Breaking News

ట్రంప్‌ పుట్టిని ప్యూర్టోరీకో ముంచుతుందా?

Published on Wed, 10/30/2024 - 03:38

విశాలమైన రహదారిపై ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ జరిగే ఓ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ చిట్టచివరి భారీ బహిరంగ సభ అనూహ్యంగా పెద్ద వివాదానికి, జాత్యహంకార వ్యాఖ్యలు వేదికగా మారింది. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో జరిగిన ప్రచార కార్యక్రమం చివరకు లాటిన్‌ అమెరికన్లు, యూదులు, ఆఫ్రో అమెరికన్లపై జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదాస్పదంగా ముగిసింది.

దీంతో రిపబ్లికన్‌ పార్టీ పట్ల ఆయా వర్గాల ఓటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని కథనాలు వెలువడుతున్నాయి. వివాదం చిలికిచిలికి గాలివానగా వ్యతిరేక ఓట్ల దుమారంగా మారితే ట్రంప్‌ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదముంది. కరేబియన్‌ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరీకో అమెరికా అ«దీనంలో ఉంది. ఇక్కడి ద్వీపవాసులకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేయకపోయినా పెద్దసంఖ్యలో ప్యూర్టోరికో వారసులు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఓటర్లుగా నివసిస్తున్నారు. తమ ద్వీపాన్ని అవహేళన చేయడంతో వాళ్లంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది.

అసలేం జరిగింది?
ఆదివారం జరిగిన ఈ సభలో ట్రంప్, భార్య మెలానియా ప్రసంగించారు. వీరితోపాటు ప్రపంచకుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సైతం పాల్గొన్నారు. కార్యక్రమానికి ఊపు తెచ్చేందుకు ప్రచారానికి మరింత పాపులారిటీ వచ్చేందుకు స్టాండప్‌ కమేడియన్‌ టోనీ హించ్‌క్లిఫ్‌తో మాట్లాడించారు. నవ్వించాల్సిన ఆయన పలు వర్గాల ఓటర్లలో ఆగ్రహజ్వాలలు రగిల్చారు. ‘‘సముద్రం మధ్యలో కదిలే చెత్త కుప్ప ఒకటుంది. అదేంటో తెలుసా?. అదే ప్యూర్టోరీకో’’ అని హించ్‌క్లిఫ్‌ చేసిన వ్యాఖ్యలతో అమెరికాలోని ప్యూర్టోరికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

లక్షలాది మంది ప్యూర్టోరీకన్లకు అమెరికా పౌరసత్వం ఉంది. దశాబ్దాలుగా పోలింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం ప్యూర్టోరికో మూలాలున్న అమెరికా ఓటర్లు ఏకంగా 60 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. 1898లో స్పానిష్‌–అమెరికా యుద్ధం తర్వాత స్పెయిన్‌ వలసరాజ్యమైన ఫ్యూర్టోరీకోను అమెరికా తన వశం చేసుకుంది. 1917లో తొలిసారిగా అక్కడి వారికి అమెరికా పౌరసత్వం       ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్యూర్టోరికన్లు అమెరికాకు లక్షలాదిగా వలసవచ్చారు. అమెరికా ఓటర్లలో మెక్సికన్ల తర్వాత హిస్పానియన్‌ మూలాలున్న ఓటర్లలో రెండో అతిపెద్ద వర్గంగా ప్యూర్టోరికన్లు నిలిచారు. సొంత ద్వీపం కంటే అమెరికా గడ్డపై నివసించే వాళ్లే ఎక్కువ.  

కీలక రాష్ట్రాల్లో వీరి ప్రభావమెంత?
ఏ పార్టీ కీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్‌ స్టేట్స్‌ అంటారు. మద్దతు పలికే రాష్ట్రాలను ఆయా పార్టీ లు ఎలాగూ గెల్చుకుంటాయి. కానీ స్వింగ్‌ రాష్ట్రాల ఓటర్లు ఎవరికి ఓటేస్తారో తెలీదుకాబట్టి వీళ్లను ప్రసన్నం చేసుకోవడమే ట్రంప్, హారిస్‌కు ముఖ్యం. పెన్సిల్వేనియా స్వింగ్‌ రాష్ట్రంలో 3.7 శాతం రాష్ట్రజనాభాకు సమానమైన 4.86 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. 19 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రాన్ని గెల్చుకోవడం తప్పనిసరి. ఇక్కడ హారిస్‌పై ట్రంప్‌ కేవలం 0.2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. తాజా ఉదంతంలో ఈ ఆధిక్యత మటుమాయమై ట్రంప్‌ వెనుకంజ వేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. జార్జియాలోనూ 1.31 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. ఇక్కడ కూడా హారిస్‌పై ట్రంప్‌ ఆధిక్యత స్వల్పంగా ఉంది. వీళ్ల కోపంతో ఆ ఆధిక్యత పోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. నార్త్‌ కరోలినా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది.  

స్వింగ్‌యేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి ? 
ఏదో ఒక పార్టీ కే మద్దతు పలికే రాష్ట్రాల్లోనూ ప్యూర్టోరికన్ల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో వీళ్లు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. కనెక్టికల్‌ రాష్ట్ర జనాభాలో 8 శాతానికి సమానంగా 3 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. మసాచుసెట్స్‌లోనూ 3.26 లక్షల మంది వీళ్లే ఉన్నారు. న్యూయార్క్‌ రాష్ట్రంలో ఏకంగా పది లక్షల మంది వీళ్లే ఉన్నారు. ఇన్నేసి లక్షల మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే హారిస్‌ విజయం నల్లేరుపై నడకేనని కథనాలు వెలువడుతున్నాయి.  

గతంలో జాత్యహంకార వ్యాఖ్యలు
ట్రంప్‌ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2018లో ఎల్‌సాల్విడార్, హైతీ, ఆఫ్రికా ఖండ దేశాలను దారుణంగా కించపరుస్తూ ట్రంప్‌ మాట్లాడారు. గత వారం సైతం వలసలపై ప్రసంగంలో ‘‘అమెరికా చెత్తకుప్పనా ఏంటి?. వ్యర్థాలు(వలసలు) అన్నీ అమెరికాకే వస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించడం తెల్సిందే. తాను అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో అనధికార వలసదారుల బహిష్కరణ కార్యక్రమం చేపడతానని ట్రంప్‌ అన్నారు. దీనికితోడు ఆదివారం హించ్‌క్లిఫ్‌ చేసిన వ్యాఖ్యలు ప్యూర్టోరీకో మూలాలున్న ప్రముఖుల్లో ఆగ్రహజ్వాలలను ఎగసేలా చేసింది. జెన్నీఫర్‌ లోపేజ్, రికీ మార్టిన్, బ్యాడ్‌ బన్నీ ఇలా పలువురు ప్యూర్టోరికో సంగీత దిగ్గజాలూ తమ నిరసన వ్యక్తంచేశారు. ‘‘ ట్రంప్‌ సంగతి తెల్సిందే. గెలిస్తే తానెంత ప్రమాదకరమో, దేశ ప్రజల మధ్య ఎంతగా విభజన తీసుకురాగలరో మరో సారి నిరూపించుకున్నారు’’ అని కమలా హారిస్‌ విమర్శించారు.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)