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ ఓడిపోయినా రజత పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా ఆమె గుర్తింపు పొందుతుంది.  

పారిస్‌: విశ్వ క్రీడల్లో తమ ‘పట్టు’ను నిలబెట్టుకుంటూ వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ క్రీడాంశంలో భారత్‌కు పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్‌ 50 కేజీల విభాగంలో వినేశ్‌ ఫొగాట్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన 50 కేజీల ఈవెంట్‌లో వినేశ్‌ వరుసగా మూడు బౌట్‌లలో విజయం సాధించి స్వర్ణ–రజత పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో వినేశ్‌ 5–0తో పాన్‌ అమెరికన్‌ గేమ్స్‌ చాంపియన్‌ యుస్నెలిస్‌ గుజ్మాన్‌ లోపెజ్‌పై గెలిచింది. మూడు నిమిషాల నిడివి గల తొలి భాగం ముగిసేసరికి వినేశ్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు నిమిషాల నిడివి గల రెండో భాగంలోనూ వినేశ్‌ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తన అనుభవాన్నంతా 
రంగరించి పోరాడిన వినేశ్‌ ఈ భాగంలో నాలుగు పాయింట్లు స్కోరు చేసింది. వినేశ్‌ డిఫెన్స్‌ను ఛేదించలేక క్యూబా రెజ్లర్‌ ఒక్క పాయింట్‌ కూడా సాధించలేకపోయింది.

యూరోపియన్‌ మాజీ విజేతను ఓడించి... 
క్వార్టర్‌ ఫైనల్లో వినేశ్‌ 7–5 పాయింట్ల తేడాతో 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత, 2019 యూరోపియన్‌ చాంపియన్‌ ఒక్సానా లివాచ్‌ (ఉక్రెయిన్‌)ను ఓడించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌లో వినేశ్‌ ఆరంభంలోనే 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌ రెజ్లర్‌ కోలుకొని స్కోరును సమం చేసింది. అయితే చివర్లో వినేశ్‌ దూకుడుగా వ్యవహరించి రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది.

ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ను మట్టికరిపించి... 
అంతకుముందు తొలి రౌండ్‌లో వినేశ్‌ పెను సంచలనం సృష్టించింది. 50 కేజీల విభాగంలో ప్రస్తుత ఒలింపిక్‌ చాంపియన్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌ సుసాకి యుయి (జపాన్‌)పై 3–2తో గెలిచి రెజ్లింగ్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 25 ఏళ్ల సుసాకి ఈ బౌట్‌కు ముందు తన అంతర్జాతీయ కెరీర్‌లో ఒక్క పరాజయం కూడా చవిచూడలేదు. తాను పోటీపడిన 82 బౌట్‌లలోనూ సుసాకి విజేతగా నిలిచింది.

టోక్యో ఒలింపిక్స్‌లో సుసాకి తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్‌ కూడా ఇవ్వకుండా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. వినేశ్‌తో పోరులో సుసాకి ఫేవరెట్‌ అని అందరూ భావించారు. బౌట్‌ కూడా అలాగే సాగింది. ఐదు నిమిషాల 49 సెకన్లు ముగిసే వరకు సుసాకి 2–0తో ఆధిక్యంలో నిలిచి విజయం అంచుల్లో నిలిచింది. ఈ దశలోనే వినేశ్‌ అద్భుతం చేసింది. అందివచి్చన అవకాశాన్ని వదలకుండా ఒక్కసారిగా సుసాకిని కిందపడేసి మూడు పాయింట్లు సాధించి అనూహ్య విజయాన్ని అందుకుంది.

సాక్షి తర్వాత వినేశ్‌... 
2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి భారత్‌కు పతకాలు లభిస్తున్నాయి. 2008 బీజింగ్‌లో సుశీల్‌ కుమార్‌ (66 కేజీలు) కాంస్యం గెలిచాడు. 2012 లండన్‌లో సుశీల్‌ కుమార్‌ (66 కేజీలు) రజత పతకం నెగ్గగా... యోగేశ్వర్‌ దత్‌ (60 కేజీలు) కాంస్య పతకం సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్‌ సాక్షి మలిక్‌ (58 కేజీలు) కాంస్య పతకం సొంతం చేసుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బజరంగ్‌ (65 కేజీలు) కాంస్యం... రవి కుమార్‌  (57 కేజీలు) రజతం గెల్చుకున్నారు. సాక్షి మలిక్‌ తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ గుర్తింపు పొందనుంది.    

‘పట్టు’ వీడని పోరాటం
అసాధారణం వినేశ్‌ ఫొగాట్‌ ఒలింపిక్‌ పతక ప్రస్థానం  
‘ఈ అమ్మాయిని పోలీసు దెబ్బలతో అణచివేశారు... ఈ అమ్మాయిని తన దేశంలోనే రోడ్లపై ఈడ్చుకెళ్లారు... కానీ ఇదే అమ్మాయి ఇప్పుడు ప్రపంచాన్ని గెలుస్తోంది... పోరాటంలో ఎక్కడా తగ్గని మా వినేశ్‌ సివంగిలాంటిది. ఆమె విజయాలు చూస్తుంటే ఆనందిస్తున్నామో, కన్నీళ్లు వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఆమె ఆడుతున్న తీరు చూస్తే వినేశ్‌ ఒక్కతే కాదు... దేశంలోని ప్రతీ మహిళ పోరాడుతున్నట్లుగా ఉంది’... భారత మాజీ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేత బజరంగ్‌ పూనియా మంగళవారం వినేశ్‌ ఫొగాట్‌ గురించి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్య ఇది.

