Breaking News

జగమంత సంక్రాంతి

Published on Sun, 01/11/2026 - 05:52

సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సందర్భంగా మకర సంక్రాంతి వేడుకను మన భారతీయులు రకరకాల పద్ధతుల్లో జరుపుకొంటారు. మకర సంక్రాంతికి ముందురోజున భోగి పండుగనాడు వీథుల్లో పెద్దపెద్ద చలిమంటలు వేస్తారు. మకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగనాడు వ్యవసాయ పనుల్లో సాయంగా ఉండే పశువులను పూజిస్తారు. పంటలు చేతికి వచ్చిన తర్వాత రైతాంగానికి కాస్త తీరిక చిక్కి ఆటవిడుపుగా జరుపుకొనే పండుగ ఇది. సంక్రాంతి వేడుకల్లో సంప్రదాయబద్ధంగా జరుపుకొనే పూజ పురస్కారాలు ఎలా ఉన్నా; విందు వినోదాలు, కోడి పందేల వంటి కాలక్షేపాలు విశేషంగా జరుగుతాయి. మన దేశంలో మకర సంక్రాంతి వేడుకలు జరుపుకొనే మాదిరిగానే వివిధ దేశాలలో శీతకాల ఆయనాంత దినాలలో ఇదే తరహా వేడుకలు జరుపుకొంటారు. మన దేశంలో జరుపుకొనే మకర సంక్రాంతి వేడుకలతో పాటు ఇతర దేశాల్లో జరిగే సంక్రాంతి తరహా వేడుకల గురించి తెలుసుకుందాం.

మకర సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. మిగిలిన పండుగలను మన దేశంలో చాంద్రమానం ప్రకారం జరుపుకొంటే, మకర సంక్రాంతిని సౌరమానం ప్రకారం జరుపుకొంటారు. మకర సంక్రాంతి రోజున అభ్యంగన స్నానాలు చేసి, పితృ తర్పణలు విడిచిపెడతారు. ఈ ఆచారాన్ని పాటించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లకు వచ్చే హరిదాసులు, గంగిరెద్దులవారు తదితరులకు దానాలు చేస్తారు. మకర సంక్రాంతికి ముందు వచ్చే ధనుస్సంక్రాంతి రోజు నుంచి వైష్ణవాలయాల్లో ధనుర్మాసం సందడి మొదలవుతుంది. ఈ నెల పొడవునా ఇళ్ల ముంగిళ్లలో రకరకాల రంగవల్లులను తీర్చిదిద్ది, వాటిలో గొబ్బెమ్మలను కొలువుదీరుస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్భంగా నువ్వులతో తయారు చేసిన పిండివంటలను, కొత్తబియ్యంతో వండిన పరవాన్నం వంటి తీపి పదార్థాలను ఆరగిస్తారు.

మకర సంక్రాంతి రోజున నువ్వులు, నెయ్యి, బెల్లం, బూడిద గుమ్మడి, గొంగళి పేదలకు దానం చేయడం మంచిదని కొన్ని వ్రతకథనాలు చెబుతున్నాయి. 
మకర సంక్రాంతి నాటితో మొదలయ్యే ఆరునెలల ఉత్తరాయణ కాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళతారని పురాణాలు చెబుతున్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపైకి ఒరిగిన భీష్ముడు మకరసంక్రాంతి తర్వాత మాఘమాసంలోని శుక్ల అష్టమి రోజున స్వచ్ఛంద మరణం పొందాడని మహాభారత కథనం. మకర సంక్రాంతి రోజునే ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించారు. ధనుర్మాసం పొడవునా తిరుప్పావై పాశురాలు పఠిస్తూ పూజలు జరిపే వైష్ణవాలయాల్లో మకర సంక్రాంతి రోజున గోదా కల్యాణం జరిపి, ధనుర్మాస వ్రతాన్ని పరిసమాప్తి చేస్తారు.

మకర సంక్రాంతికి ముందురోజైన భోగి పండుగ నాడు వీథులలో భోగిమంటలు వేయడంతో పాటు ఇళ్లల్లోని చిన్నపిల్లల తలపై రేగుపళ్లను భోగిపళ్లుగా పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు పంచదార చిలకలను ఇచ్చిపుచ్చుకుంటారు. చాలా ప్రాంతాల్లో దసరాకు బొమ్మల కొలువులు పెడితే, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టే ఆచారం ఉంది. మకర సంక్రాంతి మర్నాడు కనుమ పండుగ నాడు పశువులను పూజించి, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఆ మర్నాడు ముక్కనుమ పండుగ రోజున గ్రామదేవతలకు పూజలు జరిపి, మాంసాహార విందులు చేసుకుంటారు. 

