Breaking News

వోయేజర్-1… ‘కాంతి రోజు’!

Published on Sat, 07/04/2026 - 17:58

ఓ బాటసారి... ఇది విశ్వపు రహదారి... ఏది అంతమో... ఎంత దూరమో... ఎవరూ ఎరుగని దారి ఇది.. వినడానికే అబ్బురపరచే దూరం అది! ‘ద స్కై లైవ్’ సమాచారం ప్రకారం 2026 జులై 4 నాటికి తన సుదీర్ఘ యానంలో భూమి నుంచి కచ్చితంగా 2,547 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది నాసా అంతరిక్ష నౌక ‘వోయేజర్-1’. భూమి నుంచి అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు ఇదే. 2,547 కోట్ల కిలోమీటర్లు అంటే భూమి నుంచి 170 సార్లు సూర్యుడి వద్దకు వెళ్లినంత దూరం.

2012 ఆగస్టులో ‘ఇంటర్స్టెల్లార్ స్పేస్’ (నక్షత్రాంతర రోదసి)లో ప్రవేశించిన ‘వోయేజర్-1’… అలుపూ సొలుపూ లేని తన 49 సంవత్సరాల అనంత యాత్రలో రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 1,583 కోట్ల మైళ్ల దూరం ప్రయాణించింది. శాస్త్రవేత్తలు పంపే ఆదేశాలు ఈ నౌకను చేరడానికి 23.5 గంటలు పడుతోంది. వాటికి ప్రతిస్పందించి ‘వోయేజర్-1’ పంపే సందేశాలు భూమిని చేరడానికి కూడా అంతే సమయం పడుతోంది. అంటే ఈ ‘ఉత్తర ప్రత్యుత్తరాలకు’ దాదాపు రెండు రోజులు పడుతోంది. ‘వోయేజర్-1’ స్పేస్ క్రాఫ్ట్ తదుపరి లక్ష్యం... ‘కాంతి రోజు’ను చేరడం. ఈ ఏడాది నవంబరు 26న అది ‘కాంతి రోజు’ లక్ష్యాన్ని అధిగమిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఏమిటీ ‘కాంతి రోజు’?
అంతరిక్ష దూరాలను ‘ఆస్ట్రనామికల్ యూనిట్స్’లో కొలుస్తారు. భూమికి, సూర్యుడికి మధ్య దూరం సుమారు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ (AU). ఒక నక్షత్రానికి, మరో నక్షత్రానికి మధ్య మరీ ఎక్కువగా ఉండే నక్షత్రాంతర దూరాలను కాంతి సంవత్సరాల్లో వర్ణిస్తారు. కాంతి సంవత్సరం అంటే... కాంతి ఏడాది కాలంలో ప్రయాణించే దూరం. ఒక సెకనులో కాంతి ప్రయాణించే దూరం మూడు లక్షల కిలోమీటర్లు. ‘వోయేజర్-1’ను నాసా 1977 సెప్టెంబరు 5న ప్రయోగించింది. గురుడు, శని గ్రహాల అధ్యయనంతోపాటు నక్షత్రానంతర మాధ్యమం అన్వేషణ నిమిత్తం నాసా ఈ మిషన్ చేపట్టింది.

2027 సంవత్సరంలో ఈ వ్యోమనౌక 50వ పడిలో పడుతుంది. ఈ ‘గోల్డెన్ జూబిలీ ఇయర్’లోపు మరో మరపురాని అద్భుత ఘట్టం సాక్షాత్కరించబోతోంది. ఈ ఏడాది నవంబరు 26న ఈ స్పేస్ క్రాఫ్ట్ తన ఇల్లు అయిన భూమి నుంచి 1,610 కోట్ల మైళ్లు లేదా 2,590 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 173 ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరం... కాంతి ఒక రోజులో (One Light Day) ప్రయాణించే దూరంతో సమానం. కాంతి సంవత్సరాల యూనిట్ పరంగా ఇదొక మైలురాయి లాంటిది. కాంతి వేగంతో ప్రయాణించే రేడియో సంకేతాలు భూమి నుంచి ఆ నౌకను చేరాలంటే ఇకపై కచ్చితంగా ఒక రోజు పడుతుంది. నౌక నుంచి భూమికి తిరుగు సమాచారం అందాలంటే మరో రోజు వ్యవధి అవసరం.

