Breaking News

రెండు దశల్లో జనగణన 

Published on Tue, 06/17/2025 - 04:39

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖలోని భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైనట్‌లైంది. రెండు దశల్లో జరుగనున్న ఈ 16వ జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టనున్నారు. చివరి జనగణన 2011లో జరిగింది. మళ్లీ 16 ఏళ్లకు, అంటే 2027 మార్చి 1 తేదీకి ఆ కసరత్తు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. 

శీతాకాలంలో పూర్తిగా మంచుమయంగా మారే జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్‌కు 2026 అక్టోబర్‌ 1ని రిఫరెన్స్‌ తేదీగా కేంద్రం పేర్కొంది. ఆ నాటికల్లా అక్కడ జన, కులగణన ప్రక్రియ పూర్తవుతుంది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2027 మార్చి 1కి పూర్తవుతుంది. ఈ మొత్తం జనాభా లెక్కల ప్రక్రియ దాదాపు 21 నెలల్లో పూర్తికానుంది. జనగణన రెండు దశల్లో జరగనుంది. 

మొదటి దశలో ఆవాస నమోదు కార్యక్రమం (హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌–హెచ్‌ఎల్‌ఓ) జరుగుతుంది. ప్రతి ఇంటి నివాస స్థితి, ఆస్తులు, సౌకర్యాలు తదితర వివరాలు సేకరిస్తారు. తరవాత, రెండో దశలో జనాభా నమోదు (పీఈ– పాపులేషన్‌ ఎన్యుమరేషన్‌) కార్యక్రమం చేపడతారు. ఇందులో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తి లెక్కలు, సామాజిక–ఆర్థిక, సాంస్కృతిక తదితర వివరాలు సేకరిస్తారు. జనగణన చట్టం, 1948 (అధ్యాయం 3) కింద లభించిన అధికారాల ద్వారా 2019 నాటి జనగణన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే, అప్పటి వరకు అమలైన చర్యలు ఇకపై కూడా అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. దాదాపు 34 లక్షల మంది గణనదారులు, పర్యవేక్షకులు... దాదాపు 1.3 లక్షల జనాభా లెక్కల సిబ్బంది జనగణనలో భాగం కానున్నారు. వీరు మొబైల్‌ అప్లికేషన్‌లను ఉపయోగించి డిజిటల్‌ మా ర్గాల ద్వారా జగగణన నిర్వహిస్తారు. ప్రభుత్వం ప్రకటించే పోర్టళ్లు, యాప్‌ల ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకొనే అవకాశాన్ని ఇవ్వనున్నారు. ఈ భారీ కసరత్తుకు దాదాపు రూ. 13 వేల కోట్లు వ్యయం కానుంది.  

మహిళా బిల్లు, డీ లిమిటేషన్‌కు మార్గం సుగమం!
జనగణనపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో కీలకమైన మహిళా రిజర్వేషన్‌ బిల్లు, రాష్ట్రాల మధ్య ఉత్తర– దక్షిణ రగడకు దారితీసేలా ఉన్న నియోజకవర్గాల పునర్విభజనకు కూడా మార్గం సుగమం కానుంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడో వంతు స్థానాలను మహిళలకు ప్రత్యేకించే బిల్లుకు ఇప్పటికే ఆమోదం లభించడం తెలిసిందే.

ఎన్‌సీఆర్‌ కూడా..
2021లో కులగణనతో పా టే జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్సీఆర్‌)ను కూడా అప్‌డేట్‌ చేయాలని నిర్ణయించారు. తాజా కసరత్తులో దాన్ని చేపట్టేదీ లేనిదీ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎన్సీఆర్‌ను అప్‌డేట్‌ చేస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

2011లోనూ కులగణన జరిగినా...
2011 జనగణన సందర్భంగా కూడా కులగణన కసరత్తు జరిగింది. ఈ అంశాన్ని కేబినెట్‌ పరిశీలిస్తుందని 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ లోక్‌సభలో ప్రకటించారు. చాలా పార్టీలు కులగణనకు డిమాండ్‌ చేశాయి. కానీ నాటి యూపీఏ ప్రభుత్వం  కులగణ నకు బదులు ’సామాజిక, ఆర్థిక, కులగణన (ఎస్‌ఈసీసీ)’ పేరిట 2011లో సర్వే జరిపింది. అలా అప్పుడు కుల సంబంధిత గణాంకాలు సేకరించిన వాటిని ఎప్పుడూ వెల్లడించలేదు, ఉపయోగించలేదు. గత మూడేళ్లలో బిహార్, తెలంగాణ కులగణన జరిపాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ కసరత్తు చేసినా, ‘వాటిలో పారదర్శకత లోపించింది. కొన్ని సర్వేలు ఫక్తు రాజకీయ కోణం నుంచి, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ఉద్దేశంతో జరిపారు‘ అని కేంద్రం పేర్కొంది.