వివిధ రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకలు 
దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకొనే మకర సంక్రాంతి వేడుకల్లో అనేక ఆచార, ఆహార వైవిధ్యాలు కనిపిస్తాయి. 
అసోంలో మకర సంక్రాంతిని ‘మాఘ బిహు’ అని, ‘భోగాలి బిహు’ అని పిలుస్తారు. సంక్రాంతికి ముందురోజున ‘మేజి’ పండుగను మన భోగి పండుగ మాదిరిగానే జరుపుకొంటారు. ఊరూరా వీథుల్లో చలిమంటలు వేసుకుని, అగ్నిదేవుడిని పూజిస్తారు. ఊళ్లల్లోని యువకులు ‘మేజి’ పండుగ ముందు రోజున ‘బేళాఘర్‌’ అనే తాత్కాలిక గుడిసెలను వెదురుబొంగులతో నిర్మించి, వాటిలో విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ‘మేజి’ రోజున వేకువ జామునే వాటిని భోగిమంటల్లా తగలబెడతారు. ‘మాఘ బిహు’ రోజున కొత్త బియ్యం, నువ్వులు, కొబ్బరితో తయారు చేసిన పిండివంటలను ఆరగిస్తారు.

బిహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో మకర సంక్రాంతిని ‘సక్రాత్‌’ అని, ‘ఖిచిడీ పర్వ్‌’ అని అంటారు. సంక్రాంతి రోజున ఖిచిడీని తప్పనిసరిగా ఆరగిస్తారు. అలాగే, పెరుగు అటుకులు, నువ్వుల లడ్డూలు ఆరగిస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా నదీస్నానాలు ఆచరించి, సూర్యారాధన చేస్తారు. సంక్రాంతికి ముందు రోజున చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో సంబరాలు జరుపుకొంటారు. 

గుజరాత్‌లో మకర సంక్రాంతిని ‘ఉత్తరాయన్‌’గా, ఆ మర్నాడు ‘వాసి ఉత్తరాయన్‌’గా జరుపుకొంటారు. ఈ సందర్భంగా విందు వినోదాలతో పాటు ఆరుబయట పిల్లా పెద్దా చేరి గాలిపటాలను ఎగురవేస్తారు. 
హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతాలలో మకర సంక్రాంతిని ‘సంక్రాంత్‌’ పేరుతో జరుపుకొంటారు. కురుక్షేత్ర సహా ప్రాచీన తీర్థాలు, సరోవరాలు, నదులలో పవిత్ర స్నానాలను ఆచరించి, పితృతర్పణాలను విడిచిపెడతారు. ఖీర్, చుర్మా, హల్వా వంటి స్థానిక తీపి వంటకాలతో పాటు వేరుశనగ, నువ్వుల లడ్డూలను ఆరగిస్తారు. 

జమ్ములో మకర సంక్రాంతిని ‘ఉత్రాయిన్‌’ లేదా ‘అత్రాయిన్‌’ అని పిలుచుకుంటారు. ఈ పండుగను ‘ఖిచిడీవాలా పర్వ్‌’ అని కూడా అంటారు. సంక్రాంతి రోజున మినప్పప్పుతో తయారు చేసిన ఖిచిడీతో సంతర్పణలు చేస్తారు. అత్తవారిళ్లకు వెళ్లిన ఆడపడుచులకు సారె పంపుతారు. సంక్రాంతి సందర్భంగా జమ్ము ప్రాంతంలో ఊరూరా భారీగా సంతలు జరుగుతాయి. 
కర్ణాటకలో మకర సంక్రాంతి వేడుకలు దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే జరుగుతాయి. కన్నడిగులు సంక్రాంతి రోజుల్లో ముంగిళ్లలో ముగ్గులు తీర్చిదిద్దుతారు. నువ్వులు, వేరుశనగలు, కొబ్బరి, బెల్లం కలిపి తయారు చేసే ‘ఎళ్లు బెల్ల’, పంచదారతో తయారు చేసే ‘సక్కరె అచ్చు’ ప్రత్యేకంగా ఆరగిస్తారు. ఈ సందర్భంగా ఆరుబయట గాలిపటాలను ఎగురవేస్తారు. 

