టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆదిమూలపు సురేష్ ఫైర్
Breaking News
విజేత వెర్‌స్టాపెన్
Published on Mon, 12/14/2020 - 04:23
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) 2020–సీజన్ ముగింపు రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. యాస్ మరీనా సర్క్యూట్‌లో ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రిలో నిర్ణీత 55 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 28.645 సెకన్లలో ముగించి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన 23 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఏదశలోనూ ఇతర డ్రైవర్ల నుంచి పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు బొటాస్ రెండో స్థానంలో... హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు.
గతవారం సాఖిర్ గ్రాండ్‌ప్రి విజేత సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్–ఆర్‌పీ) ఎనిమిదో ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. కరోనా కారణంగా ఈ సీజన్‌లో 22 రేసులకు బదులుగా 17 రేసులను మాత్రమే నిర్వహించారు. 11 రేసుల్లో గెలుపొందిన హామిల్టన్ (మెర్సిడెస్) 347 పాయింట్లతో ఓవరాల్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏడోసారి సొంతం చేసుకొని దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) రికార్డును సమం చేశాడు. బొటాస్, వెర్‌స్టాపెన్ రెండేసి రేసుల్లో నెగ్గగా... పెరెజ్, పియరీగ్యాస్లీ ఒక్కో రేసులో గెలిచారు. 573 పాయింట్లతో టీమ్ కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ కూడా మెర్సిడెస్ జట్టుకే లభించింది.
Tags