నిజం... వినేశ్‌ సాధించిన ఘనత ఇప్పుడు ఒలింపిక్‌ పతకం మాత్రమే కాదు, అంతకుమించి దానికి విలువ ఉంది. ఆటలో కాకుండా మ్యాట్‌ బయట ఆమె ఎదుర్కొన్న అవమానం, బాధలు, కన్నీళ్లు ఈ పతకం వెనక ఉన్నాయి. ఏడాదిన్నర ముందు ఆమె ఈ పతకం గెలిచి ఉంటే ఒక ప్లేయర్‌గానే ఆమె గొప్పతనం కనిపించేది. కానీ ఇప్పుడు అన్ని ప్రతికూల 
పరిస్థితులను దాటి సాధించిన ఈ గెలుపు అసాధారణం.

ఢిల్లీ వీధుల్లో ఆమె జీవితంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. పోలీసు దెబ్బలు, అరెస్ట్, బహిరంగంగా అవమానాలు, చంపేస్తామనే బెదిరింపులు, అవార్డులను వెనక్కి ఇచ్చే పరిస్థితులు రావడం, గెలిచిన పతకాలన్నీ గంగానదిలో పడేసేందుకు సిద్ధం కావడం... ఇలా ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా వినేశ్‌ వేదన అనుభవించింది. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశి్నంచడం వల్లే, సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోమని కోరడం వల్లే ఇదంతా జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో వినేశ్‌ తన కెరీర్‌ను పణంగా పెట్టింది. 

రిటైర్మెంట్‌కు చేరువైంది కాబట్టే ఇలా చేస్తోందంటూ వినిపించిన వ్యాఖ్యానాలను ఆ తర్వాత బలంగా తిప్పి కొట్టింది. మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయం నుంచి కోలుకొని మరీ పోరాడింది. ఆరు నెలలు ముగిసేలోపు తానేంటో నిరూపించుకుంటూ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు ఒలింపిక్స్‌ ఆడిన భారత రెజ్లర్‌గా బరిలోకి దిగి మూడో ప్రయత్నంలో తన అద్భుత కెరీర్‌లో లోటుగా ఉన్న ఒలింపిక్‌ పతకాన్ని సాధించి సగర్వంగా నిలిచింది.  కెరీర్‌లో ఎన్నోసార్లు గాయాలతో సహవాసం చేసి కోలుకోగానే మళ్లీ మ్యాట్‌పై సంచలనాలు సృష్టించిన వినేశ్‌పై ఢిల్లీ ఉదంతం తీవ్ర ప్రభావం చూపించింది. 

శరీరానికి తగిలిన గాయాలకంటే మనసుకు తగిలిన ఈ గాయం బాధ చాలా పెద్దది అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌పై పోరాటం తర్వాత మళ్లీ ఆటలోకి అడుగు పెట్టే క్రమంలో కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. సెలక్షన్‌ ట్రయల్స్‌కు హాజరు కాకుండా సీనియార్టీ ద్వారా అడ్డదారిలో వెళ్లేందుకు ప్రయతి్నస్తోందంటూ మళ్లీ విమర్శలు. ఈ మనో వేదన వెంటాడినా వినేశ్‌ బేలగా మారిపోలేదు. మళ్లీ పట్టుదలతో నిలబడింది. కెరీర్‌ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడిన ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీలకు మారాల్సి వచి్చంది. రెజ్లింగ్‌లో ఇలా కేటగిరీ మారడం... అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంత సులువు కాదు. కానీ ఎక్కడైనా నెగ్గగలననే పట్టుదల తనను నడిపించగా ఈ సవాల్‌ను వినేశ్‌ అధిగమించింది.  

2016 రియోలో తొలిసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన వినేశ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ వరకు చేరినా... చైనా రెజ్లర్‌తో బౌట్‌లో ఎడమకాలు విరిగి కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించింది. స్ట్రెచర్‌పై ఆమెను బయటకు తీసుకుపోవాల్సి వచి్చంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌ సమయంలో అద్భుత ఫామ్‌తో అడుగు పెట్టినా క్వార్టర్‌ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. దీనికి తోడు టీమ్‌ యూనిఫామ్‌ ధరించలేదని, గేమ్స్‌ విలేజ్‌ బయట ఉందని, భారత సహచరులతో కలిసి సాధన చేయలేదని క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఫెడరేషన్‌ ఆమెపై సస్పెన్షన్‌ విధించింది. 

కొన్నాళ్లకు దానిని ఎత్తివేయడంతో మళ్లీ ఆటలోకి అడుగు పెట్టినా... గత ఏడాది యాంటీరియర్‌ క్రూషియేట్‌ లిగమెంట్‌ (ఏసీఎల్‌) గాయంతో దెబ్బ పడింది. ఆపై మళ్లీ శస్త్రచికిత్స, రీహాబిలిటేషన్‌. మళ్లీ కోలుకొని మ్యాట్‌పై అడుగు పెట్టిన వినేశ్‌ ఒలింపిక్‌ పతకం సాధించే వరకు విశ్రమించలేదు. కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్ట్రాగామ్‌ ప్రొఫైల్‌లో ఒక స్ఫూర్తిదాయక వాక్యం రాసుకుంది. 

‘ఖుదీ కో కర్‌ బులంద్‌ ఇత్‌నా కే హర్‌ తఖ్దీర్‌ సే పహ్‌లే ఖుదా బందేసే ఖుద్‌ పూఛే బతా తేరీ రజా క్యా హై’ (నిన్ను నువ్వు ఎంత బలంగా మార్చుకో అంటే అదృష్టం అవసరం పడే ప్రతీ సందర్భంలో నీకు ఏం కావాలని దేవుడే స్వయంగా అడగాలి). దీనికి తగినట్లుగా ఇప్పుడు వినేశ్‌ తన రాతను తానే మార్చుకొని రెజ్లింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించింది.     – సాక్షి క్రీడా విభాగం   

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)