మహారాష్ట్రలో భోగి, సంక్రాంతి రెండు రోజులు వేడుకలు జరుపుకొంటారు. ఈ పండుగ రోజుల్లో నువ్వులు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను ఇచ్చిపుచ్చుకుంటారు. భోగి రోజున ఊరూరా భోగిమంటలు వేస్తారు. సంక్రాంతి రోజున సూర్యుడిని పూజిస్తారు. అలాగే, చిన్న చిన్న మట్టికుండలను శక్తి కలశాలుగా పూజగదుల్లో పెట్టి, వాటికి నల్లపూసల దండలను అలంకరించి, అమ్మవారిని పూజిస్తారు. 
ఒడిశాలో భోగి రోజున ఊరూరా వీథుల్లో  భోగిమంటలు వెలిగిస్తారు. మకర సంక్రాంతి రోజున ఆలయాల్లో పూజలు జరిపి, కొత్తబియ్యం, బెల్లం, నువ్వులు, కొబ్బరితో తయారు చేసే వంటకాలను, రసగుల్లా, ఛెన్నాపొడా వంటి మిఠాయిలను ఆరగిస్తారు. పూరీ జగన్నాథ ఆలయంలో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. 

పశ్చిమ బెంగాల్‌లో ‘పౌష సంక్రాంతి’గా జరుపుకొంటారు. హిమాలయాలకు దగ్గరగా ఉన్న డార్జిలింగ్‌ ప్రాంతంలో ‘మాగే సక్రాతి’ పేరుతో జరుపుకొంటారు. ఈ వేడుకల్లో ఖర్జూరాల పాకం, కొత్తబియ్యంతో పాయసం వండుకుంటారు. అరిసెల్లాంటి ‘పిఠా’ అనే పిండి వంటలను ఆరగిస్తారు. 
పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీలోని పలు ప్రాంతాలలో సంక్రాంతి వేడుకలను ‘మాఘి’ అని, ‘లోహ్రీ’ అని జరుపుకొంటారు. వీథుల్లో చలిమంటలు వేసుకుని, వాటి చుట్టూ ఆడుతూ పాడుతూ గడుపుతారు. ప్రార్థన మందిరాలు, ఆలయాలలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. ఇలా దీపాలను వెలిగించడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. 

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో ‘సక్రాత్‌’ పేరుతో ఈ వేడుకలను జరుపుకొంటారు. సంక్రాంతి సందర్భంగా గృహిణులు పదమూడుమంది గృహిణులకు గృహోపకరణాలను ఇస్తారు. గృహోపకరణాలను ఇవ్వడం వల్ల ఐశ్వర్యవృద్ధి జరుగుతుందని వారి నమ్మకం. బంధు మిత్రులతో కలసి విందుభోజనాలు చేస్తారు. పురోహితులకు, పేదలకు దానాలు చేస్తారు. ఆరుబయట చేరి గాలిపటాలను ఎగురవేస్తారు.

ఇక తమిళనాడులో కూడా సంక్రాంతి వేడుకలను నాలుగు రోజుల పాటు జరుపుకొంటారు. ‘పొంగల్‌’గా జరుపుకొనే ఈ వేడుకల్లో మొదటి రోజైన భోగి పండుగను ‘భోగి పండగై’, రెండో రోజున ‘తాయ్‌ పొంగల్‌’, మూడో రోజున ‘మాట్టు పొంగల్‌’, నాలుగో రోజున ‘కానుమ్‌ పొంగల్‌’ పేరుతో వేడుకలు జరుపుకొంటారు. భోగి మంటల్లో పాత వస్తువులను తగులబెడతారు. సంక్రాంతి రోజున చక్కెర పొంగలి దేవతలకు నైవేద్యంగా పెట్టి, శంఖాలు మోగిస్తారు. ‘మాట్టు పొంగల్‌’ రోజున కొన్ని ప్రాంతాల్లో ‘జల్లికట్టు’ పోటీలు నిర్వహిస్తారు. చివరి రోజైన ‘కానుమ్‌ పొంగల్‌’నాడు బంధు మిత్రులతో కలసి విందు వినోదాలు జరుపుకొంటారు. 
కేరళలోని శబరిమలైలో ‘మకరవిళక్కు’ దర్శనానికి అయ్యప్పస్వామి భక్తులు తండోపతండాలుగా చేరుకుంటారు. 

