Breaking News

నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక భేటీ 

Published on Sat, 06/05/2021 - 00:54

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విపక్షాల నుంచి అన్ని వైపుల నుంచి దాడిని ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయతను కాపాడేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధమైంది. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై నేడు ఢిల్లీలో జరిగే కీలక సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీకి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సహా సుమారు 10మంది కీలక నాయకులు హాజరు కానున్నారు. అందులో పలువురు బీజేపీ నేతలు సైతం ఉండే అవకాశాలున్నాయి.  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్, దత్తాత్రేయ హోసబలే, కృష్ణ గోపాల్, సురేష్‌ సోని, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ సహా పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి చేరుకుని కసరత్తులు మొదలుపెట్టారు. గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్రమంత్రులు దేశంలోని పరిస్థితులపై సంఘ్‌ ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం.  


బెంగాల్‌లో పరిస్థితి ఏంటి? 
ఈ భేటీలో నాలుగు ప్రధాన అంశాలపై చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. బెంగాల్‌ ఎన్నికలలో ఓటమి, బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఏ దిశలో ముందుకు వెళ్ళాలనే విషయంపై చర్చించనున్నారు. బెంగాల్‌లో ఓటమితో నిరాశలో ఉన్న కమలదళంలో తిరిగి ఉత్తేజం నింపేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఒక ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. మరోవైపు, టీఎంసీని వదిలి ఎన్నికల ముందు బీజేపీలోకి వచ్చిన నాయకులు తిరిగి టీఎంసీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని జరుగుతున్న ప్రచారంపైనా, ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశాలున్నాయి.  


యూపీలో మార్పు సాధ్యమేనా.. 
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉన్న రాజకీయ ప్రతిష్టంభనను తగ్గించడంతో పాటు, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి గల కారణాలపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన ఎమ్మెల్యేల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కుల ప్రాతిపదికన ఆరోపించారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, ముఖ్యమంత్రి మధ్య విబేధాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయనే చర్చ జరుగుతోంది. అంతేగాక కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు వచ్చే ఏడాది రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికలకు సంబంధించిన ప్రచార బాధ్యతలను అప్పగించడంతో పాటు, రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే విషయంలో బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఇలాంటి పరిస్థితిలో, రాబోయే ఎన్నికల్లో బిజెపి ఎలా విజయం సాధిస్తుందనేది పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో నేటి ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక భేటీలో ఒక స్పష్టత కోసం ప్రయత్నం జరగవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.  


డ్యామేజ్‌ కంట్రోల్‌పై ప్రత్యేక దృష్టి: 
మరోవైపు కరోనా మహమ్మారి సమయంలో మోడీ ప్రభుత్వం తన విశ్వసనీయతను ఎందుకు కోల్పోయింది. కరోనాతో వ్యవహరించడంలో ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది? కేంద్ర మంత్రివర్గంలో మార్పు వల్ల పార్టీకి ఏదైనా ప్రయోజనం ఉంటుందా వంటి అంశాలపై జరుగుతున్న చర్చకు ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక భేటీలో ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో దేశం సంక్రమణ పట్టులో చిక్కుకున్న సమయంలోనూ ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు బెంగాల్‌లో ప్రచారంపై దృష్టిపెట్టడంపై వచ్చిన విమర్శలతో జరిగిన డ్యామేజీని చక్కదిద్దే ప్రయత్నం ఈ భేటీలో జరుగనుందని సమాచారం. అంతేగాక ఇటీవల పలు టీవీ ఛానల్స్‌ నిర్వహించిన సర్వేల్లో ప్రధాని మోదీ, అమిత్‌ షా విశ్వసనీయత తగ్గిందని జరుగుతున్న చర్చ కమలదళంపై ప్రభావాన్ని చూపకముందే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందు కు సంఘ్‌–బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులోభాగంగా కేంద్ర కేబినెట్‌ విస్తరణ త్వరలో జరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.  


దేశంలో ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో శనివారం జరుగుతున్న ఈ భేటీలో చర్చించే అంశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కమలదళం అధికారంలోకి వచ్చిన చాలా కాలం తరువాత బీజేపీ విశ్వసనీయతను కాపాడే పనిలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు ఇప్పుడు బిజీగా ఉన్నారు. రాష్ట్రాల్లో, కేంద్రంలో ఉన్నపళంగా కీలక మార్పులు చేసిన పక్షంలో బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

రైతు ఉద్యమం ఇంకెన్నాళ్లు? 
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో 6 నెలలకు పైగా కొనసాగుతున్న రైతుల ఉద్యమం బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఉద్యమాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే రైతులు విసుగు చెంది ఉద్యమం ఎక్కువ కాలం కొనసాగదని, అది విచ్ఛిన్నమవుతుందని కేంద్రప్రభుత్వం భావించింది. కానీ అది జరగలేదు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నప్పుడే, ఇళ్ళకు తిరిగి వెళ్తామని రైతులు ఇప్పటికే స్పçష్టంచేశారు. కాగా ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానాలో ముఖ్యమంత్రి, మంత్రుల బహిరంగ కార్యక్రమాలను సైతం రైతులు నిషేధించారు. కొన్ని రోజుల క్రితం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కూడా ప్రధానిని కలిసి ప్రస్తుత పరిస్థితులను ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ భేటీలో బీజేపీ ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశాలున్నాయి.   

Videos

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

పుష్ప రాజ్ తో కేజీఎఫ్ 2 భామ

పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో

ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు

ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం

బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి

Ding Dong 2.O: సీఎంల జేబులు ఖాళీ

Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!

పాక్ ను వణికించిన BRAHMOS

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

Photos

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు నిరుపమ్‌ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 11-18)

+5

మిస్ వరల్డ్ 2025 ఆరంభం: స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నందిని గుప్తా (ఫొటోలు)

+5

Miss World 2025 : ఘనంగా హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం (ఫొటోలు)

+5

సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)

+5

పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్‌ (ఫొటోలు)