ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్
Breaking News
వేసవి సంజీవని సబ్జా
Published on Fri, 05/01/2026 - 00:42
ఈ సీజన్‌లో వేడి చేసిందని అంటే ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు ‘సబ్జా గింజలు నాన బెట్టిన నీళ్లు తాగు’ అని సలహా ఇస్తుంటారు. నిజంగానే సబ్జా గింజలు నానబెట్టిన నీళ్లు, నన్నారి, మజ్జిగ, లస్సీ, ఫలూదా, కొబ్బరి నీళ్లు... ఇవన్నీ ఎంత చలువ చేస్తాయో చూస్తూనే ఉంటాం. కాని సబ్జా గింజలు ఉపయోగించాలని చెప్తే తప్ప గుర్తు చేసుకోము.
స్వీట్ బేసిల్
సబ్జా గింజలు తులసి జాతికి చెందిన ‘కామన్ బేసిల్’ మొక్క విత్తనాలు. వీటిని ‘స్వీట్ బేసిల్’ లేదా ‘టూక్‌మరియా’ అని కూడా అంటారు. నల్లగా, నువ్వు గింజలకన్నా చిన్నగా ఉంటాయి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో విరివిగా పండిస్తున్నారు. ఎండని తట్టుకుని పెరిగే పంట కాబట్టే చలువ గుణం జాస్తి. సబ్జా గింజల్లో ‘మ్యుసిలేజ్’ అనే జిగురు పదార్థం ఉంటుంది. నీళ్లలో వేయగానే 30 రెట్లు ఉబ్బి, చుట్టూ జెల్లీ లాంటి పొర ఏర్పడుతుంది. ఈ జెల్లీనే శరీరంలోకి వెళ్లాక అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అందుకే దీన్ని ‘నేచురల్ కూలెంట్’ అంటారు. దీనిలో ఫైబర్, ఐరన్, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం.
బాడీ హీట్ తగ్గిస్తుంది
కడుపులో మంట, కళ్లు మండటం, యూరిన్ ఇన్ఫెక్షన్ – అన్నీ శరీరం వేడెక్కడం వల్లే. సబ్జా లోపల్నుంచి చల్లబరుస్తుంది. డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. నీళ్లను పీల్చుకుని జెల్లీగా మారి, ఆ నీటిని కొంచెం కొంచెంగా శరీరానికి అందిస్తుంది. అందుకే ఎండలో తిరిగినా నీరసం రాదు. బయట తిండి, మసాలాలు తిని కడుపు మండుతుంటే గ్లాస్ సబ్జా నీళ్లు తాగితే 10 నిమిషాల్లో రిలీఫ్ వస్తుంది. షుగర్, బీపీ ఉన్న వాళ్లకు కూడా మంచిది.
పిల్లలు, స్త్రీలు,వృద్ధులకు ఎలా వాడాలి?
పిల్లలకు అర టీస్పూన్ గింజలు నానబెట్టి ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే కడుపు ఉబ్బరం. రోజ్ మిల్క్, పుచ్చకాయ జ్యూస్‌లో కలిపితే మారు మాట్లాడకుండా తాగేస్తారు. వేసవిలో చెమటకాయలు, మూత్రంలో మంట రాకుండా సబ్జా గింజలు కాపాడతాయి. స్త్రీలకు నెలసరి సమయంలో కడుపులో మంట, వేడి చేస్తుంటే సబ్జా మజ్జిగ చాలా మంచిది. బాలింతలకు పాలు పడతాయి. ఐరన్ ఉండటం వల్ల నీరసం తగ్గుతుంది. (గమనిక: గర్భిణులు మొదటి 3 నెలలు డాక్టర్‌ని అడిగి వాడాలి) వృద్ధులకు మలబద్ధకం, అసిడిటీ, నిద్రలేమిలకు సబ్జా మంచి మందు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో స్పూన్ నానిన సబ్జా వేసుకుని తాగితే సుఖ నిద్ర పడుతుంది.
