బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం
Breaking News
వైష్ణవ తిలకం అర్థం తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు!
Published on Thu, 03/26/2026 - 11:01
భారతీయ సనాతన ధర్మంలో నుదుట ధరించే తిలకానికి విశిష్టస్థానం ఉంది. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో కనిపించే 'U' ఆకారపు తిలకం వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు, శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. వైష్ణవ సంప్రదాయంలో విశిష్టంగా కనిపించే 'U' ఆకారపు ఊర్ధ్వపుండ్రం వెనుక దాగి ఉన్న పరమార్థం ఏమిటి? భగవంతుడి పాదపద్మాలకు చిహ్నంగా భావించే ఈ తిలకం, మనిషిలోని అహాన్ని తొలగించి ఆధ్యాత్మిక పురోగతికి ఎలా బాటలు వేస్తుందో తెలుసుకుందాం..
వైష్ణవ భక్తులు ధరించే 'U'’ ఆకారపు తిలకాన్ని ‘ఊర్ధ్వపుండ్రం’ అని పిలుస్తారు. ఆధ్యాత్మిక పరిభాషలో ‘ఊర్ధ్వ’ అంటే పైకి, ‘పుండ్రం’ అంటే గుర్తు అని అర్థం. అంటే ఇది మనిషిని ఉన్నత స్థితికి లేదా మోక్ష మార్గానికి నడిపించే గుర్తు.
శాస్త్రాల ప్రకారం, 'U' ఆకారం సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడి పాదపద్మాలకు సంకేతం. నుదుటిపై ఈ తిలకాన్ని ధరించడం ద్వారా భక్తుడు తనను తాను పరమాత్మ పాదాల చెంత సమర్పించుకున్నట్లు భావిస్తారు. ఇది మనిషిలో అహంకారాన్ని తగ్గించి, వినయాన్ని, భక్తి భావాన్ని పెంపోందిస్తుంది.
ఆజ్ఞా చక్రం – శక్తి కేంద్రం...
మన శరీరంలో ఏడు ముఖ్యమైన చక్రాలు ఉంటే, అందులో నుదుటి మధ్య భాగం ‘ఆజ్ఞా చక్రం’గా పిలుస్తారు. ఇది జ్ఞానానికి, ఆలోచనా శక్తికి కేంద్రస్థానం.
ఏకాగ్రత: తిలకాన్ని ధరించే సమయంలో వేలితో ఆజ్ఞా చక్రాన్ని తాకడం వల్ల అక్కడి నరాలు ఉత్తేజితమవుతాయి. ఇది ఏకాగ్రతను పెంచి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
నాడుల కలయిక: ఊర్ధ్వపుండ్రంలోని రెండు నిలువు రేఖలు మన శరీరంలోని ఇడ, పింగళ నాడులను సూచిస్తాయి. వీటిని నుదుటిపై ధరించడం వల్ల ప్రాణశక్తి క్రమబద్ధం అవుతుంది.
గంధం, పసుపు.. ఆరోగ్య ప్రదాయిని...
తిలక ధారణలో ఉపయోగించే ద్రవ్యాలు కేవలం రంగు కోసం మాత్రమే కాదు, వాటిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. తెల్లటి చందనం లేదా పసుపు పచ్చని గంధాన్ని ధరించడం వల్ల నుదుటి భాగం చల్లబడుతుంది. ఇది కోపాన్ని తగ్గించి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కుంకుమ లేదా పసుపు మిశ్రమం యాంటీ–సెప్టిక్లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, సానుకూల ప్రకంపనలను ఆకర్షిస్తుంది.
శాస్త్రీయ కోణం...
ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం, రెండు కనుబొమ్మల మధ్య భాగంలో పీనియల్ గ్రంథి ఉంటుంది. దీనిని తరచుగా తిలకం ద్వారా తాకడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే విద్యార్థులు, మేధావులు తిలక ధారణను ఒక క్రమశిక్షణగా పాటిస్తారు.
నుదుట తిలకం ధరించడం కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు.. అది ఒక సంస్కారం. మన సంస్కృతిని ప్రతిబింబించే అద్దం. భగవంతుడిపై భక్తిని చాటడంతో పాటు, మానసిక వికాసానికి, ఆరోగ్యానికి ఈ ఊర్ధ్వపుండ్రం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.
– పసుపులేటి శ్రీలక్ష్మి, జర్నలిస్ట్
Tags : 1