ఇరుగు పొరుగు దేశాల్లో... 
మకర సంక్రాంతి పండుగను మన ఇరుగు పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లోను; భారతీయ సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే దేశాల్లోను కూడా జరుపుకొంటారు. 
నేపాల్‌లో ఈ పండుగను ‘మాఘే సంక్రాంతి’గా జరుపుకొంటారు. ఈ సంక్రాంతిని నేపాలీలు విశేష పర్వదినంగా భావిస్తారు. మకర సంక్రాంతికి సంబంధించి నేపాల్‌లో ఒక పురాణగాథ ప్రచారంలో ఉంది. అప్పట్లో ఒక వర్తకుడు నువ్వుల వ్యాపారం చేసేవాడట! అతడి దుకాణంలోని నువ్వుల బస్తా అక్షయంగా ఉండేదట! అందులోంచి ఎన్ని నువ్వులు అమ్మినా బస్తా తరిగిపోకుండా ఉండేది. ఒకనాడు తన వద్దనున్న బస్తాలో ఉన్న మహిమకు కారణమేమిటో తెలుసుకోవాలని ఆ వర్తకుడికి కుతూహలం కలిగింది. బస్తాకు రంధ్రం పెట్టి, తవ్వి చూడగా, అందులో బంగారు విష్ణువిగ్రహం బయటపడిందట! అందువల్ల సంక్రాంతి రోజున నువ్వులతో తయారు చేసిన పిండివంటలను తప్పనిసరిగా ఆరగించడం ఆచారంగా మారిందని చెబుతారు. 

ఇక శ్రీలంకలోని తమిళులు తమిళనాడులో మాదిరిగానే నాలుగు రోజులు పొంగల్‌ వేడుకలను సంబరంగా జరుపుకొంటారు. 
బంగ్లాదేశ్‌లో ఈ పండుగను ‘పౌష సంక్రాంతి’గా, ‘ఘురి ఉత్సబ్‌’గా జరుపుకొంటారు. భోగి రోజున వీథుల్లో చలిమంటలు వేస్తారు. సంక్రాంతినాడు కొత్తబియ్యం, నువ్వులు, కొబ్బరి, బెల్లంతో తయారు చేసిన పిండివంటలతో విందులు చేసుకుంటారు. పండుగ రోజుల్లో సాయంత్రం ఆరుబయటకు చేరి గాలిపటాలను ఎగురవేస్తారు. రాత్రి చీకటి పడిన తర్వాత అట్టహాసంగా బాణసంచా కాలుస్తారు.

విదేశాల్లో శీతకాల ఆయనాంత వేడుకలు 
మన దేశంలో శీతకాల ఆయనాంతం మరునాడు వచ్చేరోజును మకర సంక్రాంతిగా జరుపుకోవడం చిరకాల ఆనవాయితీ. సౌరమానం ప్రకారం జరుపుకొనే ఈ పండుగ సాధారణంగా జనవరి 14వ తేదీన వస్తుంది. లీపు సంవత్సరాల్లోనైతే జనవరి 15న వస్తుంది. పలు పాశ్చాత్య దేశాల్లో ఏటా డిసెంబర్‌ 22న శీతకాల ఆయనాంత దినంగా పరిగణిస్తారు. కొన్ని దేశాల్లో శీతకాల ఆయనాంతం సందర్భంగా పురాతన ఆచారాల ప్రకారం విలక్షణమైన పండుగలను జరుపుకొంటారు. దాదాపుగా మన మకర సంక్రాంతి వేడుకలను పోలిన అలాంటి కొన్ని పండుగల గురించి తెలుసుకుందాం....

డోంగ్‌ఝీ: శీతకాల ఆయనాంతాన్ని చైనాలో ‘డోంగ్‌ఝీ’ పేరుతో జరుపుకొంటారు. ఈ పండుగను ఏటా డిసెంబర్‌ 21–23 తేదీల్లో జరుపుకొంటారు. శీతకాల దీర్ఘరాత్రులు (యిన్‌) ఈ పండుగతో ముగిసి, పగటి వేళలు క్రమంగా పెరిగే రోజులు (యాంగ్‌) ప్రారంభం కావడానికి సంకేతంగా ‘డోంగ్‌ఝీ’ని జరుపుకోవడం చైనా ప్రజల సంప్రదాయం. ఈ పండుగ రోజుల్లో ఎక్కడెక్కడో ఉండే కుటుంబ సభ్యులందరూ ఒకేచోట కలుసుకుని, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఈ సందర్భంగా కుడుముల్లాంటి ‘జియావోజి’, వరిపిండితో తయారు చేసే ‘టాంగ్యువాన్‌’ అనే మిఠాయిలను ప్రత్యేకంగా ఆరగిస్తారు.