వడ దెబ్బకు
ఎండలో బయటికి వెళ్లే అరగంట ముందు ఒక గ్లాస్ నిమ్మ సబ్జా షర్బత్ తాగి వెళ్లండి. సబ్జా శరీరంలో నీటిని నిలుపుతుంది కాబట్టి డీహైడ్రేట్ అవరు. తలకు టోపీ, కడుపులో సబ్జా – ఇక వడదెబ్బ మీ జోలికి రాదు.
వడదెబ్బ తగిలితే వాంతులు, విరోచనాలు, తల తిరగడం వస్తుంది. అప్పుడు వెంటనే నీడలోకి చేర్చి, తడి గుడ్డతో ఒళ్లు తుడవాలి. ఒక గ్లాస్ చల్లటి నీళ్లలో 2 స్పూన్ల నానిన సబ్జా + చిటికెడు ఉప్పు + చెంచాడు చక్కెర కలిపి తాగించాలి. ఇది ఓఆర్‌ఎస్ కంటే ఎక్కువ పని చేస్తుంది. తల మీద, అరికాళ్లకి నానిన సబ్జాని పట్టులా వేస్తే వేడి వెంటనే దిగుతుంది. ఇది మన బామ్మల చిట్కా.
ఎలా వాడాలి?
ముఖ్య నియమం ఏమిటంటే సబ్జా గింజల్ని ఎప్పుడూ నానబెట్టకుండా తినకూడదు. నేరుగా తింటే కడుపులో వెళ్లి ఉబ్బి నొప్పి వస్తుంది. 1 టీస్పూన్ సబ్జా గింజలకు
ఒక గ్లాస్ నీళ్లు పోసి 15–20 నిమిషాలు నానబెట్టాలి. నల్ల గింజలు తెల్లటి జెల్లీతో ఉబ్బుతాయి. అప్పుడు వాడుకోవాలి.
పెరుగు అన్నంలో
అన్నంలో పెరుగు కలిపాక, 1 స్పూన్ నానబెట్టిన సబ్జా వేసుకుని తింటే కడుపుకి చలువ, రుచికి రుచి.
రాగి జావ/అంబలిలో
వేసవిలో తాగే రాగి జావలో సబ్జా కలిపితే డబుల్ కూలింగ్.
ఫ్రూట్ సలాడ్‌లో
పుచ్చకాయ, ఖర్బూజా ముక్కల మీద సబ్జా చల్లుకుని తింటే పిల్లలు ఇష్టంగా తింటారు.
పానీయాలలో ఎలా వాడాలి?
నిమ్మ షర్బత్ + సబ్జా
ఒక గ్లాస్ చల్లటి నీళ్లలో నిమ్మరసం, కొద్దిగా బెల్లం, చిటికెడు ఉప్పు, 2 స్పూన్లు నానిన సబ్జా వేసి తాగితే – ఇదే వేసవి అమృతం.
రోజ్ మిల్క్/ ఫలూదా
పిల్లలు ఇష్టపడే ఫలూదాలో ప్రధానమైనది సబ్జానే. పాలల్లో రోజ్ సిరప్, సబ్జా, ఐస్ వేసుకుంటే సరిపోతుంది.
మజ్జిగ సబ్జా
మజ్జిగలో కరివేపాకు, కొత్తిమీరతో పాటు సబ్జా వేసి తాగితే వడదెబ్బ దరిచేరదు.
కొబ్బరి నీళ్లు సబ్జా
కొబ్బరి బోండాం నీళ్లలో సబ్జా వేసుకుంటే ‘నేచురల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్’ రెడీ.
సో... సబ్జాకి జిందాబాద్ అనండి. సూర్యనారాయణ బాబాయ్‌ని ఈ నల్ల గింజలతో శాంతింపచేసుకోండి.
Tags : 1