Breaking News

దీర్ఘ కవితల నుండి దీర్ఘ కావ్యం దాకా...

Published on Sat, 10/21/2023 - 01:14

‘తెలంగాణ కవులు సోక్రటీస్‌ వారసులు.’
– (జూలూరు పథం: పుట 43)
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్‌ రాస్తే దీర్ఘకవితే రాస్తారు అని రూఢి అయ్యింది. ‘ఎలియాస్‌’, ‘పాదముద్ర’, ‘చెకిముకిరాయి’, ‘నాలుగో కన్ను’ నుండి దాదాపు  20 దీర్ఘ కవితలు రాసిన కవి గౌరీశంకర్‌. వాటి పరిణతి రూపంగా ఇప్పుడు ‘జూలూరు పథం’ వచన మహాకావ్యం రాశారు. ఇది 200 పుటల కావ్యం. ఇది ‘తెలంగాణ’ (కుందుర్తి),‘ నా దేశం నా ప్రజలు’ (శేషేంద్ర), ‘కొయ్యగుర్రం’ (నగ్నముని), ‘ఆసుపత్రి గీతం’ (కె. శివారెడ్డి),  ‘విశ్వంభర’ (సినారె), ‘జలగీతం’ (ఎన్‌. గోపి) వంటి వచన మహాకావ్యాల కోవకు చెందిన కావ్యం.

‘జూలూరు పథం’ కావ్య విశిష్టత కేవలం దీర్ఘ కావ్యం కావడమే కాదు, అది ఆయన స్వీయ చరిత్రాత్మక కావ్యం. గుర్రం జాషువ తన జీవితాన్ని ‘నా కథ’ అని పద్యకావ్యంగా రాశారు. శీలా వీర్రాజు తన జీవితాన్ని ‘పడుగు పేకల మధ్య జీవితం’ అన్న వచన కావ్యంగా రాశారు. ఆ తానులో గౌరీశంకర్‌ తన జీవితాన్ని వచన కావ్యంగా రాశారు. ఇది కేవలం గౌరీశంకర్‌ సొంతగోల వర్ణనకే పరిమితమైన కావ్యం కాదు. ఇందులో ఆయన జీవిత చిత్రణ కొంతభాగమే. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజాయుద్ధ వర్ణనే ‘జూలూరు పథం’గా రూపుదిద్దుకొంది.

తెలంగాణ తన నేలలో తాను పరాయీకరణకు గురై ఇతర ప్రాంతాల దోపిడీకి గురై తనను తాను విముక్తం చేసుకొని, తన రాష్ట్రం తాను ఏర్పాటు చేసుకున్న క్రమానికి ఈ కావ్యం విమర్శనాత్మక కళాత్మక ప్రతిబింబం. ‘తెలంగాణలో ఒక్కొక్కరు ఒక మహాకావ్యం’ అని తెలంగాణ ఔన్నత్యాన్ని నిర్వచించారు గౌరీశంకర్‌. కవి,  కవిత్వం అంటే ఏమిటో వర్ణించి, తెలంగాణ కవుల సౌందర్యాన్ని నోరారా వర్ణించి తన జీవితాన్ని క్లుప్తంగా పరిచయం చేశారు మొదట.

‘జై తెలంగాణ అంటే నా జన్మ ధన్యమైంది’ అని పులకరించి పోతారు కవి. జై తెలంగాణ అంటేనే భార్య మెడలో తాళి కడతానన్న వరుని సంఘటనను పరిచయం చేశారు. 1956 అక్టోబర్‌  31న అర్ధరాత్రి జరిగింది కొత్త ఆధిపత్యమని, కొత్త  ఆక్రమణ అని నిర్వచించి దాని ముద్దుపేరు ‘సమైక్యత’ అని తన కంఠాన్ని స్పష్టంగా వినిపించారు. తెలంగాణ ఆహారం, తెలంగాణ సంస్కృతి ఈ కావ్యంలో కావ్య గౌరవం పొందాయి. తనను కవిగా, ఉద్యమకారునిగా నిలబెట్టిన తెలంగాణ గడ్డను గౌరీశంకర్‌ కృతజ్ఞతతో కీర్తించారు. కవిగా కవిత్వ శక్తి తెలిసిన గౌరీశంకర్,  కవిత్వం ఏమి సాధిస్తుందంటే ‘ఒక రాష్ట్రాన్ని సాధించి పెడ్తది’ అన్నారు.

తెలంగాణ రాష్ట్రోద్యమంలో కళారంగం నిర్దేశించిన చారిత్రక పాత్రను కవి గర్వంగా వర్ణించారు. ‘తెలంగాణ కవులు విముక్తి పోరు వారసులు’ అని నిర్వచించారు. తెలంగాణ రాష్ట్రోద్యమం విజయం సాధించడాన్ని ‘యుద్ధమిప్పుడు గెలిచిన కల’ అని పరవశించి చెప్పారు. గౌరీశంకర్‌ కవిత్వం ఒక ఉప్పెనలాగా ఉంటుంది. ఆవేశం,  ఆవేదన, ఆగ్రహం ముప్పేట దాడితో ఆయన కవిత్వం నడుస్తుంది. మార్క్సిజం, అంబేడ్కరిజం సమన్వయ సిద్ధాంతంగా సాగుతున్న తీరును కవిత్వీకరించారు. ఆయన నడి గూడెం వడ్లబజారు నుంచి ప్రారంభించి అస్తిత్వ సాహిత్య ఉద్యమ జెండాలను పట్టుకుని తెలంగాణ నడిబొడ్డు నడిగడ్డ దాకా దీర్ఘకవితల్ని నడిపించాడు. తెలుగు సాహిత్యంలో దీర్ఘకవితల పథం ‘జూలూరు పథం.’
వ్యాసకర్త సాహితీ విమర్శకులు
(రేపు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ‘జూలూరు పథం’ ఆవిష్కరణ) 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)