పద్మ–పిప్పలాదుల చరిత్ర

Published on Sun, 04/27/2025 - 07:37

పద్నాలుగో మనువు ఇంద్రసావర్ణి. అతడి వంశంలో జన్మించిన అనరణ్యుడు చక్రవర్తిగా ఎదిగాడు. అతడు సప్తద్వీపాలను పరిపాలిస్తుండేవాడు. గొప్ప శివభక్తుడైన అనరణ్యుడు భృగుమహర్షిని బ్రహ్మగా చేసుకుని, వంద యజ్ఞాలను విజయవంతంగా పూర్తి చేసి, ఇంద్రపదవికి అర్హత పొందాడు. అయినా, స్వార్థరహితుడు కావడంతో ఇంద్రపదవిని తిరస్కరించాడు. అనరణ్యుడికి వందమంది కొడుకులు, పద్మ అనే ఒకే ఒక కూతురు కలిగారు. చక్రవర్తి దంపతులకు కొడుకులపై కంటే కూతురుపైనే ప్రేమ ఎక్కువ. పద్మకు యుక్తవయసు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని సంకల్పించి అనరణ్యుడు రాజులందరికీ స్వయంవరం కోసం ఆహ్వానపత్రాలు పంపాడు. 

ఇదిలా ఉంటే, లోకసంచారం చేస్తున్న పిప్పలాద మహర్షి ఒకనాడు ఒక గంధర్వుడు స్త్రీలతో జలక్రీడలు ఆడుతుండగా చూశాడు. ఆ దృశ్యం చూడటంతో పిప్పలాదుడికి వివాహం చేసుకోవాలనే కోరిక పుట్టింది. అప్పటి నుంచి తపస్సు మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. ఒకనాడు యథాప్రకారం పుష్పభద్రా నదిలో స్నానం చేస్తున్న పద్మను చూశాడు. ఆమె అందచందాలకు ఆకర్షితుడై, అక్కడే ఉన్న ఆమె చెలికత్తెలను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమె అనరణ్య చక్రవర్తి కుమార్తె అని, త్వరలోనే ఆమెకు స్వయంవరం జరగబోతోందని చెలికత్తెలు చెప్పారు. 

పిప్పలాదుడు నేరుగా అనరణ్యుడి రాజసభకు వెళ్లాడు. అనరణ్యుడు అతడికి అతిథి మర్యాదలు చేశాడు. ‘రాజా! నీ కుమార్తె పద్మను నేను మోహించాను. నాకు ఆమెనిచ్చి వివాహం జరిపించు. లేకుంటే, నీ ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేస్తాను’ అన్నాడు. పిప్పలాదుడి కోరిక విని రాజసభలో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. వారంతా అతడి తేజస్సు చూసి భయభ్రాంతులయ్యారు.వృద్ధుడైన పిప్పలాదుడికి సుకుమారి అయినా రాకుమార్తెను ఇవ్వడం ఇష్టంలేక రాజకుటుంబంలోని స్త్రీలందరూ రోదించడం ప్రారంభించారు. విపత్కరమైన ఈ పరిస్థితిలో ఏంచేయాలో అనరణ్యుడికి ఏమీ తోచలేదు.

 వెంటనే అతడు రాజగురువును, రాజపురోహితుడిని సంప్రదించాడు. ‘ఈ విపత్కర స్థితిలో ఆచరించదగిన ధర్మమేమిటో మీరే చెప్పండి’ అని వారిని అడిగాడు.‘ఒక్కరి కారణంగా సర్వనాశనం జరిగే పరిస్థితి తలెత్తినప్పుడు, ఆ ఒక్కరినీ త్యాగం చేసి, సర్వాన్నీ కాపాడుకోవాలి. ఇదే వేదధర్మం’ అని వారు చెప్పారు. రాజగురువు, రాజపురోహితుడు ఇచ్చిన సలహాపై అనరణ్యుడు తన కూతురు పద్మను పిప్పలాదుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం తర్వాత పిప్పలాదుడు తనతో పాటే పద్మను అరణ్యంలోని ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. ఆమె ఆశ్రమవాసంలో ఉంటూ, భర్తను భక్తిశ్రద్ధలతో సేవించుకోసాగింది. భర్త మనసెరిగి ప్రవర్తించసాగేది. అలా పద్మా పిప్పలాదుల దాంపత్యం అన్యోన్యంగా కొనసాగేది. 

