Breaking News

కళింగాంధ్ర వలసలకు ఎక్స్‌పైరీ డేట్‌ లేదా?

Published on Mon, 06/02/2025 - 00:44

పదేళ్ల కిందటి గణాంకాల ప్రకారం కళింగాంధ్ర నుంచి పొట్ట చేత్తో పట్టుకొని, ఉపాధి వెదుక్కుంటూ... ఇరవై రెండు లక్షల మంది గుజరాత్, బొంబాయి, చెన్నై, బెంగళూర్, హైదరాబాద్‌ వంటి నగరాలకు వలస పోయినారు. అంటే కళింగాంధ్ర జనాభాలో అయిదో వంతు జనాభా వలస పోయినట్టు. ఇదెంతటి విషాదం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విడివడిన ఆంధ్ర లోనూ వలసలు పోయే జనాభాలో కళింగాంధ్ర మొదటి స్థానంలో ఉంది. 

విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు వంటి మిగిలిన అన్ని రంగాల్లోనూ కళింగాంధ్ర (ఉమ్మడి ఆంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు) అన్ని ప్రాంతాల కన్నా వెనకబడి ఆఖరి స్థానంలో ఉంది. ఈ దుఃస్థితి దేశ స్వాతంత్య్రం పూర్వం నుంచి నేటిదాకా కొనసాగుతూనే ఉంది.

‘రా పిలడో బిలాయి పోదాం – నీకు బీడీలు లేక పోతే బియ్యం అమ్ముతాను – రా పిలడో భిలాయి పోదా మ’ని గ్రామాల్లో అలనాడు పాట మార్మోగేది. అంటే అంతగా ఇక్కడి వాళ్ళు భిలాయి, అండమాన్‌ వంటి ప్రాంతాలకు వలస పోయే వారన్నమాట.

ఓ ఇంజనీర్‌ మిత్రుడు మాటల సందర్భంలో– ‘కళింగాంధ్ర పేదల వలస బాటకు ఎక్స్‌పైరీ డేట్‌ లేదా?’ అని తన కొడుకు ప్రశ్నించాడన్నాడు. చాలా వేదనతో కూడిన ప్రశ్న అది. బహుశా కళింగ ప్రజలు చాన్నాళ్లుగా వేస్తున్న ప్రశ్న కూడా! కాకపోతే పాలకులు వినడం లేదు.    

ఇటీవల కూటమి ముఖ్యమంత్రిగారు కళింగమ్‌ లోని మత్స్య తీర ప్రాంతానికి వచ్చి, ఆ ప్రాంతాన్నీ, ఆ ప్రజలనూ పరిశీలించి ఇంతగా పేదరికంలో, ఉపాధి లేమితో, అభివృద్ధికి నోచుకోకుండా వెనకబాటులో ఉంటే మీకు సిగ్గుగా (ఇదే అర్థంలో పదాలు) లేదా అని ఈ ప్రాంత తన పార్టీ నేతలను ప్రశ్నించారని పత్రికల వార్త.

ఎక్స్‌పైరీ డేట్‌ లేదా అని ప్రశ్నించిన వాడు పౌరుడు, సిగ్గు లేదా అని ప్రశ్నించిన వారు పాలకులు. సిగ్గు పడాల్సింది ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు మాత్రమేనా? సమస్యల్లా ప్రజలు కోరుకునే అభివృద్ధి మోడల్‌ వేరు, పాలకులు అమలు చేసే అభివృద్ధి మోడల్‌ వేరు కావడంలోనే ఉంది. 

దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల సముద్ర తీర ప్రజలు కోరుకునేది... ఫిషింగ్‌ హార్బర్లు, కోల్డ్‌ స్టోరేజీలు, సముద్రంతో సాము జేసే మత్స్య కారులు ఏ వేరావాలి(గుజరాత్‌)కో వలస పోయి, ప్రమాదాలకు గురి కాకుండా, విదేశీ జైళ్ళల్లో బందీలు కాకుండా ఆదుకునే ప్రణాళికలు, పథకాలును! కోట్ల రూపాయల మత్స్య సంపద, తీరంలోని విలువైన ఖనిజాలు కార్పొ రేట్లకు, ప్రైవేట్‌ శక్తులకు గాక, మత్స్యకారులకు, దేశానికీ చెందాలన్న మోడల్‌ అభివృద్ధిని ప్రజలు కోరుకుంటు న్నారు. కానీ పాలకులు ప్రైవేట్‌ శక్తుల, కార్పొరేట్‌ శక్తుల ద్వారా అభివృద్ధి జరుగుతుందని నమ్మబలుకుతూ ఆ నమూనాను అమలుచేస్తున్నారు.