అక్టోబర్‌ నుంచే శిక్షణ
→ జనగణన కసరత్తుకు ముందు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లూ, ఇతర సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు. ఇది వచ్చే అక్టోబర్‌ నుంచే మొదలవుతుంది.

→ కేంద్రంలో అత్యున్నత స్థాయిలో కనీసం 100 మంది జాతీయ శిక్షకులు ఉంటారు. వారికి జనగణనతో పాటు ట్రైనర్‌ డెవలప్మెంట్‌ నైపుణ్యాలపై కూడా శిక్షణ ఇస్తారు.
→ తర్వాత వారు దాదాపు 1,800 మంది మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు.

→ వీరు 45,000 పై చిలుకు క్షేత్రస్థాయి ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. వీరు అంతిమంగా కింది స్థాయి సిబ్బంది అయిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లూ, ఇతర సిబ్బందికి శిక్షణ ఇస్తారు.

3 డజన్ల ప్రశ్నలు
జన, కులగణనలో భాగంగా ప్రతి పౌరుడు 36 ప్రశ్నలకు బదులివ్వాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని...
→ టెలిఫోన్, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్నాయా?
→ వాడుతున్న వాహనం
→ ప్రధాన ఆహారం
→ నీటి వనరులు
→ ఎలాంటి ఇల్లు
→ ఇంటి యజమాని మహిళనా?

ఇవీ విశేషాలు
→ జనగణన ప్రక్రియకు స్వీయ–గణన ఎంపిక ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
→ ఈసారి ప్రక్రియను డిజిటల్‌గా నిర్వహించనున్నారు.
→ రాతకోతల అవసరం లేకుండా సిబ్బంది టాబ్‌ల ద్వారా సమాచారం నమోదు చేసుకుంటారు.
→ సేకరణ, ప్రసారం నిల్వ సమయంలో డేటా భద్రతను నిర్ధారించడానికి చాలా కఠినమైన డేటా భద్రతా చర్యలు అమలు చేయనున్నారు.
→ భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఓఆర్‌జీఐ) కార్యాలయం ఇప్పటికే సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ (ఎస్‌ఈ) పోర్టల్‌ను అభివృద్ధి చేసింది.
→ దీనిద్వారా వ్యక్తులు తమ ఇంటి సభ్యుల సమాచారాన్ని వీక్షించడానికి, అప్‌డేట్‌ చేయడానికి వీలవుతుంది.
→ చివరగా 2011లో జరిగిన జనగణన ప్రకారం దేశ మొత్తం జనాభా 121.19 కోట్లు.
→ వారిలో పురుషులు 62.372 కోట్లు (51.54 శాతం)
→ స్త్రీలు 58.646 కోట్ల మంది (48.46 శాతం).
+ 2021 జనగణనకు 2020లోనే సర్వం సిద్ధమైంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

1931లో చివరి కులగణన
స్వాతంత్య్రం అనంతరం  దేశంలో కుల గణన చేపడుతుండటం ఇదే తొలిసారి. భారత్‌లో తొలి  కులగణన 1881లో బ్రిటిష్‌ హయాంలో జరిగింది. అప్పుడు కుల గణన కూడా జరిపి డేటా విడుదల చేశారు. తర్వాత ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరిగింది. 1931 వరకు ప్రతి జనగణనలోనూ కులాలవారీ డేటా కూడా విడుదలయ్యింది. 1941 జనగణనలో కులాల వారీగా డేటా సేకరించినప్పటికీ ఆ గణాంకాలను విడుదల చేయలేదు. దేశంలో 2011 వరకు ఎటువంటి అంతరాయం లేకుండా జనగణన ప్రక్రియ కొనసాగింది. అయితే, కరోనా కారణంగా 2021లో విడుదల చేయాల్సిన జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రతి జనాభా గణనలోనూ, ప్రభుత్వం కేవలం షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల కుల ఆధారిత డేటాను మాత్రమే విడుదల చేసింది. 1931 తర్వాత ఇతర కులాలకు సంబంధించిన గణాంకాలను ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు.
→ ఇది మొత్తమ్మీద 16వ కులగణన. స్వాతంత్య్రం వచ్చాక 8వది.
→ ఈసారి కులగణన కూడా జరపాలని గత ఏప్రిల్‌ 30న ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)