ఒకనాడు పద్మ నదిలో స్నానం చేసి, నీళ్లకడవ నెత్తిన పెట్టుకుని, ఆశ్రమానికి తిరిగి వస్తోంది. ఆమెను పరీక్షించదలచిన ధర్ముడు రాజవేషంలో ఆమెకు దారిలో ఎదురయ్యాడు. నానాలంకార భూషితుడై, నవయవ్వనంతో మెరిసిపోతున్న ధర్ముడు అపరమన్మథుడిలా ఉన్నాడు. ధర్ముడు పద్మను అడ్డగించి, ‘ఓ సుందరీ! నువ్వెవరివి? నీ తల్లిదండ్రులెవరు? నీ సౌందర్యానికి నేను దాసుడిని. నిన్ను పెళ్లాడాలనుకుంటున్నా’ అన్నాడు.పద్మ అతడి ప్రశ్నలకు ముక్తసరిగా బదులిచ్చి, ‘నాకు పెళ్లయింది. నా భర్త పిప్పలాద మహర్షి’ అని చెప్పింది.‘ఓహో! ఆ తలనెరిసి, శరీరం ముడుతలు పడిన వృద్ధుడేనా నీ భర్త! నిండుజాబిలిలాంటి అందగత్తెవు నీవెక్కడ? పండుకోతిలాంటి వృద్ధుడు ఆ పిప్పలాదుడెక్కడ? నీ సౌందర్యం రాజపూజితం. 

నీవంటి సౌందర్యరాశి నాలాంటి రాజులకే తగును గాని, ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే మునిముచ్చులకు కాదు. నువ్వు నాతో రా! స్వర్గసౌఖ్యాలను అనుభవించవచ్చు’ అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు.పద్మకు సహనం నశించింది. ‘ఓరీ పాపాత్ముడా! దూరంగా ఉండు. పరస్త్రీని కామంతో చూసిన నువ్వు తప్పక నశిస్తావు. తపోధనుడైన నా భర్త పిప్పలాడుదెక్కడ? కామాతురుడవై, ఉచితానుచిత జ్ఞానంలేని నువ్వెక్కడ? కాలగతిలో నీకు క్షయం తప్పదు’ అని శపించింది.ఆమె శాపానికి ధర్ముడు గడగడలాడాడు. రాజవేషాన్ని విడిచి, నిజరూపంలో దర్శనమిచ్చాడు. ‘తల్లీ! నేను ధర్మదేవుడిని. గురువులకు గురువును. ఈశ్వర ప్రేరేపితుడనై, ఈ చిలిపి పని చేశాను. నాకు తగిన శాస్తి చేశావు. తల్లీ! నా శాపవిమోచనాన్ని కూడా నువ్వే అనుగ్రహించు’ అని అభ్యర్థించాడు.

పశ్చాత్తాపం చెందిన పద్మ, ‘ధర్ముడా! పతివ్రతా శాపం ఫలించి తీరుతుంది. ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ క్షోభిస్తాయి. అందువల్ల నేనొక వ్యవస్థను నిర్ణయిస్తున్నాను. కృతయుగంలో నువ్వు నిండు చంద్రుడిలా పరిపూర్ణంగా ఉంటావు. ఆ తర్వాత త్రేతా, ద్వాపర, కలి యుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున క్షీణిస్తూ ఉంటావు. కలియుగాంతం నాటికి అమావాస్య చంద్రుడిలా పూర్తిగా అదృశ్యమైపోతావు. కలియుగాంతం తర్వాత తిరిగి ఆరోహణ క్రమంలో వచ్చే ద్వాపర, త్రేతా, కృతయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ పరిపూర్ణ స్థితిని పొందుతావు. ఇక నేను నా భర్త దగ్గరకు వెళతాను’ అని పలికింది.అప్పుడు ధర్ముడు ‘ఓ పతివ్రతా శిరోమణీ! నీకు మంగళమగుగాక. నీ భర్త పిప్పలాదుడికి నిత్యయవ్వనం సిద్ధిస్తుంది. అతడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు. నీకు సర్వసౌఖ్యాలు కలుగుతాయి’ అని దీవించి అదృశ్యమయ్యాడు.
∙సాంఖ్యాయన 

#

Tags : 1

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)