Breaking News

పేక మేడల్లా కుప్పకూలాయి

Published on Sat, 03/29/2025 - 04:32

భారీ భూకంపం థాయ్‌లాండ్, మయన్మార్‌లను అతలాకుతలం చేసింది. 7.7 తీవ్రతతో మయన్మార్‌లో సంభవించిన ప్రకంపనల ధాటికి ఇరు దేశాల్లో అపార ఆస్తి నష్టం సంభవించింది. భారీ భవనాలు కుప్పకూలాయి. నిర్మాణాలన్నీ పగుళ్లిచ్చాయి. మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

విధ్వంస తీవ్రత దృష్ట్యా ప్రాణ నష్టమూ భారీగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇప్పటిదాకా మయన్మార్‌లో 180 మందికి పైగా మరణించగా 750 మందికి పైగా గాయపడ్డారు. బ్యాంకాక్‌లో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌లో సహాయక, పునరావాస చర్యలు సవాలుగా మారాయి.    

బ్యాంకాక్‌/కోల్‌కతా: ప్రకృతి ప్రకోపానికి థాయ్‌లాండ్, మయన్మార్‌ చిగురుటాకుల్లా వణికిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇరు దేశాల్లోనూ భారీ విధ్వంసం మిగిల్చింది. కాసేపటికే 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. పురాతన బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. 

చాలాచోట్ల విద్యుత్‌ సరఫరా లైన్లు తదితరాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల్లో ఇప్పటిదాకా 200 మందికి పైగా మరణించారు. మయన్మార్‌లోనే 180 మందికి పైగా మరణించారు. 750 మందికి పైగా గాయపడ్డారని సైనిక ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం తక్షణం ఆదుకోవాలని కోరింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా ఉంది. మయన్మార్‌ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి కుప్పకూలింది. అందులో అత్యధికులు మరణించి ఉంటారంటున్నారు. 

భూకంప కేంద్రాన్ని సెంట్రల్‌ మయన్మార్‌లో రెండో అతి పెద్ద నగరమైన మాండలేకు సమీపంలో మొన్య్‌వా సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. కేవలం 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించడంతో ప్రమాద తీవ్రత చాలా పెరిగింది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భవనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. చటూచాక్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భారీ భవంతి నేలమట్టమైంది. దానికింద కనీసం 90 మందికి పైగా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. 

భూకంప తీవ్రతకు భవనాలు అటూ ఇటూ ఊగిపోతున్న దృశ్యాలు, అత్యంత ఎత్తైన ఓ భవనం తాలూకు పై అంతస్తులోని స్విమింగ్‌పూల్‌ నుంచి నీళ్లన్నీ కిందకు పడుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని భూకంపాలు తప్పకపోవచ్చన్న హెచ్చరికలు వణికిస్తున్నాయి. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌లో సహాయక, పునరావాస చర్యలు సవాలుగా మారాయి. ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. బ్యాంకాక్‌లోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. రెండేళ్ల క్రితం తుర్కియేలో 50 వేల మందికి పైగా భూకంపానికి బలవడం తెలిసిందే. ఆ తర్వాత అతి తీవ్ర భూకంపం ఇదే.


 

మయన్మార్‌లో... 
సైనిక పాలనలో మగ్గుతున్న మయన్మార్‌లో 1946 తర్వాత ఇదే అతి తీవ్రమైన భూకంపం. నేపిడాలో రాజప్రసాదాలు, భవనాలు దెబ్బ తిన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చీలిపోయి కన్పిస్తున్నాయి. ఐకానిక్‌ వంతెన, ఆలయాలు తదితరాలు కుప్పకూలాయి. ఇప్పటిదాకా 90 మందికి పైగా మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది. చాలామందికి తీవ్ర గాయాలు కావడంతో రక్తానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. మాండలేలో మసీదు కూలి 20 మంది మరణించారు. నగరానికి ఆగ్నేయాన సగాయింగ్‌ ప్రాంతంలో 90 ఏళ్ల నాటి బ్రిడ్జి కుప్పకూలింది. మా సో యానే బౌద్ధారామం కూడా నేలమట్టమైంది. మృతులు భారీగా పెరగవచ్చని సైనిక నియంత జనరల్‌ మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ చెప్పారు. 

థాయ్‌లాండ్‌లో... 
భూకంపం ధాటికి ఇళ్లు, కార్యాలయాల నుంచి జనం ఉన్నపళంగా పరిగెత్తుకొచ్చారు. భవనాలు కళ్లముందే కుప్పకూలుతుంటే నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. బ్యాంకాక్‌లోని 1.7 కోట్ల జనాభాలో అత్యధికులు భారీ అపార్ట్‌మెంట్లలోనే నివసిస్తారు. భూకంపం దెబ్బకు భయాందోళనలకు లోనై కార్లు, ఇతర వాహనాల్లో రోడ్లెక్కడంతో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ చోటుచేసుకుంది. ర్యాపిడ్‌ ట్రాన్సిల్, సబ్‌వే వ్యవస్థలను తాత్కాలికంగా మూసేయడంతో భారీ జననష్టం తప్పింది.