పాతిక లక్షల ఎకరాల సాగుభూమి వుంది. నాగా వళి, వంశధార, జంఝావతి వంటి పద్దెనిమిది జీవ నదులున్నాయి. అధిక వర్షపాత ప్రాంతం. అయినా మూడో వంతు భూమికి మాత్రమే సాగునీరు అందుతోంది ప్రాజెక్టుల ద్వారా. మిగిలిన భూమి కోసం రైతులు ఆకాశాన్ని ఆశగా చూడాలి. వంశధార రెండో దశ పూర్తి కాదు, నదుల అనుసంధానం ఆగిపోయింది. ‘వెంగళ రాయ సాగరం’ వెక్కిరిస్తోంది.   
  
నదుల మీద ఆనకట్టలు, పంటలకు గిట్టుబాటు ధర, పంట మదుపులకు సబ్సిడీ రుణాలు, పంటల ఆధార పరిశ్రమలు ఈ ప్రాంత అభివృద్ధి మోడల్‌ అని ప్రజలు కోరుకుంటున్నారు. పాలకులేమో కాలుష్య కారక ఫార్మా కంపెనీలు, థర్మల్, అణువిద్యుత్‌ కర్మాగారాలతో డంపింగ్‌ యార్డ్‌ చేస్తున్నారు. 

ఏటా ఈ కర్మాగారాల్లో ప్రమాదాలతో ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. ఎర్ర బస్సులకే దిక్కులేని ప్రాంతానికి విమానాశ్రయాలను నిర్మించి అభివృద్ధి మోడల్‌ అంటున్నారు పాలకులు. అనేక చిన్న పరిశ్రమలు మూత పడినాయి. చేతివృత్తుల జీవుల బతుకులు పోయాయి. ఉక్కు కర్మాగారంతో పాటుగా మరిన్ని భారీ పరిశ్రమలు మూతకు, ప్రైవేట్‌ శక్తుల అధీనంలోకి పోతున్నాయి.      

విస్తారమైన అటవీప్రాంతం ఉంది. టేకు, మద్ది, ఎగిస వంటి వృక్ష సంపద, అయిదు వందల రకాల ఔషధ వృక్షాలు, కోట్ల రూపాయల విలువైన ఖనిజాలు... మామిడి, అరటి, పనస, కందులు, చింతపండు వంటి పంటలు... వీటికి ప్రాసెసింగ్‌ యూనిట్లను, మార్కెటింగ్‌ సౌకర్యాలను; ఖనిజాల వెలికితీతకు ఆదివాసీ సొసైటీలు, ఆర్థిక వనరులు సమకూర్చి చేసే అభివృద్ధి మోడల్‌ను ప్రజలు కోరుతున్నారు. అడవులను, కొండ లను తొలిచేసే, ఆదివాసీలను విస్తాపనకు గురి చేసే నమూనాను, కార్పొరేట్లకు లాభించే మోడల్‌ను పాల కులు చెప్తున్నారు. 

పాలకుల ఈ అభివృద్ధి మోడల్‌ వలన లక్షలాది మంది కళింగాంధ్రులు నిర్వాసితులై, ఉపాధి వెదుక్కుంటూ వలస పోయినా... రోడ్లు, భవనాలు, కార్పొరేట్‌ సెజ్‌లతో, ప్రైవేట్‌ విద్యా, వైద్యాలయాలతో గతంలో కంటే ఈ ప్రాంతం కాస్తయినా అభివృద్ధి చెందిన ప్రాంతంగా కనిపిస్తుంది. కానీ ఇవేవీ నేటివ్‌ కళింగాంధ్ర వారివి కావు. పెట్టుబడులతో, పాలకుల సహకారంతో పరాయి జిల్లాల, రాష్ట్రాల నుండి వచ్చిన బడా, బడా బాబులవి. కనిపించే అభివృద్ధి అందుకొని అనుభవిస్తున్నది వారు. 

కళింగాంధ్ర తీరం భిన్నమైన ప్రాకృతిక భూభాగం. సహజ సంపదల సీమ. దీన్ని అభివృద్ధి చేయాలంటే... ప్రజలు కోరుకునే అభివృద్ధి నమూనా అమలు కావాలి. లేనినాడు ఇక్కడి ప్రజలు సర్వమూ కోల్పోయి, రెక్కలు కట్టుకొని వలసలు పోవడం తప్పదు. ఈ వలసబాటకు ఎక్స్‌పైరీ డేట్‌ వుండదు..!

అట్టాడ అప్పల్నాయుడు 
వ్యాసకర్త ఉత్తరాంధ్ర రచయితల,కళాకారుల వేదిక (ఉరకవే) అధ్యక్షుడు 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)