అందాల యుద్ధం
Breaking News
లైంగిక ఆరోపణలేగా!.. మేమూ తగ్గం
Published on Fri, 05/28/2021 - 14:35
చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ గేయ రచయిత వైరముత్తుకు వ్యతిరేకంగా మరోసారి గళం వినిపిస్తోంది. కేరళ ఒఎన్వీ గురువ్ జాతీయ పురస్కారాన్ని వైరముత్తుకు అందించడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో వైరముత్తుపై ఆరోపణలు చేసిన సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయితో పాటు మాలీవుడ్ హీరోయిన్లు కొందరు ఈ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు.
కాగా, 2018 మీటూ ఉద్యమ సమయంలో గేయరచయిత వైరముత్తుపైనా చిన్మయితోపాటు మరో పదహారు మంది తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై ఎటూ తేలకముందే.. ఓఎన్‌వీ అవార్డు ఇవ్వడం ఇప్పుడు మారం రేపుతోంది. మలయాళ నటి పార్వతి తిరువొతు, గీతూ మోహన్‌దాస్, రీమా కళింగల్ తో పాటు చిన్మయి కూడా గొంతు కలిపింది. అర్హతలేని ఆ వ్యక్తి నుంచి పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.
అది జరగదు
ఈ విమర్శలపై ఒఎన్వీ కల్చరల్ అకాడమీ ప్రెసిడెంట్ అదూర్ గోపాలకృష్ణన్ స్పందించారు. ఈ పురస్కారం ప్రతిభ ఆధారంగా ఇచ్చిందే తప్ప.. క్యారెక్టర్ చూసి కాదని అన్నారు. వైరముత్తు మంచి గేయ రచయిత. అయినా ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఈరోజుల్లో ఎవరు.. ఎవరిపైన అయినా ఆరోపణలు చేయొచ్చు. జ్యూరీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు అని గోపాలకృష్ణన్ స్పష్టం చేశారు. ఈ తరుణంలో తాము పోరాటాన్ని ఆపబోమని హీరోయిన్లు స్పష్టం చేశారు.
నాన్-మలయాళీ
మలయాళంలో దివంగత ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత ఓఎన్‌వీ గురుప్ పేరుతో 2017లో జాతీయ సాహితీ అవార్డులు ఏర్పాటు చేశారు. దీన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కవులు, గీత రచయితలకే ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రేతర ప్రముఖులకు ప్రకటించడం ఇదే ప్రథమం. ఇక ఓఎన్‌వీ గురుప్ జాతీయ సాహితీ అవార్డు అందుకున్న వైరముత్తును తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు కూడా.
Tags : 1