More

కేశవానంద భారతి కన్నుమూత

7 Sep, 2020 03:17 IST

కేరళలోని ఎదనీరు మఠాధిపతిగా పలు సేవా కార్యక్రమాలు

కేరళ ప్రభుత్వం వర్సెస్‌ కేశవానంద భారతి కేసుతో సుప్రసిద్ధులు

ఆ కేసు వల్లనే సంచలన ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తీర్పు  

కాసరగఢ్‌ (కేరళ): రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన స్వామి కేశవానంద భారతి (79) పరమపదించారు. దాదాపు గత ఐదు దశాబ్దాలుగా కేరళలోని ప్రఖ్యాత ఎదనీరు మఠాధిపతిగా కేశవానంద భారతి శ్రీపాద గల్వరు ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో ఆయన కన్నుముశారు. కేశవానంద భారతి మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

కేశవానంద భారతి మృతి సమాచారం తెలుసుకుని భారీగా తరలివచ్చిన భక్తులు, అభిమానులు ఎదనీరు మఠంలో ఆయన మృతదేహానికి కన్నీటి నివాళులర్పించారు. ‘ఎదనీరు మఠాధిపతి కేశవానంద భారతి తత్వవేత్త. శాస్త్రీయ సంగీతకారుడు. యక్షగాన ప్రక్రియను పునరుత్తేజపరచడంలో విశేష కృషి చేశారు’అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాప సందేశం వెలువరించారు. ‘సమాజ సేవలో పూజ్య కేశవానంద భారతి చేసిన సేవలు స్మరణీయం. పేదలు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఆయన గొప్ప కృషి చేశారు’అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.  

మైలురాయి... ఆ తీర్పు
కేరళ భూ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా కేశవానంద భారతి వేసిన పిటిషన్‌ను విచారించి... పార్లమెంటుపై రాజ్యాంగ సాధికారతను స్పష్టం చేస్తూ సుమారు 4 దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు మైలురాయి వంటి తీర్పును ప్రకటించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కుదరదని స్పష్టం చేస్తూ.. ఆ సంచలన తీర్పును 13 సభ్యుల ధర్మాసనం వెలువరించింది. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రకటించిన తీర్పు అదే కావడం విశేషం. ఆ తీర్పుతో రాజ్యాంగ మౌలిక స్వరూప పరిరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుకు దఖలు పడింది.

రాజ్యాంగానికి సవరణలు చేసేందుకు పార్లమెంటుకున్న అపరిమిత అధికారానికి కత్తెర వేసిన తీర్పుగా, పార్లమెంటు చేసిన అన్ని సవరణలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు కట్టబెడుతూ ఇచ్చిన తీర్పుగా అది ప్రసిద్ధి గాంచింది. ‘రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించడం కుదరదు అని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. అందుకే ఈ కేసుకు అంత ప్రాముఖ్యత నెలకొంది’అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కే చంద్రు పేర్కొన్నారు.

భూ సంస్కరణల చట్టాల ఆధారంగా కేరళ ప్రభుత్వం.. ఎదనీరు మఠానికి చెందిన కొంత భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ కేశవానంద భారతి మొదట కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేసి, పాక్షికంగా విజయం సాధించారు. అయితే, 29వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు కేరళ భూ సంస్కరణల చట్టానికి రక్షణ కల్పించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు చేసిన 29వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్‌లో (కోర్టుల న్యాయసమీక్షకు వీలు లేకుండా) చేర్చిన కేరళ తీసుకువచ్చిన రెండు భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగంలోని 31బీ అధికరణ కింద రక్షణ లభించడాన్ని సమర్థించింది.

అయితే, అదే సమయంలో, ‘368 అధికరణ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకున్నప్పటికీ.. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేసే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు’అని స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో లౌకికత, ప్రజాస్వామ్యం భాగమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పు తదనంతర కాలంలో పలు రాజ్యాంగ సవరణలను కొట్టివేయడానికి ప్రాతిపదికగా నిలిచింది. తాజాగా, ఉన్నత న్యాయస్థానాల్లో న్యా యమూర్తుల నియామకానికి సంబంధించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని, సంబంధిత రాజ్యాంగ సవరణను కొట్టివేయడానికి కూడా ఈ తీర్పే ప్రాతిపదిక.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మహువా లోక్‌సభ బహిష్కరణ సిఫార్సుకు.. ఎథిక్స్‌ కమిటీ ఆమోదం

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 4 నుంచి..

అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు

Bihar: రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

అయోధ్యలో కేబినెట్ భేటీ.. ఇదే తొలిసారి