Breaking News

భూమి రెండో పొర నుంచి... రాళ్ల నమూనా!

Published on Mon, 08/12/2024 - 05:23

బ్రిటన్‌ భూ భౌతిక శాస్త్రవేత్తలు అత్యంత  అరుదైన ఘనత సాధించారు. భూమి రెండో పొర అయిన మ్యాంటల్‌ (ప్రవారం) నుంచి తొలిసారిగా రాళ్ల నమూనాలను సేకరించగలిగారు. అట్లాంటిక్‌ మహాసముద్ర గర్భం నుంచి ఏకంగా 1,268 మీటర్ల మేర లోపలికి తవ్వి మరీ వాటిని వెలికితీశారు! భూగర్భంలో ఇప్పటిదాకా అత్యంత లోతైన ప్రాంతం నుంచి సేకరించిన శిల నమూనా ఇదే!!

 భూ ప్రవారంలో ఇంత లోతు దాకా డ్రిల్లింగ్‌ చేయగలగడమూ ఇదే మొదటిసారి. మహాసముద్రాల్లో డ్రిల్లింగ్‌ పనులు చేపట్టడంతో తిరుగులేని రికార్డున్న నౌక జోయిడిస్‌ రిజల్యూషన్‌ సాయంతో ఈ ఘనత సాధించారు. భూమి పుట్టుకకు సంబంధించిన ఇప్పటిదాకా మనకందని పలు కీలక రహస్యాల గుట్టు విప్పడంలో ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకంతగా తెలియని భూ ప్రవారం తాలూకు కూర్పు, అక్కడ నిత్యం జరిగే కీలక రసాయనిక ప్రక్రియల గురించి విలువైన సమాచారం కూడా తెలుస్తోందట. 

అతి పెద్ద ముందడుగు 
భూమి ప్రధానంగా మూడు పొరలుగా ఉంటుంది. బాహ్య పొరను పటలం అంటారు. రెండో పొర రాళ్లమయమైన ప్రవారం కాగా అత్యంత లోపలి భాగమైన కేంద్రమండలం మూడో పొర. భూమి మొత్తం పరిమాణంలో ప్రవారం వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. అట్లాంటిక్‌ మహాసముద్ర గర్భంలో దాగున్న అట్లాంటిస్‌ పర్వత శ్రేణి నుంచి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ తాజా నమూనాలను సేకరించగలిగారు. 

భూ ప్రవార శిలా ఖండాలు సముద్ర జలాలతో ఎలా ప్రతిచర్య చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి తాజా నమూనాల విశ్లేషణ బాగా దోహదపడిందట. వందలాది కోట్ల ఏళ్ల కింద భూమిపై తొలిసారిగా జీవం ఎలా పురుడు పోసుకుందో తెలుసుకునే క్రమంలో ఈ తాజా వివరాలను అతి పెద్ద ముందడుగుగా సైంటిస్టులు అభివర్ణిస్తుండటం విశేషం. 

సేకరణ అంత ఈజీ కాదు...
భూ ప్రవార శిలలు మానవాళికి ఇప్పటిదాకా అందరానివిగానే ఉండిపోయాయి. అందుకు కారణం లేకపోలేదు. భూ పలకలు పరస్పరం కలిసే చోట్ల, అదీ సముద్ర గర్భంలో మాత్రమే వాటిని సేకరించే వీలుంది. దాంతో సైంటిస్టులు అదే మార్గంలో ప్రయత్నించి ఫలితం సాధించారు. మహాసముద్ర గర్భంలో మిడ్‌ అట్లాంటిక్‌ రిడ్జ్‌కు అతి సమీపంలో ఉన్న అట్లాంటిస్‌ పర్వతశ్రేణి వద్ద ప్రవార శిలలు మనకు గట్టి ప్రయత్నంతో అందేంతటి లోతులోనే ఉంటాయన్న అంచనాతో రంగంలోకి దిగారు. 

2024 ఏప్రిల్‌ నుంచి జోయిడిస్‌ ఇదే పనిలో గడిపింది. చివరికి జూన్‌ నాటికి రికార్డు స్థాయి లోతు దాకా డ్రిల్లింగ్‌ చేసి 886 అడుగుల పొడవున్న శిలా నమూనాను వెతికి తీయగలిగారు. ఈ క్రమంలో సముద్రగర్భం నుంచి 200 మీటర్ల లోతుకు తవ్విన గత రికార్డు తుడిచిపెట్టుకుని పోయింది. పైగా నాటి ప్రయత్నంలో పెద్దగా ప్రవార శిలలేవీ చిక్కలేదు కూడా. కనుక ఎలా చూసినా తాజా నమూనాల వెలికితీత అన్ని రికార్డులనూ బద్దలు కొట్టిందని కార్డిఫ్‌ వర్సిటీ జియాలజిస్టు, ఈ అధ్యయన సారథి జొహాన్‌ లీసెన్‌బర్గ్‌ చెప్పారు.

 ‘‘ప్రవార శిలను పరిశీలించిన మీదట విలువైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలోని ఖనిజ మూలకాలు వివిధ ఉష్ణోగ్రతల వద్ద సముద్ర జలంతో పలు రకాలుగా ప్రతి చర్య జరుపుతున్నట్టు తేలింది. ఫలితంగా సూక్ష్మజీవజాల ఉనికికి అతి కీలకమైన మీథేన్‌ వంటి నమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. ఇంకా వీలైనన్ని ఉష్ణోగ్రతల వద్ద వాటిని విశ్లేషించిన మీదట భూమిపై జీవావిర్భావం తాలూకు రహస్యాలెన్నో విడిపోయే అవకాశముంది’’ అని ఆయన వివరించారు. ఈ పరిశోధన వివరాలను సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)