‘గోల్డెన్ రికార్డు’లో మానవ చరిత్ర!
మూడు ప్లూటోనియం-238 రేడియో ఐసోటోప్ జనరేటర్ల సాయంతో ‘వోయేజర్-1’ పనిచేస్తోంది. ప్రయోగ సమయంలో అవి 470 వాట్ల శక్తిని ఉత్పత్తి చేయగా, ప్రస్తుతం 250 వాట్ల శక్తిని మాత్రమే తయారు చేస్తున్నాయి. నౌక ప్రతియేటా 4 వాట్ల చొప్పున శక్తిని కోల్పోతోంది. అలా ‘వోయేజర్-1’ శక్తిస్థాయులు నానాటికీ సన్నగిల్లుతున్న తరుణంలో... అది ఇప్పుడున్న దూరానికి అదనంగా వచ్చే రెండేళ్ల కాలంలో మరో 90 కోట్ల కిలోమీటర్ల దూరం అంతరిక్షంలో ప్రయాణించాలంటే నాసా ఇంజినీర్లు నౌకలోని కొన్ని శాస్త్రీయ పరికరాలను పనిచేయించడం నిలిపివేసి పవర్ ఆదా చేయాల్సివుంటుంది. నౌకను బతికించుకోవడానికి కొన్ని దశాబ్దాలుగా వారు అందులోని హీటర్లు, ఇతర పరికరాలు, కీలకం కాని వ్యవస్థలను ఒకదాని వెంట ఒకటిగా షట్ డౌన్ చేస్తూ వస్తున్నారు.

పరిస్థితులు అనుకూలిస్తే మరికొన్నాళ్లపాటు ‘వోయేజర్-1’ ప్రయాణం సవ్యంగా ముందుకు సాగుతుందని, 2030వ దశకంలో ఏదో ఒక రోజు అది చివరి సందేశం పంపి శాశ్వత నిద్రలోకి జారుకుని వీడ్కోలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇంటర్నెట్ రాకముందే, స్మార్ట్ ఫోన్ కనిపెట్టక మునుపే, ఆధునిక సాంకేతికత ఇంకా ఎదగని రోజుల్లోనే మానవుడు సృష్టించిన ఓ చిన్న యంత్రం ఇన్నేళ్లుగా అల్లంత దవ్వున వినువీధి గాఢాంధకారాల్లో ఒంటరి బాటసారిలా రివ్వున దూసుకుపోతూ ఎన్నో స్పేస్ మిషన్లకు ఓ ఆశాకిరణంలా, స్ఫూర్తిగా నిలుస్తోంది. అబ్బో... భూమికి ‘వోయేజర్-1’ ప్రస్తుతం 2,547 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందని మనం అచ్చెరువొందుతాం గానీ.. ఇంటర్స్టెల్లార్ దూరాలతో పోల్చి చూస్తే అదేమంత దూరం కాబోదు.

ఎందుకంటే... మన సౌరవ్యవస్థ వెలుపల భూమికి అతి సమీపంగా ఉన్న నక్షత్రం పేరు ‘ప్రాగ్జిమా సెంటారై’. అది భూమికి 4.24 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ‘వోయేజర్-1’ ప్రస్తుతం గంటకు 1.28 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి నుంచి దూరంగా వెళుతోంది. ఆ వేగంతో అది ‘ప్రాగ్జిమా సెంటారై’ను చేరాలంటే ఇంకా సుమారు 73 వేల ఏళ్లు ప్రయాణించాలి! ‘వోయేజర్-1’ మిషన్ ముగిసినా, భూమితో సమాచార సంబంధాలు తెగిపోయి అది శాశ్వతంగా మూగబోయినా, ఆ తర్వాత కూడా నౌక కొన్ని వందల కోట్ల ఏళ్లపాటు నక్షత్రాంతర రోదసిలో ఎటోకటు కొట్టుకుపోతూనే ఉంటుంది.

ఒకవేళ గ్రహాంతర జీవులేవైనా ‘వోయేజర్-1’ను గుర్తిస్తే మానవాళి చరిత్ర వాటికి తెలిసేలా నౌకలో నాసా శాస్త్రవేత్తలు ఓ ‘గోల్డెన్ రికార్డు’ను  అమర్చారు. ఇదొక గోల్డ్ ప్లేటెడ్ ఫోనోగ్రాఫ్ రికార్డు. 55 భాషల్లో శుభాకాంక్షలు, ప్రపంచవ్యాప్తంగా వినిపించే సంగీతం, వర్షం కురిసే శబ్దం, పక్షుల కిలకిలారావాలు, చిత్రాలు వంటివి అందులో ఉన్నాయి.  
- జమ్ముల శ్రీకాంత్
(Courtesy: Interstellar Traveller, The Sky Live, NASA, CNN)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)