ఫ్రీ బస్సుకు మంగళం ? డీకే శివకుమార్ సంచలన కామెంట్స్
Breaking News
స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
Published on Mon, 04/29/2024 - 10:06
దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఈయన బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి ప్రధానపాత్రను పోషించిన ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంలో అజిత్ క్యామియో పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈయన 'విడాముయర్చి' చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థకు ఈ చిత్రం చాలా కీలకమైనది. ఇటీవల ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. కాగా విడాముయర్చి చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
తాజాగా అజిత్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనికి 'మార్క్ ఆంటోని' చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లి అనే టైటిల్ ఖరారు చేశారు. కాగా ఇందులో టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీల నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో నటుడు అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నారట.
ఇందులో ఆయనకు జంటగా మరో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు నటి 'సిమ్రాన్' కాగా మరొకరు 'మీనా' అని తెలిసింది. కాగా నటి సిమ్రాన్ ఇప్పటికే అజిత్‌తో కలిసి వాలి, అవళ్ వరువాళా వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించగా, నటి మీనా సిటిజెన్, విలన్ చిత్రాల్లో అజిత్‌తో జత కట్టారు. దీంతో తాజాగా ఇద్దరూ కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఆయన సరసన నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ నెలలో సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారికంగా త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Tags