కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు
Breaking News
నీరు-మీరు కిడ్నీ-డీ–హైడ్రేషన్...బ్లడ్ రిలేషన్
Published on Sun, 04/12/2026 - 04:51
ఇటీవల వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలను కొలిచే మెర్క్యూరీ స్కేలుపై ఎండ తీవ్రత పైపైకి ఎగబాకుతోంది. ఎండ తీవ్రత ఎక్కువవుతున్న కొద్దీ దేహంలోని కొన్ని కీలక అవయవాల మీద ‘డీ–హైడ్రేషన్ స్ట్రెస్’ కూడా పెరుగుతూ పోతుంది. అందులో మరింత కీలకమైనవి మన మూత్రపిండాలు. అందుకే మిగతా సీజన్‌లతో పోలిస్తే వేసవిలో కిడ్నీ సమస్యలతో హాస్పిటల్స్‌కు వచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతుంటుంది.
ఈ ఏడాది కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే ఇక్కడ కాస్త సమస్య ఏమిటంటే... వేసవి తీవ్రతవల్ల... దాంతో కలిగే డీ–హైడ్రేషన్ కారణంగా కిడ్నీపై పడే ఒత్తిడి అంత త్వరగా గుర్తించడానికి కుదరదు. అందుకే ఎండ్ ఆర్గాన్ అయిన మూత్రపిండాలపై పడే దుష్ప్రభావాల గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ వేసవిలో కిడ్నీ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే చేయాల్సినవీ, తెలుసుకోవాల్సినవి ఏమిటో చూద్దాం.
కిడ్నీలు దేహంలోని నీరు, అందులోని అనవసర లవణాలూ, విషాలూ (టాక్సిన్స్) వంటి వాటిని వడబోసి, వ్యర్థాలను బయటకు పంపుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటితో ఖనిజ లవణాలను తిరిగి దేహానికే పంపించడం ద్వారా ఎలక్ట్రొలైట్ బ్యాలెన్స్ అనే కీలకమైన బాధ్యతలను నెరవేరుస్తుంటాయి.
ప్రతికూల ప్రభావం చూపే ఎండ తీవ్రత...
ఎవరైనా వ్యక్తి ఎండ తీవ్రత తాలూకు అధిక ఉష్ణోగ్రతలకు అదేపనిగా చాలాసేపు ఎక్స్‌పోజ్ అవుతూ ఉన్నప్పుడు అతడి దేహం నుంచి చెమట రూపంలో చాలా ఎక్కువ ద్రవాలను కోల్పోతుంటాడు. అలా అతడు కోల్పోయిన ద్రవాలను తిరిగి భర్తీ చేయకపోతే రక్తం కొంత చిక్కబడిపోవడంతో రక్తప్రవాహం అంత సాఫీగా ప్రవహించకపోవచ్చు. దాంతో కిడ్నీలకు తగినంత రక్తం అందక వాటిపై కొంత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కిడ్నీ పనితీరు కాస్తంత కుంటుపడే అవకాశముంటుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ (ఏకేఐ) అంటారు.
ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ... పెరిగే ఏకేఐ, కిడ్నీ స్టోన్స్‌ల ముప్పు...
ఎండతీవ్రతకు ఎంతగా ఎక్స్‌పోజ్ అవుతుంటే... అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ ముప్పు అంతగా పెరుగుతుంది. వాతావరణంలో వేడిమి పెరుగుతున్న కొద్దీ కిడ్నీపై దాని దుష్ప్రభావాలు కనీసం 20% నుంచి 30% వరకు పెరుగుతుంటుంది. అంతేకాదు... కిడ్నీలో రాళ్లు, మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ – యూటీఐ)ల ముప్పు కూడా పెరుగుతుంది. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ సమస్య చాలాకాలం పాటు కొనసాగితే అది క్రానిక్ కిడ్నీ డిసీజ్–సీకేడీ వంటి తీవ్రమైన సమస్యకు దారితీసే ముప్పూ ఉంటుంది.
రాళ్లు ఎందుకు పెరుగుతాయంటే...
దేహంలో నీటి మోతాదులు తగ్గగానే లవణాల గాఢత పెరుగుతుంది. దాంతో లవణాలు రాళ్లలా మారతాయి. అందుకే దేహంలో నీటి మోతాదులు తగ్గుతున్న కొద్దీ కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు పెరుగుతుంది.
యూటీఐలు మహిళల్లో ఎక్కువ...
కిడ్నీ ఇంజ్యూరీ కేసులు పురుషుల్లో ఎక్కువ...
