రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!
Breaking News
Hardik Pandya: అలా జరగనట్లయితే పెట్రోల్ పంపులో పనిచేసేవాడిని.. నిజం..
Published on Mon, 10/18/2021 - 14:24
Otherwise I would be working at a petrol pump Says Hardik Pandya: ఆటగాడి జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. వృత్తిగతంగా ముందుకు వెళ్లేందుకు, ప్రేరణ పొందేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నాడు. డబ్బు కారణంగానే జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పుకొచ్చాడు. కాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా టీమిండియా, ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.
అతడి సోదరుడు కృనాల్ పాండ్యా సైతం క్రికెటర్‌గా మంచి గుర్తింపు పొందాడు. భారత జట్టుకు ఆడుతున్న ఈ అన్నదమ్ములు.. ఐపీఎల్‌లోనూ ఒకే టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా... ‘‘ఐపీఎల్ వేలంలో భారీ మొత్తంలో ఆఫర్ దక్కించుకునే ఆటగాళ్లు.. తాము ఆ ధరకు అమ్ముడుపోయేందుకు అర్హులమనే భావనలోకి వెళ్తారు కదా? ఇలాంటివి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసే, ఆలోచనలను పక్కదోవ పట్టించే అంశాలుగా పరిణమిస్తాయి కదా’’ అన్న ప్రశ్న హార్దిక్‌కు ఎదురైంది.
అలా అయితే పెట్రోల్ పంపులో పనిచేసేవాడిని
ఇందుకు బదులుగా... ‘‘అసలేం జరుగుతుందో అర్థం చేసుకోగలిగే శక్తి మనకు ఉండాలి. నేను, కృనాల్ దృఢచిత్తం కలిగిన వాళ్లం. ఐపీఎల్‌లో కచ్చితంగా డబ్బు దొరుకుతుందనే విషయం మాకు తెలుసు. అయితే, డబ్బు వచ్చినంత మాత్రాన ఆలోచనలు మారకూడదు. కాళ్లు నేల మీదే ఉండాలి. డబ్బు మంచిది సోదరా! ఎన్నో మార్పులు తీసుకువస్తుంది. అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ.
నాకు ఇలాంటి అవకాశాలు రాకపోయినట్లయితే.. ఇప్పటికి ఏ పెట్రోల్ పంపులోనూ పనిచేస్తూ ఉండేవాడిని. నేనేమీ సరదాకి ఈ మాట చెప్పడం లేదు. నా వరకు కుటుంబమే నా మొదటి ప్రాధాన్యత. నా కుటుంబ సభ్యులకు మంచి జీవితం ఇవ్వడానికి నేను ఇలాంటి పనులు చేసేందుకు వెనుకాడను’’ అని పేర్కొన్నాడు. కాబట్టి ఆటతో పాటు డబ్బు కూడా ముఖ్యమే అని చెప్పుకొచ్చాడు. డబ్బు దండిగా దొరకనట్లయితే... ఎంత మంది క్రికెట్ ఆడతారో తనకైతే తెలీదంటూ హార్దిక్ పాండ్యా.. తనదైన స్టైల్‌లో పంచ్ వేశాడు. మరి మీరేమంటారు?!
కాగా ఐపీఎల్-2021లో 11 మ్యాచ్‌లలో 127 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా... టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి సిద్ధమవుతున్నాడు.
చదవండి: Prithvi Shaw: ఖరీదైన కారు కొన్న పృథ్వీ షా.. ధర ఎంతంటే!
ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలం సందర్భంగా హార్దిక్ పాండ్యా షేర్ చేసిన వీడియో
Tags : 1