 నగరం మొత్తాన్నీ ప్రమాద ప్రాంతంగా పేర్కొన్నారు. కుప్పకూలిన నిర్మాణంలోని భవన శిథిలాలు ఏ క్షణమైనా పూర్తిగా పడిపోయేలా కన్పిస్తున్నాయి. దాంతో శిథిలాల కింద చిక్కిన వారికోసం పోలీసు శునకాలతో వెదుకుతున్నారు. ఆ ప్రాంతాన్ని ప్రధాని షినవత్రా సందర్శించారు. భద్రత దృష్ట్యా ప్రతి భవనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అత్యవసర కేబినెట్‌ సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. బ్యాంకాక్‌లో 10 మందికి పైగా మరణించినట్టు ధ్రువీకరించారు. చాలా భవనాలకు పగుళ్లు రావడంతో లోనికి వెళ్లేందుకు జనం జంకుతున్నారు.

హృదయ విదారకం 
మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో భూకంప దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద చిక్కినవారు హాహాకారాలు చేస్తున్నారు. శిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే జనం వెదుక్కుంటున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

అన్నివిధాలా సాయం: మోదీ న్యూఢిల్లీ: భూకంప విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జరిగిన ఘోరం చూసి చలించిపోయా. బాధితుల క్షేమం కోసం ప్రారి్థస్తున్నా. థాయ్‌లాండ్, మయన్మార్‌లకు అన్నివిధాలా సాయం అందించేందుకు భారత్‌ పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. రెండు దేశాలకూ భారత్‌ సహాయ తదితర సామగ్రి పంపుతోంది. థాయ్‌లాండ్‌లోని భారతీయుల కోసం బ్యాంకాక్‌లో భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ (+66 618819218) ఏర్పాటు చేసింది. భూకంప మృతుల్లో భారతీయులెవరూ లేరని పేర్కొంది. బ్యాంకాక్‌లో ఏప్రిల్‌ 4న బిమ్స్‌టెక్‌ ప్రాంతీయ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌ అధినేతలు భేటీలో పాల్గొంటారు.  

కోల్‌కతా నుంచి ఈశాన్యం దాకా...
భూకంపం తాలూకు ప్రకంపనలు భారత్‌లోనూ కన్పించాయి. కోల్‌కతాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో శుక్రవారం మధ్యాహ్నం భూమి 2.5 తీవ్రతతో స్వల్పంగా కంపించింది. ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. వాయవ్య చైనాలోని యునాన్, సీచుయాన్‌ ప్రావిన్సుల్లో కూడా భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. మాంగ్షీ తదితర నగరాల్లో భూకంప తీవ్రత హెచ్చుగా ఉంది. ఇల్లు, నిర్మాణాలు బాగా దెబ్బతిన్నాయి.

బతుకుతామనుకోలేదు
భూకంపం నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. మేమంతా ఆఫీసులో ఉండగా అలజడి రేగింది. భూకంపమంటూ అరుపులు విన్పించడంతో వెంటనే బయటికి పరుగెత్తుకెళ్లాం. నిర్మాణంలోని భారీ భవనాలు కూలిపోయాయి. ఇళ్లు పగుళ్లివ్వడంతో వాటిని ఖాళీ చేయించి జనాన్ని పార్కులు, ఖాళీ స్థలాల్లోకి పంపుతున్నారు. మేం యూనివర్సిటీ క్యాంపస్‌లో తలదాచుకున్నాం.
– ‘సాక్షి’తో ఫోన్‌లో బ్యాంకాక్‌ తెలుగు  అసోసియేషన్‌ ప్రతినిధి రమేశ్‌

చాలామంది చనిపోయారు 
బ్యాంకాక్‌లో ఇంతటి భూకంపం ఎన్నడూ చూడలేదు. 40, 50 అంతస్తులున్న నాలుగైదు భవనాలు కూలిపోయాయి. వాటిలోని చాలామంది చనిపోయే ఉంటారు. భారత పర్యాటకులు బస చేసే ప్రాంతాల్లో విధ్వంస తీవ్రత ఎక్కువగా ఉంది. తెలుగు వారందరినీ గ్రూపుల్లో అప్రమత్తం చేస్తున్నాం.
– వెంకటేశ్‌ యాదవ్,బ్యాంకాక్‌లోని ఆంధ్రా రెస్టారెంట్‌ ఎండీ

 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)