AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!
Breaking News
ఆ‘ పాత’ మెరుపు
Published on Wed, 07/22/2026 - 03:33
బంగారు ఆభరణం ఎంత పాతదైతే దాని విలువ అంత పెరుగుతుంది అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. 16వ శతాబ్దం నాటి రాజరిక మొఘల్, పోల్కీడిజైన్ల నుండి 1970ల నాటి ముత్యాల గొలుసుల వరకు సినీ తారలు పెద్ద పెద్ద ఈవెంట్లలో వారసత్వ ఆభరణాలను ధరించి, మెరిశారు. ఇటీవల హాలీవుడ్ నటి జెండయా 3000 ఏళ్ల క్రితం నాటి ఇయర్స్ రింగ్స్ ధరించి విస్తృత చర్చకు దారితీశారు.ఈ క్రమంలో ప్రాచీన నగల వెలుగు మరింతగా మెరవనుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
హాలీవుడ్ సినిమా ‘ది ఒడిస్సీ’ సినిమా ప్రచార కార్యక్రమం ఇటీవల లండన్‌లో జరిగింది. ఈ ప్రీమియర్‌లో ఆ సినిమా నటి జెండయా ధరించిన 3,000 ఏళ్ల నాటి ఇరాన్ బంగారు ఇయర్ రింగ్స్ అంతటా చరిత్రపై ఆసక్తికి, చర్చకు దారితీశాయి. ఈ అసాధారణమైన ఇయర్రింగ్స్ అచ్చమైన బంగారు పలకలతో తయారుచేశారు.
డ్రెస్‌ను డామినేట్ చేస్తూ...
నటి జెండాయా తెల్లటి జాక్వెమస్ హాల్టర్ గౌనును ధరించింది. లండన్‌కు చెందిన ప్రాచీన ఆభరణాల వ్యా పారి బారన్ సేకరించిన ప్రాచీన కళాఖండాల బంగారు ఇయర్ రింగ్స్‌ను ఆ గౌన్‌కు జతగా ఎంపిక చేసుకుంది. రెడ్‌కార్పెట్‌పై ఆమె చూపిన ఈ ఇయర్ రింగ్స్ అత్యంత ఫ్యాషనబుల్‌గా ఉన్న డ్రెస్సును కూడా డామినేట్ చేశాయి. జ్యువెలరీ నిపుణులు పంచుకున్న వివరాల ప్రకారం ఈ ప్రాచీన బంగారు కళాఖండాలను 18 క్యారెట్ల బంగారంలో వజ్రాలను పొదిగి, సూర్యుని చిహ్నం వచ్చేలా రూ పొందించారు.
కంచు శవపేటిక నుంచి...
ఈ ఇయర్ రింగ్స్ 1947లో ఇరాన్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో జివియా దగ్గర కనుక్కొన్నారు. అక్కడి గ్రామస్థులు బంగారు కళాఖండాలతో నిండిన ఒక కంచు శవపేటికను వెలికితీసినట్టు తెలిసింది. ఆ సమయంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరూ లేకపోవడం, సరైన డాక్యుమెంటేషన్ జరగకముందే ఆ శవపేటిక నుంచి వివిధ వస్తువులను తీసి, అమ్మినట్టు తెలుస్తోంది. 1948లో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త ఆండ్రే గొడార్డ్ పారిస్‌లో అనేక పురాతన వస్తువులను ప్రదర్శించినప్పుడు ఇవి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత జివియా నిధితో సంబంధం గల 600 వస్తువులను నమోదు చేశారు. ఈ వస్తువులన్నీ నేడు బ్రిటిష్ మ్యూజియం, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇరాన్ వంటి సంస్థలలో భధ్రపరిచారు.
అనేక వస్తువులు ఇప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల చేతులలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా నటి జెండయా ఈ పురాతన ఇయర్ రింగ్స్ ధరించడంతో విమర్శలూ వచ్చాయి. పురాతన సాంస్కృతిక కళాఖండాలు విలాసంతమైన ఫ్యాషన్ ఉపకరణాలుగా ధరించవచ్చా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సాంస్కృతిక వారసత్వంపై ఆన్లైన్లో చర్చలు కొనసాగుతున్న తరుణంలో జెండాయా ధరించిన ఇయర్ రింగ్స్ ఒక ఫ్యాషన్ ప్రకటనకు మించి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ మోడల్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో మరింతగా మెరవనున్నాయని తెలుస్తోంది.
ఆదిమ మానవులు తమ అలంకరణ వస్తువుల తయారీకి ఎముకలు, రాళ్లు, దంతాలను ఉపయోగించేవారు. లక్షన్నర సంవత్సరాల క్రితం నాటి 33 గవ్వల పూసలు మొరాకోలోని ఎస్సౌయిరా సమీపంలో గల బిజ్మౌన్ గుహలో దాదాపు పదేళ్ల క్రితం జరిపిన తవ్వకాలలో బయటపడ్డాయి. అటు తర్వాత దాదాపు 70 వేల ఏళ్ల క్రితం నాటి పూసలు దక్షిణ ఆఫ్రికాలోని బ్లోంబోస్ గుహలో బయటపడ్డాయి. క్రీ.పూ వెయ్యేళ్ల క్రితం ఆభరణాలలో నక్షత్రం, సూర్యుని చిహ్నాలను ఉపయోగించినట్టు నాటి ఆభరణాలు వెలుగు చూసినప్పుడు తెలిశాయి.
19వ శతాబ్దంలో ఖగోల ఆభరణాలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. ఆభరణాలలో నక్షత్రాలు, నెలవంక ఆకారంలో బ్రోచ్లు, లాకెట్లు రూ పొందించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన బంగారు ఆభరణాలు క్రీ.పూ 4,500 ఏళ్ల కాలం నాటివి వార్నా పురావస్తు మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్నాయి. ప్రాచీన మెసొపొటేమియాకు చెందినవారు బంగారం, వెండి లోహాలతో నగలు చేసేవారని చరిత్ర చెబుతోంది.
అలనాటి నగలు... ∙నీతాఅంబానీ అన్‌కట్ డైమంట్స్, కుందన్, పోల్కీ సంప్రదాయ మొఘల్ డిజైన్‌తో రూ పొందించిన 100 ఏళ్ల క్రితం నాటి ఇయర్ రింగ్స్ ధరించి వార్తల్లో నిలిచారు. భారతీయ రాజరిక హస్తకళకు ఈ ఆభరణం అసలైన ఉదాహరణగా చెప్పచ్చు ∙కంగనా రనౌత్, మౌనిరాయ్ తారలు ఆక్సిడైజ్డ్ రాజస్థాన్, గుజరాతీ స్టైల్ ఆభరణాలను ధరించడం మనం చూస్తుంటాం. ఏళ్ల నాటి ఆ సిల్వర్ ఆభరణాలు వారి సేకరణలో భాగంగా చెబుతుంటారు ∙ఆలియాభట్ తన పెళ్లిలో 16వ శతాబ్దం నాటి అన్‌కట్ డైమండ్స్, కుందన్స్‌తో చేసిన ఆభరణాలను ధరించారు. మొఘల్ ఆభరణాల శైలిని ఆమె తన ఆభరణాల డిజైన్స్‌తో పునరుజ్జీవింపజేశారు.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Tags : 1