అనంతపురం జిల్లాలో భారీ వర్షం
Breaking News
Kothapalli Jayashankar: తెలంగాణ ఆచార్య!
Published on Sat, 08/06/2022 - 10:46
తెలంగాణ జాతిపిత, సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1934 ఆగస్టు 6న వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో జన్మించారు. 1952లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం నుంచి ఆయన కన్నుమూసే వరకూ సాగిన తెలంగాణ అస్తిత్వ పోరాటాలన్నిం టికీ ఆయన ప్రత్యక్ష సాక్షి. జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో తెలం గాణ వాదాన్ని బలంగా వినిపించారు. విద్యావేత్తగా, మేధావిగా, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఆయన ఎన్నో పదవులను అలంకరించారు.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పాటైన ఫజల్ అలీ కమిషన్ ముందు తెలంగాణ ప్రజల మనసులోని సందేహాలను, అనుమానాలను ధైర్యంగా తెలియజేశారు. తెలంగాణ ప్రాంత భవిష్యత్ సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని ఆయన గట్టిగా వాదించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపితే నీళ్ళు, నిధులు, సమస్యలు తలెత్తుతాయని ఆ కమిషన్ ముందు వాదించారు. ఆయన వెలిబుచ్చిన భయ సందేహాలు తర్వాత కాలంలో నిజమయ్యాయి. నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భవానికీ తెలం గాణ ఉద్యమం ఊపందుకోవడానికీ ఇవే కారణాలయ్యాయి.
ఉమ్మడి రాష్టంలో తెలంగాణ దోపిడీకి గురవ్వడంతో అన్ని రాజకీయ పార్టీలు చివరికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించే పరిస్థితి వచ్చింది. ఈ ఉద్యమానికి అగ్రభాగాన నిలిచారు జయశంకర్. తాను కన్న కల నెరవేరకుండానే 2011 జూన్ 21న గొంతు కేన్సర్‌తో తుది శ్వాస విడిచారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను యాభై ఏళ్ళుగా బతికించి విజయ తీరాలకు తీసుకుపోయిన తెలంగాణ సేనాని ఆయన.
– కొలనుపాక కుమారస్వామి, వరంగల్
(ఆగస్టు 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి)
Tags : 1