దేహ నిర్మాణపరంగా (అనటామికల్‌గా) చూసినప్పుడు పురుషులతో పోలిస్తే మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ పొడవు కాస్త తక్కువగా ఉండటం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐలు) మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కిడ్నీ ఇంజ్యూరీ కేసులు మాత్రం పురుషుల్లోనే ఎక్కువ. (మొత్తం కేసుల్లో దాదాపు 65% నుంచి 75%వరకు పురుషులవే).
ఈ లక్షణాలను గమనిస్తూ ఉండాలి...
మునపటి కంటే మూత్రం తక్కువగా వస్తుండటం, మూత్రం చాలా చిక్కటి రంగు (డార్క్ కలర్)తో రావడం, ముఖం/కాళ్లలో వాపు, తీవ్రమైన అలసట (ఫెటీగ్), ఏదీ తినలేకపోవడం, మూత్రవిసర్జనలో నొప్పి / ఇబ్బంది వంటి లక్షణాలు తగ్గకుండా అదేపనిగా కొనసాగుతూ ఉన్నప్పుడు డాక్టర్‌ను కలవడం మంచిది.
నివారణ కోసం...
అది అక్యూట్ కిడ్నీ ఇంజ్యురీ (ఏకేఐ) సమస్య అయినా, కిడ్నీలో రాళ్లు లేదా మూత్రంలో ఇన్ఫెక్షన్ల సమస్య అయినా... దేహం కోల్పోయిన నీటి మోతాదును ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండటమే నివారణ. ఇందుకోసం తగినన్ని నీళ్లు తాగుతూ ఉండటంతో పాటు వీలును బట్టి కొబ్బరినీళ్లు, పండ్లరసాలు, కొద్దిగాఉప్పుతో నిమ్మరసాలు వంటి ద్రవాహారాలు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా నొప్పినివారణ మాత్రలు (పెయిన్ కిల్లర్స్) వాడకూడదు. ఇక కిడ్నీ సమస్య ఉన్నవారైతే ఎట్టిపరిస్థితుల్లో వాటిని వాడకపోవడమే మంచిది. తప్పనిసరిగా వాడాల్సివస్తే డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి.
డా‘‘ రవికుమార్ ఎ.వి.
సీనియర్ కన్సల్టెంట్‌యూరాలజిస్ట్ –కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్
∙తెలుసుకుందాం
55% ప్లాస్మా...
ఇందులో లవణాలు, ప్రోటీన్లు, ఇమ్యూనోగ్లోబ్యులిన్‌లు ఉండి ప్రాణాలను రక్షించే వ్యాధి నిరోధక వ్యవస్థ తాలూకు కణాలను కలిగి ఉంటాయి.
కాంపోనెంట్లు...
వాటి ఉపయోగాలు...
90% రక్తంలోని 90 శాతంలో నీరే ఉంటుంది.
45%
ఫార్మ్‌డ్ ఎలిమెంట్లు ఇందులో ఎర్రరక్తకణాలు (ఆర్‌బీసీ), తెల్లరక్తకణాలు (డబ్ల్యూబీసీ), ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ఆ వేర్వేరు కాంపోనెంట్లలోని పదార్థాలూ విధులవి...
1,50,000 నుంచి 4,00,000
ప్లేట్‌లెట్లు శరీరానికి ఏదైనా గాయం తగిలి, రక్తస్రావం జరుగుతుంటే రక్తాన్ని గడ్డకట్టించడం ద్వారా ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలు. వీటి సంఖ్య ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్‌కు (ఎమ్‌ఎమ్ క్యూబ్‌కు 1,50,000 నుంచి 4,00,000 ఉండాలి. వీటి సంఖ్య తగ్గుతున్న కొద్దీ అంతర్గత రక్తస్రావం జరగవచ్చు. లేదా గాయం తగిలినప్పుడు ఎంతకీ రక్తం గడ్డకట్టక అలా రక్తస్రావం జరుగుతూ పోయి ప్రాణాపాయం కలగవచ్చు.
8%
సాల్ట్స్, హార్మోన్లు, ప్రోటీన్లు, బైకార్బొనేట్ అయాన్లు ఉంటాయి. ఇందులో లవణాల అయాన్లతోనే మెదడునుంచి వచ్చే ఆదేశాలు వివిధ అవయవాలకు చేరుతుంటాయి. హార్మోన్లు కీలకమైన జీవక్రియలు నిర్వహిస్తుంటాయి. ఇక బైకార్బొనేట్ అయాన్లు వివిధ రకాల ఆమ్ల, క్షార పదార్థాలను విరిచేసి, మామూలుగా చేస్తాయి. (న్యూట్రలైజ్ చేస్తాయి).