షాబ్‌ ఏ యాల్దా: శీతకాల ఆయనాంతం సందర్భంగా ఏటా డిసెంబర్‌ 21న జరుపుకొనే పురాతన పర్షియన్‌ పండుగ ఇది. ఇరాన్, ఇరాక్‌ సహా పలుచోట్ల ఉండే జొరాస్ట్రియన్లు ఇప్పటికీ ఈ పండుగను జరుపుకొంటారు. సుదీర్ఘ రాత్రి కలిగిన డిసెంబర్‌ 21న రాత్రివేళ ప్రత్యేకంగా విందు వినోదాలు, వేడుకలు జరుపుకోవడం జొరాస్ట్రియన్ల ఆనవాయితీ. ‘యాల్దా నైట్‌’ పేరుతో జరుపుకొనే ఈ రాత్రివేళ విందుల్లో ప్రత్యేకంగా ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలు, దానిమ్మ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను తప్పనిసరిగా ఆరగిస్తారు. కవితా పఠనం, సంప్రదాయ గీతాలాపన వంటి కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు.

సోయల్‌: అమెరికాలోని అరిజోనా, న్యూమెక్సికో రాష్ట్రాల్లో ఉండే మూలవాసులైన జునీ, హోపీ తెగల వారు శీతకాల ఆయనాంత సందర్భంగా ఏటా డిసెంబర్‌ 21న ‘సోయల్‌’ పేరుతో పండుగ జరుపుకొంటారు. ఈనాటితో దీర్ఘరాత్రులు ముగిసి, ప్రకృతిలో వెలుతురు పెరిగే రోజుల రాకతో కొత్త ఆశలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగ సందర్భంగా ఇళ్లను, ఇళ్లలో పెంచుకొనే పెంపుడు జంతువులను, పాడి పశువులను అలంకరిస్తారు. సంప్రదాయ వంటకాలతో విందు వినోదాలు జరుపుకొంటారు.

టోజి: జపాన్‌ ప్రజలు శీతకాల ఆయనాంతం సందర్భంగా ఏటా డిసెంబర్‌ 21న ‘టోజి’ పేరుతో పండుగ జరుపుకొంటారు. చీకటికి సంకేతమైన ‘యిన్‌’ రోజులు ఈనాటితో ముగిసి, వెలుతురుకు సంకేతమైన ‘యాంగ్‌’ రోజులు ప్రారంభమవుతాయని వారు భావిస్తారు. ఈ సందర్భంగా నిమ్మజాతికి చెందిన ‘యుజు’ పండ్ల రసాన్ని నీటిలో కలుపుకొని, ఆ నీటితో స్నానాలు చేస్తారు. ఇలా స్నానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. ఈ పండుగ సందర్భంగా గుమ్మడి పండ్లతో తయారు చేసే ‘కబోచా’ అనే రసాన్ని ప్రత్యేకంగా సేవిస్తారు. దీని వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ప్రార్థన మందిరాల వద్ద ప్రత్యేకంగా విక్రయించే ‘ఇచియు రైఫుకు’ అనే తాయెత్తులను కొనుక్కుని ధరిస్తారు. ఈ తాయెత్తులను ధరిస్తే, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ ఏర్పడుతుందని నమ్ముతారు.

 యూల్‌: ఉత్తర యూరప్, స్కాండినేవియన్, జర్మానిక్‌ ప్రాంతాల్లో శీతకాల ఆయనాంతం సందర్భంగా ఏటా డిసెంబర్‌ 21, 22 తేదీల్లో ‘యూల్‌’ పేరుతో పండుగ జరుపుకొంటారు. జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్వీడన్, నెదర్లండ్స్‌ తదితర దేశాల్లో ఉండే ‘నార్స్‌’ ప్రజలు ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ‘యూల్‌’ పండుగను వారు సూర్యుడి పునరుత్థానంగా భావిస్తారు. పలుచోట్ల ‘యూల్‌’ వేడుకల్లో క్రిస్మస్‌ ఆచారాల ప్రభావం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. అయినా, స్వీడన్‌ వంటి కొద్దిచోట్ల మాత్రం ‘నార్స్‌’ ప్రజలు ఇంకా తమ పురాతన సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ‘యూల్‌’ పండుగ రోజుల్లో బంధు మిత్రులంతా కలుసుకొని విందు వినోదాలు జరుపుకొంటారు. ఒకరికొకరు కానుకలను ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ విందుల్లో ప్రత్యేకంగా మేక, పంది, గుర్రం మాంసాలతో చేసిన వంటకాలను ఆరగిస్తారు. రాత్రివేళల్లో ఆరుబయట ‘యూల్‌ లాగ్‌’ పేరుతో భారీ కలపదుంగలను పేర్చి చలిమంటలు వేసుకుంటారు. చలిమంటల చుట్టూ చేరి ఆటపాటలతో ఆనందిస్తారు. 
 

Videos

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

కాకాణి పై పోలీసుల అత్యుత్సాహం

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)