Breaking News

వీథి దీపం వెలగకపోతే...!!!

Published on Mon, 11/20/2023 - 00:27

‘అచ్చమైన దీప సన్నిధిని మరుగిడబడి చెఱచినట్లున్నది...’. అంటున్నాడు త్యాగయ్య ఆ కీర్తనలో. కాంతినివ్వడం ఒక్కటే దీపశిఖ లక్షణం. దీపానికీ, ఈశ్వరుడికీ ఓ లక్షణం ఉంటుంది. వీథి దీపం వెలుగుతుంటే ఆ వెలుగులో అక్కడేమయినా పామున్నా, తేలున్నా తెలుస్తుంది. గుంటలు, రాళ్ళురప్పా కనబడతాయి... అని చెప్పి ‘ఓ దీపమా! నా మార్గమును నిష్కంటకం చేసితివి, నాకు దారి చూపితివి. నీకిదే నా నమస్కారం..’ అంటూ ధ్యానశ్లోకాలంటూ ఏమీ ఉండవు దానికి.

అయితే మనకు దారి చూపినందుకు దానికేసి గౌరవంగా చూస్తాం. ఓ రోజున ఒక ధూర్తుడు రాయి విసిరి దాన్ని పగలగొట్టాడు. ఇంతమందికి వెలుగిచ్చే దీపం, ఇంతమందికి దారిచూపే దీపం... అది మలిగిపోయేటట్లు చేస్తే ... రాయి విసిరినవాడిపై ఆ దీపమేమీ తిరగబడదు. ఆ వెలుగు ప్రయోజనాన్ని అనుభవిస్తున్న మనం దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ‘‘అది లేకపోయినా ఫరవాలేదు.

మా బతుకు మేం బతికేస్తాం ...’’ అంటే దీపానికి వచ్చిన నష్టమేమీ లేదు... మనకు మాత్రం ఆ చీకటే మిగులుతుంది, దానిలో దేవులాటే ఉంటుంది. భగవంతుడు కూడా అంతే. ‘నివాసవృక్షః సాధూనాం ఆపన్నానాం పరాగతిః/ఆర్తానాం సంశ్రయశ్చైవ యశసః చ ఏకభాజనమ్‌’.. అంటారు కిష్కింధకాండలో. భగవంతుడున్నాడు.. అని నీవు నమ్మి బతకగలిగితే భగవదనుగ్రహం. ఆయనేమిటి ? ఆయనెందుకు?.. అని చెప్పి ఆయనను తిరస్కరిస్తే చీకటి మిగిలేది మనకే, ఆయనకు కాదు. ‘అచ్చమైన దీపశిఖ సన్నిధిని మరుగు అడ్డుపడి చెఱచినట్టున్నది...’

ఓ దట్టమైన బట్టలాంటిది అడ్డు వచ్చిందనుకోండి.. అప్పుడు ఆ వెలుతురూ ఉండదు. దాని సహాయంతో చూసే అవకాశమూ ఉండదు. కాబట్టి ఆ దీపశిఖ నాకు కనబడడం లేదు... అంటే ఆ దీప శిఖ మరేదోకాదు, పరబ్రహ్మమే. అది ఒక్కటే వెలుగుతోంది.

‘‘లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెంజీకటికవ్వల నెవ్వండేకాకృతి వెలుగునతని నే సేవింతున్‌’’ అంటారు పోతన గారు భాగవతంలో...అటువంటి వెలుగు ఇక్కడ వెలుగుతుంది. కానీ ఆ దీపం కనబడకుండా ఒక తెర అడ్డుపడుతున్నది. ఈ తెరను నేను తీయలేను ... అని ఆర్తితో వేడుకుంటున్నాడు త్యాగయ్య. ఇదెలా ఉందంటే...‘మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతియున్నది’ అని పోలికను చెబుతున్నాడు. చేప దానిదారిన అది పోతూ దారిలో కనిపించిన ఎరచూసి ఆశపడింది.

దాన్ని కొరికింది. ‘మఛ్లీ జల్‌ కా రాణీ, ఉస్కా జీవన్‌ పానీ, హాథ్‌ లగావ్‌ తో డర్‌ జాయేగీ, బాహర్‌ నికాలేతో మర్‌ జాయేగీ’’.. ఇంకేముంది.. నీళ్ళలోంచి తీసి భూమ్మీద పడేస్తే చచ్చిపోయింది. అంటే తిందామనుకుని తినబడింది. ఈ మత్సరమను తెరతీయనంతకాలం నా పరిస్థితీ ఇంతే.. దీపం కనిపించదు.. స్వామీ ఆ తెరతీయి.. అంటే. అరిషడ్వర్గాల గురించీ నీ ద్వారా ఒక సందేశం లోకానికి అందాలని అనుకున్నాడేమో, ఆయన ఆ తెరనుదీసి దర్శనమిచ్చాడు. ఇదీ సంగీతంవల్ల, పాట పాడడం వల్ల, వినడం వల్ల ప్రయోజనం. అది ఆయనకే కాదు అందరి ఆత్మోద్ధరణకు కారణమయి నిలిచింది. అంత గొప్ప వాగ్గేయకారులు, లోకానికి ఆధ్యాత్మిక భిక్ష పెట్టినవారు, దీప స్తంభాల వంటివారు.. మన మధ్య గడిపిన వారు కావడం మన అదృష్టం.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)