4.3 నుంచి 5.9 మిలియన్లు
పురుషుల్లో ఉండాల్సిన నార్మల్ ఎర్రరక్తకణాలు 4.3 నుంచి 5.9 మిలియన్స్ పర్ ఎమ్‌ఎమ్ క్యూబ్... అలాగే మహిళల్లోనైతే 3.5 నుంచి 5.5 మిలియన్స్ పర్ ఎమ్‌ఎమ్ క్యూబ్ ఉండాలి. దీని కంటే ఎర్రరక్తకణాల్లో హీమోగ్లోబిన్ మోతాదులను తెలుసుకోవడం అవసరం అది పురుషుల్లో ప్రతి డెసీలీటర్‌కు 13.5 నుంచి 17.5 గ్రాములూ, ప్రతి డెసిలీటర్‌కు మహిళల్లో 12.0 నుంచి 16.0 గ్రాములు ఉండాలి. ఇదే రక్తాన్ని ఎర్రగా కనిపించేలా చేస్తూ, జీవకణాలన్నింటికీ ఆక్సిజన్‌ను చేరవేస్తుంటుంది. అలాగే వెలువడే వ్యర్థాలు, కాలుష్యాలను బయటకు చేరవేసేవి కూడా ఆర్‌బీసీనే.
4,500 నుంచి 11,000
తెల్లరక్తకణాలు ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్ (ఎమ్‌ఎమ్)లో 4,500 నుంచి 11,000 ఉండాలి.
మన శరీరాన్ని బయటి నుంచి దాడి చేసే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడే రక్షణ కణాలు ఈ తెల్లరక్తకణాలే. ఇందులో మళ్లీ ఐదు రకాల కణాలుంటాయి. అవి...
∙న్యూట్రోఫిల్స్ : ఇవి శరీరాన్ని బ్యాక్టీరియా, ఫంగైలనుంచి రక్షిస్తాయి.
∙లింఫోసైట్స్ : ఇవి కొన్ని రకాల వైరస్‌ల నుంచి, క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
∙మోనోసైట్స్ : చెడిపోయిన కణాలను నిర్మూలించి, ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులనుంచి ఇవి మన శరీరాన్ని కాపాడతాయి.
∙ఇజినోఫిల్స్ : ఇవి కొన్ని రకాల పరాన్న జీవుల నుంచి, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి.
∙బేసోఫిల్స్ : ఇవి అలర్జీల నుంచి రక్షణ కలిగిస్తాయి.
రక్తం నిర్వహించే విధులివి...
→ ఆహారం జీర్ణమై అది గ్లూకోజ్‌గా మారాక అన్ని కణాలకూ దాన్ని అందించడానికి రక్తం తోడ్పడుతుంది. గ్లూకోజ్‌తో పాటు అమైనోయాసిడ్స్, ఫాటీయాసిడ్స్‌నూ కణాలన్నింటికీ అందజేస్తుంది.
→ రక్తంలోని గ్లూకోజ్ వల్ల శరీరంలో శక్తిని ఇచ్చే జీవక్రియలు జరుగుతాయి. దీన్నే మెటబాలిజమ్ అంటారు. ఈ క్రమంలో కార్బన్–డై–ఆక్సైడ్, యూరియా, లాక్టిక్ యాసిడ్ వంటి కొన్ని కాలుష్యాలు, వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని శుభ్రపరిచేందుకు ఉద్దేశించిన మూత్రపిండాల వంటి అవయవాల వద్దకు ఆ వ్యర్థాలను చేరవేసేది కూడా రక్తమే. రక్తంలోని తెల్లరక్తకణాలు బయటి నుంచి శరీరంలోకి ప్రవేశించే రోగకారక క్రిములతో పోరాడి, మనకు వ్యాధినిరోధకతను కల్పిస్తాయి. ఈæ కీలకమైన కార్యకలాపాలన్నీ నిత్యం జరగాల్సి ఉంటుంది కాబట్టే... ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం అవుతుంటే, దాన్ని కట్టడి చేయడానికి మన శరీరం కృషి చేస్తుంది. రక్తస్రావం మొదలుకాగానే రక్తం చుట్టూ ఒక వల లాంటిది ఏర్పడి రక్తం గడ్డకట్టి, స్రావాన్ని ఆపేందుకు ప్లేట్‌లెట్స్ తోడ్పడతాయి.
డాక్టర్ బోయెళ్ల పవన్ కుమార్
సీనియర్ హెమటాలజిస్ట్ – మెడికల్ ఆంకాలజిస్ట్
నిర్వహణ: యాసీన్
Tags : 1