Breaking News

యూన్‌ అభిశంసన సరైనదే

Published on Sat, 04/05/2025 - 05:19

సియోల్‌: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అభిశంసన సబబేనని ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనను పదవి నుంచి తొలగిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు రెండు నెలల్లో ఎన్నికలకు ఆదేశించింది. 64 ఏళ్ల యూన్‌ ప్రయోగించిన మార్షల్‌ లా రాజ్యాంగాన్ని, ఇతర చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించినందని కోర్టు తాత్కాలిక చీఫ్‌ మూన్‌ హ్యూంగ్‌ బే ప్రకటించారు. అందుకే ఆయన అభిశంసనను ఎనిమిది మంది సభ్యుల ధర్మాసనం సమర్థించిందని పేర్కొన్నారు.

 ‘‘యూన్‌ మార్షల్‌ లా అమలు ప్రజల ప్రాథమిక రాజకీయ హక్కులను దెబ్బతీసింది. చట్ట పాలనను, ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించింది. ఆయన తన విధి నిర్వహణలో విఫలమయ్యారు. రక్షించాల్సిన వ్యక్తులకు వ్యతిరేకంగా పనిచేశారు. జాతీయ అత్యవసర అధికారాలను ఉపయోగించడం సమర్థనీయం కాదు’’ అని తీర్పు పేర్కొంది. దేశంలో రాజకీయ గందరగోళానికి ఇకనైనా తెర పడుతుందేమో చూడాలి. యూన్‌పై క్రిమినల్‌ అభియోగాలు కొనసాగనున్నాయి. పదవిలో ఉంటూ అరెస్టయిన, అభియోగాలు ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడు ఆయనే! 

ప్రజావిజయం: విపక్షం 
తీర్పును ప్రజల విజయంగా ప్రతిపక్ష డెమొ క్రటిక్‌ పార్టీ అభివర్ణించింది. యూన్‌ వ్యతిరేకులు హర్షధ్వానాలతో హోరెత్తించారు. జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. మైదానాల్లో ఉత్సాహం ఉప్పొంగిపోయింది. ‘‘రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, ప్రజలకు లభించిన విజయమిది. ప్రజా శత్రు వును ప్రజాస్వామ్య ఆయుధంతో ఓడించిన ప్రజలకు కృతజ్ఞతలు’’ అని అభిశంసన కేసు ప్రాసిక్యూటర్, డెమొక్రటిక్‌ పార్టీ చట్టసభ్యుడు జంగ్‌ చుంగ్‌ రే తెలిపారు.

 తీర్పుపై యూన్‌ మద్దతుదారులు కన్నీటిపర్యంతమ య్యారు. తీర్పు రాగానే ‘కొరియా కథ ముగిసింది’ అంటూ నినాదాలు చేశారు. ఇది పూర్తి గా అప్రజాస్వామిక, అన్యాయమైన తీర్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ తీర్పేనని యూన్‌ లాయర్లు వాపోయారు. అయితే తీర్పును అంగీకరిస్తున్నామ ని అధికార పీపుల్‌ పవర్‌ పార్టీ తెలిపింది. 

ఇదీ నేపథ్యం... 
దక్షిణ కొరియాలో ఈ రాజ్యాంగ సంక్షోభం నాలుగు నెలల క్రితం మొదలైంది. గత డిసెంబర్‌ 3న రాత్రివేళ ఉన్నట్టుండి మార్షల్‌ లా విధిస్తున్నట్టు అధ్యక్ష హోదాలో యూన్‌ ప్రకటించారు. విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ తన పార్లమెంటరీ మెజారిటీని దురి్వనియోగం చేస్తోందని, దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే పార్లమెంటును మూసేసేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రయత్నాలను చట్టసభ సభ్యులు ధిక్కరించారు.

 సైనిక చట్టాన్ని తిరస్కరిస్తూ ఓటేశారు. దాంతో ఆరు గంటలకే మార్షల్‌ లా డిక్రీని యూన్‌ ఎత్తేయాల్సి వచ్చింది. కానీ ఆ ఆరు గంటల సైనిక పాలన రాజకీయ సంక్షోభాన్ని మిగిల్చింది. ఆర్థిక మార్కెట్లను కుదిపేసింది. దీనిపై నెలల తరబడి నిరసనలు వెల్లువెత్తాయి. విపక్షాల ఆధిపత్యమున్న జాతీయ అసెంబ్లీ డిసెంబర్‌ 14న యూన్‌ను అభిశంసించింది. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించారని, నేతల నిర్బంధించడానికి యత్నించారని, శాంతికి భంగం కలిగించారని ఆరోపించింది.

 వీటిని యూన్‌ ఖండించారు. జాతీయ అసెంబ్లీని నేరగాళ్లు, ప్రభుత్వ వ్యతిరేక శక్తుల అడ్డాగా అభివర్ణించారు. డెమొక్రటిక్‌ పార్టీ దుర్మార్గంపై పోరాటానికి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో భాగంగానే మార్షల్‌ లా విధించినట్టు రాజ్యాంగ కోర్టు ముందు చివరి వాంగ్మూలంలో చెప్పుకున్నారు. 2021లో పీపుల్‌ పవర్‌ పారీ్టలో చేరిన ఆయన రాజీలేని వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నారు. 2022లో అధ్యక్షుడయ్యారు. కుంభకోణాల్లో చిక్కుకున్న అధికారులను మార్చడానికి నిరాకరించడం, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను వీటో చేయడం ద్వారా విమర్శల పాలయ్యారు.  

భారీ భద్రత 
తీర్పు నేపథ్యంలో యూన్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రజలు వేలాదిగా కోర్టు ముందు బారులు తీరారు. దాంతో తీర్పు తర్వాత అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహ రించారు. దేశమంతటా ఎమర్జెన్సీ ప్రకటించారు. తీర్పు సందర్భంగా దేశమంతటా జనం టీవీలకు అతుక్కుపోయారు. 

విపక్ష నేత లీ ముందంజ 
దక్షిణ కొరియాలో జూన్‌ 3న ముందస్తు ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. 2017లో పార్క్‌ గ్యున్‌ హైని అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు కూడా 60 రోజుల తర్వాత ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష రేసులో విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ నేత లీ జే మ్యుంగ్‌ ముందున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల దాకా తాత్కాలిక అధ్యక్షునిగా హాన్‌ డక్‌ సూ కొనసాగుతారు. ‘‘ప్రజల సంకల్పాన్ని గౌరవిస్తూ ఎ న్నికలను రాజ్యాంగానికి, చట్టానికి అనుగుణంగా నిర్వహించడానికి కృషి చేస్తా. అధికార మారి్పడి సజావుగా జరిగేలా చూస్తా’’ అని ఆయన ప్రకటించారు. 
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)